Site icon HashtagU Telugu

Famous Ganesh Temples : దేశంలోని ఆరు ప్రముఖ వినాయక ఆలయాలివే..

Famous Ganesh Temples

Famous Ganesh Temples

Famous Ganesh Temples : సెప్టెంబరు 19న వినాయక చవితి పండుగ రాబోతోంది. శివపార్వతుల కుమారుడైన గణేశుడు.. తన భక్తుల మార్గంలో వచ్చే అడ్డంకులను తొలగించి విఘ్నాలు తొలగించే దేవుడిగా పేరుగాంచాడు. హిందూ క్యాలెండర్ ప్రకారం.. ఏటా భాద్రపద శుక్ల పక్ష చతుర్థి తిథి నాడు గణేష్ చతుర్థి నిర్వహించుకుంటారు. సెప్టెంబర్ 28న గణేశుడి నిమజ్జనంతో వినాయక చవితి వేడుకలు ముగుస్తాయి. ఈనేపథ్యంలో మన దేశంలోని  ఆరు ప్రసిద్ధ గణేశుడి ఆలయాల గురించి ఒకసారి తెలుసుకుందాం. 

కాణిపాక వరసిద్ధి వినాయకుడు

వినాయక చవితి ఉత్సవాలు అనగానే తెలుగు ప్రజలకు ముందుగా గుర్తుకొచ్చే ఆలయం కాణిపాక స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకుడి మందిరమే. ఇది చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో కొలువై ఉంది.  ఇక్కడ ఏటా 21 రోజుల పాటు వినాయక చవితి వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఇక్కడి స్వామి వారిని దర్శించుకుంటే తమ కష్టాలన్నీ తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు.

శ్రీ సిద్ధివినాయక గణపతి దేవాలయం

సిద్ధివినాయక దేవాలయం ముంబైలోని ప్రభాదేవి ఏరియాలో ఉంది.  దీన్ని 1801లో లక్ష్మణ్ విత్తు పాటిల్, దేవబాయి పాటిల్ నిర్మించారు. ఇది భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ గణపతి దేవాలయం. ఏటా గణేష్ చతుర్థి సందర్భంగా ఈ ఆలయానికి పెద్దసంఖ్యలో భక్తులు వస్తుంటారు.

Also read: Gold- Silver Rates: బంగారం, వెండి కొనాలని చూస్తున్నారా.. అయితే మీకొక గుడ్ న్యూస్..!

మోతీ డుంగ్రీ ఆలయం

రాజస్థాన్‌లోని జైపూర్‌లో మోతీ డుంగ్రీ ఆలయం ఉంది. దీన్ని 1761లో నిర్మించారు. గుజరాత్ నుంచి తీసుకొచ్చి ప్రతిష్ఠించిన  ప్రత్యేక గణపతి విగ్రహం ఇందులో ఉంది. ఈ ఆలయానికి అర్ధ శతాబ్దానికిపైగా చరిత్ర ఉంది. ఈ ఆలయాన్ని సేథ్ జై రామ్ పలివాల్ నిర్మించారు.

మయూరేశ్వర దేవాలయం

మహారాష్ట్రలోని అష్టవినాయక దేవాలయాలలో మయూరేశ్వరాలయం ఉంది. ఇది పూణేలోని మోరెగావ్‌లో ఉంది. ఇక్కడే అష్టవినాయక యాత్ర ప్రారంభమై ముగుస్తుంది. మయూరేశ్వర్ గణపతి ఆలయంలో సింధూరంతో నల్లరాతితో చేసిన గణపతి విగ్రహం ఉంది.  ఈ ఆలయాన్ని 14 నుంచి 17వ శతాబ్దాల మధ్యకాలంలో నిర్మించారు.

త్రినేత్ర గణేష్ ఆలయం

ఈ గణేశ దేవాలయాన్ని క్రీ.శ. 1300లో నిర్మించారు. ఇది చారిత్రాత్మకమైన రణతంబోర్ కోట లోపల ఉంది. రణతంబోర్ చౌహాన్‌ల చివరి పాలకుడు హమ్మిరదేవ రాజు కలలో గణేశుడు కనిపించాడని, ఢిల్లీ సుల్తానులతో జరిగిన యుద్ధంలో అతడికి సహాయం చేశాడని అంటారు.

పిల్లయార్‌పట్టి కర్పగ వినాయగర్ ఆలయం

తమిళనాడులోని తిరుపత్తూరులో ఉన్న ఓ గుహ లోపల ఈ దేవాలయం ఉంది. దీన్ని 7వ శతాబ్దంలో మధురై పాండ్య రాజవంశం నిర్మించింది. ఇక్కడి ఆలయం, గణేశ విగ్రహం రాళ్లతో చెక్కబడ్డాయి. విగ్రహానికి సాధారణంగా నాలుగు చేతులు కాకుండా.. రెండు చేతులే ఉన్నాయి.