Dharmika Parishad : జ‌గ‌న్ స‌ర్కార్ `ధార్మిక ప‌రిష‌త్‌` కూర్పు

ధార్మిక ప‌రిష‌త్ ను ఏర్పాటు చేస్తూ జ‌గ‌న్ స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది. మొత్తం 21 మంది స‌భ్యుల‌తో ప‌రిష‌త్ ను ఏర్పాటు చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

  • Written By:
  • Updated On - August 16, 2022 / 06:55 PM IST

ధార్మిక ప‌రిష‌త్ ను ఏర్పాటు చేస్తూ జ‌గ‌న్ స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది. మొత్తం 21 మంది స‌భ్యుల‌తో ప‌రిష‌త్ ను ఏర్పాటు చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. వాటి ప్ర‌కారం మఠాధిపతులు: 1) పెద్ద జియ్యంగార్‌ మఠం, తిరుమల 2) పుష్పగిరి మఠం, వైఎస్సార్‌ జిల్లాలకు అవకాశం ఇచ్చారు. రిటైర్డు హైకోర్టు జడ్జిగా మఠం వెంకట రమణ, రిటైర్డు ప్రిన్సిపల్‌ జడ్జి కె. సూర్యారావు, రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి అజేయ కల్లంలు పరిషత్‌లో ఉన్నారు. ఆగమ పండితులు పీవీఎస్‌ఎస్‌ఆర్‌ జగన్నాథాచార్యులు, సీహెచ్‌ శ్రీరామ శర్మలకు పరిషత్‌లో స్థానం కల్పించారు. చార్టెడ్‌ అకౌంటెంట్‌ శ్రీరామమూర్తి, దేవదాయ శాఖ రిటైర్డ్ అధికారి ఏబీ కృష్ణారెడ్డి, దాతలు ఎస్‌ నరసింహారావు, యూకే విశ్వనాథ్‌రాజు, ఆలయ, సత్రాల పాలక మండళ్ల సభ్యులు: ఎం.రామకుమార్‌ రాజు, భీమవరం (జగన్నాథరాజు సత్రం), చక్కా ప్రభాకరరావు (చాకా వారి సత్రం, పాలకొల్లు), జ్వాలా చైతన్య (యడ్ల పిచ్చయ్య శెట్టి సత్రం, కడప), ఇనుగంటి వెంకట రోహిత్‌ (అన్నవరం), మాక్కా బాలాజీ, రంజన్‌ సుభాషిణిలు పరిషత్‌లో ఉన్నారు.

దేవదాయ శాఖ పరిధిలో ఉండే ఆలయాలు, మఠాలు, సత్రాలు, ఇతర హిందూ ధార్మిక సంస్థల వ్యవహారాలపై ధార్మిక ప‌రిష‌త్ ప‌నిచేస్తుంది. ప్రభుత్వం తీసుకునే విధాన నిర్ణయాల్లో కీలకంగా వ్యవహ‌రించ‌నుంది. పరిషత్‌కు దేవదాయ శాఖ మంత్రి చైర్మన్‌గా, ఇద్దరు మఠాధిపతులు, ఇద్దరు ఆగమ పండితులు, ఓ రిటైర్డు హైకోర్టు జడ్జి, ఓ రిటైర్డు ప్రిన్సిపల్‌ స్పెషల్‌ జడ్జి, ఓ రిటైర్డు ఐఏఎస్‌ అధికారి, ఒక చార్టెడ్‌ అకౌంటెంట్, ఒక రిటైర్డు దేవదాయ శాఖ అధికారితో పాటు ఆలయాల నిర్మాణంలో ముఖ్య భూమిక ఉండే ఇద్దరు దాతలు, వివిధ ఆలయాల పాలక మండళ్లకు చైర్మన్లుగా ఉన్న ఆరుగురుని సభ్యులుగా నియమించారు. దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, టీటీడీ ఈవో సభ్యులుగా, దేవదాయ శాఖ కమిషనర్‌ సభ్య కార్యదర్శిగా ఉంటారు. పరిషత్‌ పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి మూడేళ్లు కొనసాగుతుంది.

2020లో తిరుపతి హథీరాంజీ మఠాధిపతిని తొలగిస్తూ అప్పటి దేవాదాయ కమిషనర్‌, ధార్మిక పరిషత్ కార్యదర్శి హోదాలో ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ నిర్ణయంపై ఆ మఠాధిపతి హైకోర్టును ఆశ్రయించారు. పూర్తిస్థాయి కార్యవర్గం లేకుండా ఈ నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వం నలుగురితో కూడిన ధార్మిక పరిషత్ పూర్తి స్థాయిలో నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని కల్పిస్తూ చట్టసవరణ చేసింది. పూర్తిస్థాయిలో పరిషత్ ఎందుకు ఏర్పాటు చేయడంలేదని దీనిపై కోర్టు ప్రశ్నించింది. దీంతో పూర్తిస్థాయి ధార్మిక పరిషత్ ను ఏర్పాటు చేస్తూ జ‌గ‌న్ స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది. రూ.25 లక్షల నుంచి రూ.కోటి వరకు వార్షిక ఆదాయం ఉన్న ఆలయాలకు పాలకవర్గాలను ఈ పరిషత్ నియమిస్తుంది. ఉల్లంఘనలు జరిగి, ఫిర్యాదులు వచ్చినపుడు మఠాధిపతులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం, మఠాధిపతి చనిపోతే కొత్తవారిని నియమించే అధికారం ఉంటుంది.