Presidential Election : రాష్ట్ర‌ప‌తిగా ఆదివాసీ, ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ముస్లిం?

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వెలువ‌డిన‌ప్ప‌టికీ అభ్య‌ర్థిత్వంపై అధికార‌, విప‌క్ష పార్టీలు ఒక నిర్ణ‌యానికి రాలేక‌పోతున్నాయి

  • Written By:
  • Updated On - June 15, 2022 / 02:37 PM IST

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వెలువ‌డిన‌ప్ప‌టికీ అభ్య‌ర్థిత్వంపై అధికార‌, విప‌క్ష పార్టీలు ఒక నిర్ణ‌యానికి రాలేక‌పోతున్నాయి. కీల‌క స‌మావేశం విప‌క్షాల త‌రుపున అభ్య‌ర్థిత్వాన్ని నిల‌పాలా? వ‌ద్దా ? అనే అంశంపై ఢిల్లీ కేంద్రంగా బెంగాల్ సీఎం మ‌మ‌త ఏర్పాటు చేశారు. ఎన్డీయే త‌ర‌పున అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌డానికి సుదీర్ఘంగా క‌స‌ర‌త్తు జ‌రుగుతోంది. బీజేపీ అధ్య‌క్షుడు న‌డ్డా, ర‌క్ష‌ణ‌శాఖ‌మంత్రి రాజ్ నాథ్ సింగ్ వివిధ పార్టీల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు. ఏక‌గ్రీవంగా రాష్ట్ర‌ప‌తిని ఎన్నిక చేసుకోవ‌డానికి అవ‌స‌ర‌మైన క‌స‌ర‌త్తు చేస్తున్నారు. వ‌చ్చే సార్వ‌త్రికి ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని అభ్య‌ర్థిత్వాన్ని ఖ‌రారు చేయ‌డానికి బీజేపీ అగ్ర‌నాయ‌క‌త్వం క‌స‌ర‌త్తు చేస్తోంది. తొలిసారి ద‌ళిత‌వ‌ర్గానికి చెందిన రామ్ నాథ్ కోవింద్ కు అవ‌కాశం ఇవ్వ‌గా, ఈసారి ఆదివాసీ గిరిజ‌నుల‌కు ప్రాధాన్యం ఇస్తార‌ని తెలుస్తోంది. అత్యంత విశ్వ‌స‌నీయంగా తెలుస్తోన్న స‌మాచారం ప్ర‌కారం రాష్ట్ర‌ప‌తిగా గిరిజ‌న, ఉప రాష్ట్ర‌ప‌తిగా ముస్లిం వ‌ర్గానికి ఇవ్వాల‌ని బీజేపీ డిసైడ్ అయింద‌ట‌.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా ఇప్పటి వరకు ఆదివాసీ-గిరిజనులకు రాష్ట్ర‌ప‌తి అవ‌కాశం ల‌భించ‌లేదు. పైగా ఆదివాసీ-గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఒక్క మధ్య ప్రదేశ్ మినహా మరెక్కడా ఆ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో లేదు. వీటిని చేజిక్కించుకోవాలంటే ఆదివాసీలను ఆక‌ట్టుకోవాలి. ఒకవేళ గిరిజనుల‌ను అభ్యర్థిగా ప్రకటించే పక్షంలో మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము, చత్తీస్‌గఢ్ గవర్నర్ అనసూయ, కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, జ్యుయల్ ఓరంల పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. గత ఎన్నికల్లోనే ద్రౌపది ముర్ము పేరు వినిపించినప్పటికీ, దళిత సమీకరణాలకు పెద్దపీట వేయడంతో రామ్‌నాథ్ కోవింద్ అనూహ్యంగా తెరపైకి వచ్చారు. గిరిజనులకు అవకాశమివ్వాలని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తే ద్రౌపది ముర్ము పేరు ముందువరుసలో ఉంటుంద‌ని అంచ‌నా వేయొచ్చు.

మరోవైపు నుపుర్ శర్మ వ్యాఖ్యల అనంతరం అంతర్జాతీయంగా ముస్లిం వ్యతిరేక ముద్రను బీజేపీ ప‌డింది. ముస్లిం మైనారిటీ వర్గాల నుంచి బీజేపీకి ఓట్లు పడే అవకాశాలు చాలావరకు లేనప్పటికీ, అంతర్జాతీయ సమాజంలో ఎదుర్కొంటున్న అపప్రదను ఆ పార్టీ తీవ్రంగానే పరిణగిస్తోంది. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో ఎన్డీయే అభ్యర్థిగా ప్రఖ్యాత శాస్త్రవేత్త డా. ఏపీజే అబ్దుల్ కలాంకు అవకాశమిచ్చారు. మ‌రోసారి ముస్లిం అభ్యర్థిని బరిలోకి దించాలని భావిస్తే, కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ పేర్లు వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రిగా ఉన్న నఖ్వీ రాజ్యసభ పదవీకాలం పూర్తయింది. 15 రాష్ట్రాల్లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆయనకు అవకాశం ఇవ్వలేదు. కనీసం రాంపూర్ లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికలోనూ ఆయన పేరు కనిపించకపోవడంతో రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతిగా అవకాశం ఉంటుంద‌న్న‌ ప్రచారం జ‌రుగుతోంది. రాష్ట్రపతిగా గిరిజన అభ్యర్థిని బరిలోకి దించితే, ఉపరాష్ట్రపతిగా ముస్లిం వర్గాలకు చెందిన నేతనే ఎన్నుకుంటారని పార్టీ వర్గాల సమాచారం.

రాష్ట్రపతి ఎన్నికలకు బుధ‌వారం నోటిఫికేషన్ విడుద‌ల‌కు షెడ్యూల్ అయింది. ఈనెల 29వ తేదీ వ‌ర‌కు నామినేష‌న్ల గ‌డువు ఉంది. జులై 21న కౌంటింగ్ జరుగుతుంది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం జులై 24న ముగుస్తోంది. కొత్త రాష్ట్రపతి జులై 25న ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. లోక్ సభ, రాజ్యసభ సభ్యులు, రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేలతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ రాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. ఢిల్లీ, పుదుచ్చేరి అసెంబ్లీ సభ్యులు కూడా ఓటింగ్ లో పాల్గొంటారు. రాష్ట్రపతి ఎన్నికలకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీలలో పోలింగ్ జరుగుతుంది. మొత్తం 4,809 మంది సభ్యులు ఓటు వేయబోతున్నారు. వీరిలో 776 మంది పార్లమెంటు సభ్యులు కాగా, 4,033 మంది రాష్ట్రాల చట్ట సభలకు ఎన్నిక‌యిన వాళ్ల ఓట్ల విలువ 10,86,431. మరోవైపు, ఈసారి ఎన్నికలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఇంతవరకు అధికారపక్షం కానీ, విపక్షాలు కానీ తమ అభ్యర్థిని ఖరారు చేయలేదు. దీంతో, సర్వత్ర టెన్షన్ పెరిగిపోతోంది.