Kidney Transplant : రోబోట్ ద్వారా కిడ్నీ మార్పిడి చేసిన తొలి ప్రభుత్వ ఆసుపత్రి..ఎక్కడంటే..!!

దేశంలోనే రోబోట్ సాయంతో కిడ్నీ మార్పిడి చేసిన మొట్టమొదటి ఆసుపత్రిగా సప్థర్ జంగ్ ఆసుపత్రి నిలిచింది.

  • Written By:
  • Publish Date - September 23, 2022 / 08:00 AM IST

దేశంలోనే రోబోట్ సాయంతో కిడ్నీ మార్పిడి చేసిన మొట్టమొదటి ఆసుపత్రిగా సప్థర్ జంగ్ ఆసుపత్రి నిలిచింది. బుధవారం సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో 39 ఏళ్ల యువకుడికి రోబోట్ ద్వారా కిడ్నీ మార్పిడి చేశారు. ఢిల్లీలోనే కాకుండా దేశంలోనే రోబోటిక్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ సౌకర్యం కల్పించిన తొలి ప్రభుత్వ ఆసుపత్రి సఫ్దర్‌జంగ్ అని ఈ సర్జరీ చేసిన యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ అనూప్ కుమార్ పేర్కొన్నారు.

8 మిల్లీమీటర్ల 4 చిన్న రంధ్రాలు చేసి రోబోటిక్ యంత్రంతో రోగికి కిడ్నీని అమర్చినట్లు తెలిపారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యం మెరుగుపడుతోందన్నారు. యూపీకి చెందిన ముఖేష్ అనే వ్యక్తి కొంతకాలంగా కిడ్ని సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. డయాలసిస్ చేయించుకుంటున్న ఆయన చాలా కాలంగా కిడ్నీ మార్పిడి కోసం ఎదురుచూస్తున్నాడు.

ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం కావడంతో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లలేకపోయాడు. చివరిగా సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రికి వచ్చిన ముఖేష్ నెఫ్రాలజీ విభాగంలోని వైద్యులను కలిశాడు. ముఖేశ్ ఆరోగ్యపరిస్థితిని పరీక్షించిన వైద్యులు రోబోటిక్ ద్వారా కిడ్నీ మార్పిడికి నిర్ణయం తీసుకున్నారు. అయితే సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రిలో రోగి బాడీ మాస్ ఇండెక్స్ (BMI) 32. ఊబకాయంతో బాధపడుతున్న రోగులకు ఓపెన్ సర్జరీ (కోత ద్వారా శస్త్రచికిత్స) సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే రోబోటిక్ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స నిర్ణయం తీసుకున్నట్లు వైద్యులు తెలిపారు. రోగికి తన భార్య రంజన కిడ్నీని దానం చేయడంతో. ల్యాప్రోస్కోపీ సహాయంతో కిడ్నీని సురక్షితంగా తొలగించినట్లు వైద్యులు పేర్కొన్నారు.

ఆ తర్వాత రోబోల సాయంతో కిడ్నీని రోగికి అమర్చారు. సాధారణంగా, మూత్రపిండ మార్పిడి కోసం, రోగికి 12 సెంటీమీటర్ల ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. దీంతో అధిక రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంటుంది. శస్త్రచికిత్స తర్వాత గాయం నయం కావడానికి చాలా సమయం పడుతుంది. కానీ రోబోటిక్ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స ద్వారా రోగికి కేవలం నాలుగు చిన్నరంద్రాలు చేసి…సురక్షితంగా కిడ్నీని అమర్చినట్లు వైద్యులు తెలిపారు. రోబోటిక్ సర్జరీ వల్ల తక్కువ రక్తస్రావం ఉంటుంది. శస్త్రచికిత్స తర్వాత రోగులు త్వరగా కోలుకుంటారు. మూత్రపిండాల మార్పిడి రోగుల చికిత్సలో నెఫ్రాలజీ వైద్యులు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు.

ఈ విజయవంతమైన రోబోటిక్ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స ఆసుపత్రికి ఒక పెద్ద అచీవ్‌మెంట్ అని హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బిఎల్ షెర్వాల్ అన్నారు. రోబోటిక్ కిడ్నీ మార్పిడి సాంకేతికంగా చాలా సవాలుతో కూడుకున్నదని అన్నారు. కేవలం నాలుగైదు ప్రైవేటు ఆసుపత్రుల్లోనే ఇలాంటి శస్త్రచికిత్సలు జరుగుతున్నాయని తెలిపారు.

ఇంతకు ముందు ఏ ప్రభుత్వాసుపత్రిలో రోబో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరగలేదు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో రోబోటిక్ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సకు లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయి. సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో ఉచిత రోబోటిక్ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగిందని తెలిపారు. రోగి ఐదు రోజుల్లో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవుతాడని తెలిపారు.