Site icon HashtagU Telugu

Bhishma Ekadashi: ఫిబ్రవరి 1 భీష్మ ఏకాదశి, ఈ రోజు ఇలా చేస్తే ఐశ్వర్యం, ఆరోగ్యం, విజయం

February 1 Is Bhishma Ekadashi, Doing This Today Brings Wealth, Health And Success

February 1 Is Bhishma Ekadashi, Doing This Today Brings Wealth, Health And Success

భారతంలో శాంతిపర్వం, అనుశాసనిక పర్వం భీష్ముని మహావిజ్ఞానానికి నిలువెత్తు దర్పణాలు. అష్టవసువుల్లో ఒకరిగా, శౌర్యప్రతాపంలో అసమాన ప్రతిభ కలిగిన మహానుభావుడు భీష్మాచార్యుడు. కురువృద్ధుడు, అత్యంత శక్తివంతుడు, తెలివైనవాడు అయిన భీష్మాచార్యుడు మహాభారత యుద్ధంలో నేలకొరిగినప్పటికీ.. దక్షిణాయనంలో  మరణించడం ఇష్టంలేక ఉత్తరాయణం కోసం అంపశయ్యపై వేచి ఉన్నాడు. తండ్రి కోసం రాజ్యాన్ని మాత్రమే కాదు.. తన సంసార సుఖాన్ని కూడా త్యాగం చేశాడు భీష్ముడు. తన తమ్ములు చనిపోయిన తర్వాత కూడా…తాను భీషణమైన ప్రతిజ్ఞ చేయడానికి కారణమైన సత్యవతీదేవి స్వయంగా ఆజ్ఞాపించినా ప్రతిజ్ఞాభంగం చెయ్యడానికి అంగీకరించలేదు.

భీష్ముడిలో ఉన్న మరో కోణం అచంచలమైన కృష్ణభక్తి. కేవలం కారణ మాత్రంగానే పరమాత్మ భౌతికరూపంతో కృష్ణుడుగా అవతరించాడని ఎరిగిన అతి కొద్దిమంది భక్తుల్లో భీష్ముడు ఒకడు. అయితే అందరిలా భీష్ముడు ఎక్కడా బాహాటంగా తన కృష్ణభక్తిని ప్రకటించలేదు. కేవలం ఒకే ఒక సందర్భంలో… అదీ యుద్ధభూమిలో ఉండగా, తాను నమ్మినదైవమైన పరమాత్మే స్వయంగా తనను చంపుతానని చక్రం చేపట్టినప్పుడు అంతకంటే తనకు కావలసింది ఏముందంటూ పరమాత్మకు సాగిలపడ్డాడు.

తన నిర్యాణానికి తానే సమయం నిర్ణయించుకున్నాడు. అంపశయ్యపై పవళించి ఉత్తరాయణ పుణ్య తిథికోసం వేచిచూస్తోన్న భీష్ముని చూసేందుకు శ్రీకృష్ణుడు వచ్చాడు. అందుకు అమితానందం పొందిన భీష్ముడు శ్రీమన్నారాయణుని వేయి నామాలతో కీర్తించాడు. అదే విష్ణు సహస్రనామం.  రాజ్యపాలన చేయాల్సిన ఉన్న ధర్మరాజును ఉద్దేశించి రాజనీతి అంశాలను బోధించాడు. మాఘ శుద్ధ అష్టమి రోజు భీష్మాచార్యుని ఆత్మ శ్రీకృష్ణునిలో లీనమైంది.

భీష్ముడు మోక్షం పొందిన తర్వాత వచ్చిన మాఘ శుద్ధ ఏకాదశిని “భీష్మ ఏకాదశి” (Bhishma Ekadashi), “మహాఫల ఏకాదశి”, “జయ ఏకాదశి” అని అంటారు. విష్ణు సహస్రనామం ఎప్పుడు పఠించినా..  ఎప్పుడు విన్నా పుణ్యం కలుగుతుంది. ముఖ్యంగా భీష్మ ఏకాదశిరోజు (Bhishma Ekadashi)  విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే ఆ ఫలితం అనంతం. అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయి. భోగభాగ్యాలు కలుగుతాయి. సర్వ పాపాలూ హరిస్తాయి. పుణ్యగతులు లభిస్తాయని పండితులు చెబుతారు.

ఫిబ్రవరి 1 జయ ఏకాదశి:

హిందూ పంచాగం ప్రకారం మాఘ మాసం శుక్ల పక్షంలో ఏకాదశి తిథి… 31 జనవరి 2023 మంగళవారం  మధ్యాహ్నం 2.34 కి ప్రారంభై… ఫిబ్రవరి 1వ తేదీ బుధవారం మధ్యాహ్నం 3.39 గంటలకు ముగుస్తుంది. సూర్యోదయం తిథిని పరిగణనలోకి తీసుకుంటారు కాబట్టి ఫిబ్రవరి 1వ తేదీన జయ ఏకాదశి, భీష్మ ఏకాదశి (Bhishma Ekadashi) జరుపుకుంటారు.  జయ ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానమాచరించాలి.  శ్రీ మహా విష్ణువును పూజించాలి. ఈ రోజు విష్ణుసహస్ర నామం చదువుకున్నా విన్నా మంచిది. రోజంతా ఉపవాసం పాటించి సంధ్యా సమయంలో పండ్లు తిని.. మర్నాడు అంటే ఫిబ్రవరి 2న ద్వాదశి రోజు స్నానమాచరించి దేవుడికి నమస్కరించి ఉపవాస వ్రతాన్ని విరమించాలి.

జయ ఏకాదశి కథ:

జయ ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల దారిద్య్రం తొలగిపోయి ఐశ్వర్యం, ఆరోగ్యం లభిస్తుందని పురాణాల్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన కథ కూడా ఒకటుందని చెబుతారు పండితులు. పురాణాల ప్రకారం ఓ రోజు ఇంద్రుని సభలో ఓ గంధర్వుడు పాట పాడుతున్నాడు. అయితే ఆ సమయంలో తన మనసులో ప్రియురాలిని స్మరించుకోవడంతో లయ తప్పడంతో ఇంద్రుడు ఆగ్రహంతో..గంధర్వుని, భార్యను పిశాచాలకు పుట్టాలని శపిస్తాడు. ఆ బాధలో వారు ఏమి తినకుండా ఉపవాసం ఉంటారు. అలా వారికి తెలియకుండానే జయ ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల వారికి శాపాల నుంచి విముక్తి లభించింది.

Also Read:  Vishnu Sahasranamam: విష్ణు సహస్రనామాల్లో ఏ శ్లోకం ఎలాంటి ఫలితాన్నిస్తుందంటే!