Controversial Comments: జగన్ చెప్పినట్టు ‘దిశ’తో 21 రోజుల్లో ఎవరికీ ఉరిశిక్ష పడలేదు.. ఈలోపే హోంమంత్రి..!

బిడ్డల సంరక్షణ బాధ్యత తల్లిదే అని... తల్లిపాత్ర సక్రమంగా నిర్వర్తిస్తే అఘాయిత్యాలు తగ్గుతాయని..

  • Written By:
  • Publish Date - May 1, 2022 / 07:10 PM IST

బిడ్డల సంరక్షణ బాధ్యత తల్లిదే అని… తల్లిపాత్ర సక్రమంగా నిర్వర్తిస్తే అఘాయిత్యాలు తగ్గుతాయని.. తల్లిపాత్ర సరిగా లేనప్పుడే ఇలాంటి జరుగుతున్నాయని.. దానికి పోలీసులను ప్రభుత్వాన్ని నిందించడం సరికాదన్న ఏపీ హోం శాఖా మంత్రి తానేటి వనిత మాటలను ఎలా అర్థం చేసుకోవాలి? అంటే సమాజంలో జరుగుతున్న ఘోరాలను, నేరాల తప్పిదాన్ని ఎవరిపైకి నెట్టేయాలనుకుంటున్నారు? జగన్ ప్రభుత్వం
తెచ్చిన దిశ చట్టానికి అతీ గతీ లేదు. దాని ప్రకారం శిక్షలు పడడం లేదు. సరికదా మహిళలపై దారుణాలను అరికట్టడంలో వ్యవస్థలు విఫలమైతే దానికి తల్లులదా బాధ్యతా అని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.

మహిళలపై వేధింపులకు అడ్డే లేకుండా పోతోంది. ఆడబిడ్డను బయటకు పంపాలంటే గజగజా వణికిపోవాల్సిన పరిస్థితి. కామాంధుల నుంచి కాపాడుకోవడానికి నానా తంటాలు పడాల్సి వస్తోంది. లైంగిక దాడులు, కత్తి దాడలు, యాసిడ్ దాడులు.. వీటి గురించి వింటేనే తల్లుల్లో ఆందోళన పెరుగుతోంది. ఇలాంటి నేరాలను, ఘోరాలను అరికట్టడానికంటూ జగన్ ప్రభుత్వం రెండేళ్ల కిందట దిశ చట్టాన్ని తీసుకువచ్చింది.
అసలది ఇంకా చట్టంగా రూపుదిద్దుకోనేలేదు. అయినా దాని ప్రకారం శిక్షలు కూడా వేసేస్తున్నామని ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందంటున్నాయి విపక్షాలు. అసలు లేని చట్టం కింద ముగ్గురికి ఉరిశిక్ష పడినట్లు ప్రభుత్వం చెబుతోంది. రమ్య హత్య కేసులో దోషికి గుంటూరు ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష విధించింది. ఇది కూడా తమ ప్రభుత్వం ఘనతే అని అనుకుంటే ఎలా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

మహిళలపై ఎవరైనా సరే దారుణాలకు పాల్పడితే.. ఆ నేరాన్ని రుజువు చేసి.. 21 రోజుల్లోనే వారికి ఉరిశిక్ష విధించేలా ప్రయత్నిస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ హెచ్చరించారు. కానీ అదింకా చట్టమే కాలేదు. అయినా దానికింద ఉరిశిక్షలు పడ్డాయంటున్నారు. దిశ చట్టం సంగతి ఎంతవరకు వచ్చింది అని వైసీపీ ఎంపీయే పార్లమెంటులో ఓ ప్రశ్న అడిగారు. సవరించిన బిల్లును వైసీపీ ఇంకా పంపించలేదని కేంద్రమంత్రే
స్వయంగా బదులిచ్చారు. దీంతోపాటు మరో అంశాన్నీ గుర్తుపెట్టుకోవాలి. దిశ చట్టమంటూ హడావుడి చేస్తున్నా.. అది చట్టమే కాదని.. అది కేవలం ఓ యాప్ అని పోలీసులకు బాస్ అయినవారే చెప్పారు. మరి అలాంటి దిశతో మహిళల దశ ఎలా మారుస్తారనుకున్నారు.

విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో మానసిక స్థితి సరిగా లేని మహిళను 36 గంటలపాటు బంధించి అత్యాచారం చేశారు. చివరకు బాధితురాలి కుటుంబమే నిందితుడిని వెదికి పట్టుకుని పోలీసులకు అప్పగించింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో బీచ్ కు వెళ్లిన ఓ జంటపై దుండగులు దాడి చేశారు. ఆ యువతిపై అత్యాచారం చేశారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశాక కాని పోలీసులకు దీనిపై సమాచారం లేదు. నెల్లూరు
జిల్లాలో ప్రేమోన్మాది చెంచు కృష్ణ.. బాలిక గొంతు కోశాడు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో మహిళపై హత్యాచార ఘటన రాష్ట్రంలోనే సంచలనం సృష్టించింది. అంటే ప్రతిపక్షాలు బాధిత కుటుంబాల దగ్గరకు వెళితే కాని.. ప్రభుత్వం ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదు?

ఆంధ్రప్రదేశ్ లో మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు పెరిగాయని జాతీయ నేర గణాంకాల నివేదికే చెబుతోంది. 2019లో ఇలాంటి ఘటనలు 1892 అయితే.. 2020లో 2942 జరిగాయి. ఇవన్నీ పోలీసు రికార్డుల్లో ఉన్నవి. ఇక పరువు పోతుందన్న భయంతో, బాధతో పోలీసులను ఆశ్రయించని బాధితులు ఎందరో ఉండొచ్చు. దేశవ్యాప్తంగా మహిళలపై దారుణాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రెండో
స్థానంలో ఉంది. మహిళల్ని వేధించిన ఘటనలో మూడో స్థానంలో ఉంది. ఇక రాష్ట్రంలో రిజిస్టరైన అన్ని కేసులకన్నా మహిళలపై దాడులకు సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయని.. 2021 డిసెంబరులో అప్పటి డీజీపీ గౌతం సవాంగ్ చెప్పారు. మహిళలపై వేధింపులు 49 శాతం పెరిగాయన్నారు. అలాంటప్పుడు వారికి రక్షణ కల్పించాల్సింది పోయి.. ఏపీ హోంమంత్రి తల్లులను తప్పుబడితే ఎలా?