New Parliament Building: కొత్త పార్లమెంటు భవనంలోకి దేశం..!

సెప్టెంబర్ 19న నిర్ణయించిన ముహూర్తం మేరకు పాత పార్లమెంటు నుంచి కొత్త పార్లమెంటు భవనంలో (New Parliament Building)కి ప్రధాని, స్పీకర్ తో సహా పార్లమెంటు సభ్యులంతా అడుగు మోపుతారు.

  • Written By:
  • Updated On - September 19, 2023 / 05:37 PM IST

By: డా.ప్రసాదమూర్తి

New Parliament Building: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. అధికార పార్టీ అదృశ్య అజెండాలు ఏమిటో తెలియదు కానీ ఈరోజు అంటే సెప్టెంబర్ 19న నిర్ణయించిన ముహూర్తం మేరకు పాత పార్లమెంటు నుంచి కొత్త పార్లమెంటు భవనంలో (New Parliament Building)కి ప్రధాని, స్పీకర్ తో సహా పార్లమెంటు సభ్యులంతా అడుగు మోపుతారు. ఈ సందర్భంగా పాత పార్లమెంటు భవనం ముందు అన్ని పార్టీల ఎంపీలు ఒక గ్రూప్ ఫోటో తీసుకుంటారు. పార్లమెంటు సమావేశాలు ఇక కొత్త భవనంలో సాగుతాయి. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇదొక మరపురాని ఘటన. మంగళవారం ప్రారంభ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ చాలా భావోద్విగ్యమైన ఉపన్యాసం చేశారు.

ఈ సందర్భంగా ఆయన పండిట్ జవహర్ లాల్ నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు గతంలో ప్రధాన మంత్రులుగా ఈ పాత పార్లమెంట్ భవనంలో పనిచేసిన అద్భుత సమయాలను గుర్తు చేసుకున్నారు. జవహర్లాల్ నెహ్రూ పట్ల నరేంద్ర మోడీ తన భక్తి శ్రద్ధల్ని ప్రకటించారు. అలాగే తమ పార్టీ తొలి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయిని తలుచుకున్నారు. ఆయన కాలంలో జరిగిన అనేక ప్రయోగాలను, శాస్త్ర సాంకేతిక ప్రగతిని సభకు గుర్తు చేశారు. ఇదంతా గత చరిత్ర. ఇప్పుడు పార్లమెంటు సభ్యులంతా కొత్త భవనంలోకి వెళ్తున్నారు. ఈ సందర్భంగా ప్రారంభ ఉపన్యాసం చేసిన ప్రధాని నరేంద్ర మోడీకే కాదు, 140 కోట్ల మంది భారతీయుల హృదయాలలో కూడా కొన్ని భావోద్విగ్నతలు ఉత్పన్నమవుతాయి.

పార్లమెంటు భవనం అంటే కేవలం ఇటుక సిమెంట్ లోహంతో నిర్మితమైంది కాదు. భారతదేశ అత్యున్నత చట్టసభ పార్లమెంట్ భవనం. స్వాతంత్ర్యం తరువాత మన దేశం తనను తానే స్వతంత్రంగా పరిపాలించుకోవడానికి తనను లక్ష్యాల వైపు నడిపించడానికి తన దిశను నిర్దేశించడానికి ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుంది. ఆ రాజ్యాంగ నిర్మాణం కోసం ఏర్పాటు అయిన రాజ్యాంగ సభకు నేతృత్వం వహించిన బాబాసాహెబ్ అంబేద్కర్ సహా పలువురు మేధావుల కృషి, స్వప్నం, ఆకాంక్షలు ఆధారంగా రాజ్యాంగం అమలులోకి వచ్చింది. పార్లమెంటు భవనం అంటే మన రాజ్యాంగం మౌలిక సూత్రాలైన శాంతి, సమానత్వం, ప్రజాస్వామ్యం, సౌబ్రాత్రుత్వం పునాదులుగా నిలిచిన భారతావని అనంత స్వప్న సంకేతం.

ఒక భవనం నుంచి మరొక భవనంలోకి అడుగుపెట్టడం అంటే కేవలం ఒక ఇంటి నుంచి మరో ఇంటిలోకి మకాం మార్చడం కాదు. భవనం పాతదైనా కొత్తదైనా మనం, మన కూడా తీసుకు వెళ్ళేది మన దేహాలను మాత్రమే కాదు. పార్లమెంటు భవనానికి మూల స్తంభాల్లాంటి మౌలిక సూత్రాలను, భారత పార్లమెంటు వ్యవస్థకు ప్రాణప్రదమైన లౌకికతను మన కూడా తీసుకువెళ్లడమే.

Also Read: Women’s Reservation Bill: మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు కేంద్రం ఆమోదం.. నేడు సభ ముందుకు బిల్లు..!

పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు బిజెపి వారు భావిస్తున్నట్టుగా అమృతకాలంలో జరుగుతున్నాయి. వినాయక చవితినాడు ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నిర్ధారిత ముహూర్తంలో కొత్త భవనంలోకి ప్రవేశిస్తున్నాం. కొత్త భవనంలో కీలకమైన అంశాలేవో బిల్లుల రూపంలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లుల రూపంలో కొత్త భవనంలో సరికొత్త విధివిధానాలను, చట్టాలను రూపకల్పన చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్న ఊహాగానాలు దేశమంతా వెల్లువెత్తుతున్నాయి.

ఇప్పటికే ఒకే దేశం ఒకే ఎన్నిక, సుదీర్ఘకాలం పెండింగ్ లో ఉన్న మహిళా బిల్లు మొదలైన అంశాలు చర్చలో ఉన్నాయి. ఇవి అన్నీ అలా ఉంచి, రాజ్యాంగంలోనే మౌలికమైన మార్పులు చేసే అవకాశాలు ఉన్నట్టు పలువురు మేధావులు హెచ్చరిస్తున్నారు. అసలు అమలులో ఉన్న రాజ్యాంగం యొక్క అవసరం ఈ ఆధునిక భారత దేశానికి తీరిపోయిందని మరో రాజ్యాంగాన్ని నిర్మించుకోవాలని ఆలోచనలు చేస్తున్నవారు అధికార పార్టీలో అప్పుడప్పుడు తలెత్తి వాదనలు వినిపిస్తున్నారు.

ఇలాంటి వాతావరణంలో దేశం ఎదుర్కొంటున్న మణిపూర్ లాంటి అనేక సమస్యల కల్లోల నేపథ్యంలో, నిరుద్యోగం అధిక ధరలు అవినీతి లాంటి సమస్యల సంక్షోభ సమయంలో ఇప్పుడు మనం కొత్త పార్లమెంటు భవనంలోకి అడుగుపెడుతున్నాం. అందరూ ఆనందిస్తున్నారు. కొందరు ఆందోళన పడుతున్నారు. కొందరు భయాలు వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్లో సంపూర్ణ మెజారిటీ ఉన్న అధికార పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఇప్పుడు హడావుడిగా ఈ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి కొత్త భవనంలోకి అందర్నీ తీసుకు వెళుతుందో అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. చూడాలి ఒక భవనం నుంచి మరో భవనంలోకి ఈ ప్రయాణాన్ని కేవలం భౌతికమైనదిగా చూడలేం.

అనేక జాతుల మతాల కులాల భాషల ప్రాంతాల సమ్మేళనమైన దేశం మనది. భిన్నత్వంలో ఏకత్వం ఆత్మగా కలిగిన అఖండ భారతావని మనది. అందుకే రాజ్యాంగానికి ఆత్మ లాంటి లౌకికత్వం, ఆ ఆత్మకు ప్రాణప్రదమైన మౌలిక సూత్రాలు ఎలాంటి ప్రమాదంలో పడకుండా కొత్త పార్లమెంటు భవనంలో కూడా సజీవంగా రక్షింపబడాలి. అందుకే ఒక భవనంలోంచి మరొక భవనంలోకి అడుగుపెట్టడం అంటే ఒక దేహం నుంచి మరొక దేహంలోకి ఆత్మ ప్రయాణించినట్టుగా ఈ కీలక ఘట్టం ఆవిష్కృతం కావాలి. పాత పార్లమెంటు భవనం నుంచి కొత్త పార్లమెంటులోకి కేవలం ప్రజలతో ఎన్నుకోబడిన వ్యక్తులు కాదు దేశమే ప్రవేశిస్తోంది. అంటే మన రాజ్యాంగం ఒక రక్షా కవచాన్ని విడిచి, మరింత పటిష్టమైన, అభేద్యమైన మరో రక్షా కవచం లోకి తనను తాను ప్రవేశపెట్టుకుంటోంది. జయహో ఇండియా.. జయహో భారత్.