Ganja Story: గిరిజ‌న గ్రామాల్లో గంజాయి సాగే.. జీవ‌నాధార‌మా..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఇటీవ‌ల కాలంలో ఎస్ఈబీ, ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా ఆప‌రేష‌న్ ప‌రివ‌ర్త‌న పేరుతో గంజాయి సాగును నియంత్రిస్తుంది.

  • Written By:
  • Updated On - December 9, 2021 / 04:29 PM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఇటీవ‌ల కాలంలో ఎస్ఈబీ, ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా ఆప‌రేష‌న్ ప‌రివ‌ర్త‌న పేరుతో గంజాయి సాగును నియంత్రిస్తుంది. విశాఖప‌ట్నం ఏజెన్సీ గ్రామాల్లో గంజాయి సాగు ఎక్కువ‌గా జ‌రుగుతుంది. చింత‌ప‌ల్లికి 20 కి.మీ దూరంలో ఉన్న మారుమూల ఏజెన్సీ గ్రామాల్లోని గిరిజ‌నులు గంజాయిని సాగు చేస్తూ వాటిని మార్కెట్ కి త‌ర‌లిస్తున్నారు. వారికి అందుబాటులో ఉన్న‌స్థ‌లంలోనే గంజాయి సాగు చేస్తున్నారు.గంజాయి సాగుకు వీరు దాదాపుగా 50వేల రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తుంటారు.దీన్ని మార్కెట్ లో విక్ర‌యించి సొమ్ము చేసుకుంటున్నారు. కుగ్రామాల‌కు పోలీసుల నిఘా ఉండ‌ద‌నే భావ‌న‌లో వీరంతా ఈ సాగు చేస్తున్నారు. ఇత‌ర పంట‌ల‌ను సాగు చేస్తే ఆదాయం ఎక్కువ‌గా రాక‌పోవ‌డంతో ఎక్కువ ఆదాయం వ‌చ్చే పంట‌గా గంజాయి ఉండ‌టంతో అంద‌రు ఈ పంట‌మీద దృష్టి సారించారు.ఇప్ప‌టికే పండించిన గంజాయి పంట‌ను ఆర‌బెట్టేందుకు గిరిజ‌నులు ప్ర‌య‌త్నిస్తున్నారు. మ‌రికొంత పంట సాగులోనే ఉంది. అయితే తాజాగా ఏపీ పోలీసులు ఆప‌రేష‌న్ ప‌రివ‌ర్త‌న పేరుతో గంజాయి సాగుని ధ్వంసం చేస్తున్నారు. తాజాగా 5,962 ఎకరాల్లో వేసిన 29 లక్షల 82 వేల 425 గంజాయి మొక్కలను నాశనం చేశారు. గత 36 రోజులుగా ఆపరేషన్ పరివర్తన లో భాగంగా ఇప్పటివరకు ఒక 1,491 కోట్ల రూపాయల విలువైన గంజాయి పంట ధ్వంసం చేసినట్లుగా అధికారులు తెలిపారు. ఇప్పటికే విశాఖ మన్యంలో, ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతాలలో దాడులు చేసిన పోలీసులు ఎక్కడెక్కడ గంజాయి సాగు అవుతుందో గుర్తించారు. పక్కా ప్రణాళిక ప్రకారం గంజాయి క్షేత్రాలపై దాడులు చేస్తూ పంటను ధ్వంసం చేస్తున్నారు. అయితే ఈ ఆప‌రేష‌న్ కు గిరిజ‌నులు త‌మ‌కు స‌హ‌క‌రించాల‌ని కోరుతున్నారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా మంది గంజాయి సాగుపై చాలా వరకు ఆధారపడి ఉన్నారు. ఇది చట్టవిరుద్ధమని వారికి తెలిసినా… ఈ పంట‌నే సాగు చేస్తున్నారు. అయితే చాలా సంవ‌త్స‌రాలుగా ఏజెన్సీలో గంజాయి సాగుని పోలీసులు ప‌ట్టించుకోలేదు. అయితే ఆపరేషన్ పరివర్తనతో గంజాయి సాగుపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉక్కుపాదం మోపడంతో గిరిజ‌నులు ఆందోళన చెందుతున్నారు. గంజాయి సాగు వ‌ల్లే ఈ ప్రాంతంలోని గిరిజ‌నులు త‌మ జీవితాన్ని మెరుగుప‌రుచుకున్న‌ట్లుగా తెలుస్తుంది. కానీ ఈ సాగు చ‌ట్ట విరుద్ధం కాబ‌ట్టి వీరిని ప్ర‌త్యామ్నాయ పంట‌ల‌పై కానీ వారికి పూర్తిస్థాయిలో జీవ‌నోపాధిగాని ప్ర‌భుత్వం చూపిస్తే త‌ప్ప వీరు దీని నుంచి బ‌య‌ట‌కు రారు.

గంజాయి సాగు స‌మ‌స్య‌ను సామాజిక‌,ఆర్థిక‌, అభివృద్ధి కోణంలో రాష్ట్రం ప్ర‌భుత్వం, ఐటీడీఏ చూస్తుంది. గంజాయికి ప్ర‌త్యామ్నాయ పంట‌ల‌ను పండించేందుకు రూ.50 కోట్ల ప్ర‌తిపాద‌న‌ను ఐటీడీఏ తీసుకువ‌చ్చింది. కొత్త ప్రతిపాదన రూపుదిద్దుకుంటున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం దీనిని ఆమోదించి, క్షేత్ర స్థాయిలో సంక్షోభాన్ని తగ్గించేందుకు గంజాయి సాగుదారులకు మరింత సహకారం అందిస్తుందో లేదో చూడాలి. ఆపరేషన్ పరివర్తన ఈ సీజన్‌లో గంజాయి వ్యాపారానికి స్వస్తి పలికినప్పటికీ…గిరిజన రైతులకు సహాయం చేయడానికి ప్రభుత్వం ముందుకు వ‌చ్చే వ‌రకు వారు ఖచ్చితంగా గంజాయిని పండించటానికి మొగ్గు చూపుతారు. మొత్తానికి గిరిజ‌నుల‌కు గంజాయి సాగే ప్ర‌స్తుతానికి జీవనాధారంగా ఉంది.