Dhanteras: దీపావళికి గేట్ వే ‘ధన్ తేరస్’ .. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునే సందర్భం.. ఈసారి ఎప్పుడొస్తుందో తెలుసా!!

‘ధన్ తేరస్’ ఈసారి అక్టోబర్ 23న ఆదివారం రోజు వస్తోంది. ఏటా కార్తీక మాసం కృష్ణ పక్షం 13వ తేదీన ‘ధన్ తేరస్’ జరుపు కుంటుంటాం.

  • Written By:
  • Publish Date - September 26, 2022 / 06:30 AM IST

‘ధన్ తేరస్’ ఈసారి అక్టోబర్ 23న ఆదివారం రోజు వస్తోంది. ఏటా కార్తీక మాసం కృష్ణ పక్షం 13వ తేదీన ‘ధన్ తేరస్’ జరుపు కుంటుంటాం. ఇది వచ్చిందంటే.. దీపావళి పండుగ మొదలైనట్టేనని భావిస్తారు.‘ధన్ తేరస్’ రోజు కూడా లక్ష్మీ దేవి, భగవాన్ ధన్వంతరి పూజ చేస్తారు.‘ధన్ తేరస్’ ను ధన త్రయోదశిగా, ధన్వంతరి జయంతిగా కూడా నిర్వహిస్తుంటారు. రాక్షసులు, దేవతలు కలిసి పాల సముద్రాన్ని చిలికే క్రమంలో.. ‘ధన్ తేరస్’ రోజున అమృత కలశాన్ని చేతపట్టి భగవాన్ ధన్వంతరి ప్రకటితం అయ్యారని అంటారు. అదే రోజున పాల సముద్రం నుంచి లక్ష్మీ దేవి కూడా ప్రకటితం అయ్యారని చెబుతారు. అందుకే ఈ రోజున లక్ష్మీదేవిని కొలుస్తారు. బంగారం, వెండి, పాత్రలు కొంటే మంచి జరుగుతుందని విశ్వసిస్తారు.

* అమ్మవారికి పూజలు

‘ధన త్రయోదశి’లో ‘ధన్’ అంటే సంపద. ‘త్రయోదశి’ అంటే 13వ రోజు. పదమూడు మంచి అంకె కాదని పాశ్చాత్యుల నమ్మకం. కానీ, మనకు మాత్రం పదమూడో తిథి (త్రయోదశి) మంచి రోజు. ‘ధన త్రయోదశి’ నాడూ అమ్మవారిని పూజించే సంప్రదాయం ఉంది. దుష్టశక్తుల్ని పారదోలేలా ఆ రోజు సాయంత్రం వేళ మట్టి ప్రమిదల్ని వెలిగించి, లక్ష్మీపూజ చేస్తారు. భజన చేస్తారు. తీపివంటల్ని నైవేద్యంగా సమర్పిస్తారు. మహారాష్ట్రీయులు ఈ ‘ధన్ తేరస్’ పర్వాన్ని చాలా గొప్పగా చేసుకుంటారు. ధనియాలు తీసుకొని మెత్తగా పొడి చేసి, దానికి బెల్లం కలిపి, లక్ష్మీదేవికి ప్రత్యేక నైవేద్యం పెడతారు. గ్రామాల్లో అయితే, రైతులు తమ ప్రధాన ఆదాయ వనరులైన పశువులను అలంకరించి, పూజిస్తారు.
‘ధన్ తేరస్’ రోజున వ్యాపారస్థులు తమ ప్రాంగణాల్ని శుభ్రం చేసుకొని, బాగా అలంకరిస్తారు. శుచిగా, శుభ్రంగా ఉన్న ఇంటికే లక్ష్మీదేవి వస్తుందని నమ్మకం. సకల సౌభాగ్యప్రదాయని అయిన లక్ష్మీదేవిని సాదరంగా ఆహ్వానిస్తూ, గుమ్మంలో అందమైన ముగ్గులు వేస్తారు. దీపాలు పెడతారు. లక్ష్మీదేవి ఇంట్లో కాలుమోపడానికి ప్రతీకగా ఇంట్లో బియ్యప్పిండి, పసుపుతో బుడి బుడి అడుగుల గుర్తులు వేస్తారు. లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ, రాత్రి మొత్తం దీపాలు వెలుగుతూనే ఉండేలా చూస్తారు.

ఆ రోజు ఏం చేయాలంటే..

‘ధన్ తేరస్’ రోజున ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోవడమే కాక, పాత్రలన్నిటినీ తోమి, తళతళలాడేలా చేస్తారు. అదేరోజున ఇంట్లోని ప్రతి ఒక్కరూ ఏదో ఒక కొత్త పాత్ర కొని, పూజలో పెడతారు. దాన్నే ఆ తరువాత దీపావళి పండుగ రోజుల్లో వాడతారు. ఇలా ఎన్నో విశేషాలున్న ‘ధన త్రయోదశి’తో దీపావళి వేడుకలు భక్తిపూర్వకంగా మొదలవుతాయి.

  ఏ సమయంలో పూజించాలి?

‘ధన త్రయోదశి’ నాడు ప్రదోషకాలంలో అంటే సూర్యాస్తమయం నుంచి దాదాపు రెండున్నర గంటల సేపు కాలంలో లక్ష్మీదేవి పూజ శ్రేష్ఠం! ప్రదోషకాలంలో, అందులోనూ స్థిరలగ్నంలో లక్ష్మీ పూజ వల్ల అమ్మ మన ఇంటికి వచ్చి, స్థిరంగా నివాసం ఉంటుందని  నమ్మిక.