Site icon HashtagU Telugu

Health: కార్డియాక్ అరెస్టు తో జర జాగ్రత్త.. ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే

Heart Attack

Heart Attack

ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ కలిగిన వ్యక్తులు సైతం గుండెపోటు, గుండె స్తంభించిపోవడం (కార్డియాక్ అరెస్టు) వంటి సమస్యలకు గురై మరణించడం చూస్తుంటాం. నిత్యం వ్యాయామం చేస్తూ., పౌష్టికాహారము తీసుకుంటూ ఫిట్నెస్ తో ఉండేవారు సైతం గుండె సమస్యల బారిన పడుతుంటారు. ఇలాంటి సందర్భాలలో కుటుంబ సభ్యులు లేదా చుట్టుపక్కల వారు అవగాహనతో మెలిగి… సిపిఆర్ చేస్తే ప్రాణాపాయ పరిస్థితులను అధిగమించవచ్చని అని డాక్టర్లు చెబుతున్నారు.

విదేశాలలో జిమ్ములు, పెద్ద పెద్ద రెస్టారెంట్లు, హోటల్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో ‘ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫి బ్రిలేటర్’ (AED) అనే చిన్నపాటి పరికరాలు అందుబాటులో ఉంటాయి. వీటి ద్వారా గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్, ఇతర గుండె సమస్యలకు గురైన వ్యక్తులకు ఏఈడి ద్వారా షాక్ ఇస్తారు. ఇలా చేస్తే వెంటనే గుండెపోటు, కార్డియాక్ అరెస్టు నుండి కోలుకునే అవకాశం 60 నుంచి 65% వరకు ఉంటుంది.

కార్డియాక్ అరెస్టు లక్షణాలు:

తల తిరగటం, అలసటగా అనిపించడం, గుండెల్లో దడ, చాతి నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, స్పృహ కోల్పోవడం.

గుండెపోటుకు గురైన లేదా ఆకస్మాత్తుగా కుప్పకూలి గుండె ఆగిపోయిన (కార్డియాక్ అరెస్టు అయిన) వ్యక్తికి కార్డియో పల్మనరీ రిసస్ సిటేషన్ (సిపిఆర్) చేయడం ద్వారా గుండెను మళ్లీ స్పందించేలా చేయవచ్చు. వ్యక్తి స్పృహ తప్పి పడిపోయిన మూడు నాలుగు నిమిషాలలో సిపిఆర్ చేయడం వల్ల ప్రాణాపాయము నుండి బయటపడటానికి 60 నుంచి 70 శాతం వరకు అవకాశం ఉందని సాయి చౌదరి చెప్పారు. సిపిఆర్ ప్రక్రియలో భాగముగా గుండె మీద చేతులతో లయబద్ధంగా వెంట వెంటనే తగినంత ఒత్తిడితో నొక్కాలి. తరువాత గుండె కండరాలన్నింటినీ ఉత్తేజితం చేసి మెదడుకు అవసరమైన రక్తము మళ్లీ అందేలా చేయవచ్చు. ఓ వైపు సిపిఆర్ చేస్తూనే 108కు ఫోన్ చేసి ఆంబులెన్స్ ను రప్పించి ప్రాథమిక చికిత్స అందిస్తూ ఆసుపత్రికి తరలిస్తే బాధితులు బతకడానికి అవకాశాలు ఉంటాయి అని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ లిల్లీ మేరి పేర్కొన్నారు.