Global Recession: మళ్లీ ఆర్థిక అనిశ్చితి తప్పదా..?

మరో ఆర్ధిక సంక్షోభానికి ఘంటికలు మోగుతున్నాయా ? అంటే ఇపుడు వివిధ దేశాల ఆర్ధిక పరిస్థితులు చూస్తుంటే అదే నిజమని తెలుస్తోంది.

  • Written By:
  • Publish Date - September 23, 2022 / 11:18 PM IST

మరో ఆర్ధిక సంక్షోభానికి ఘంటికలు మోగుతున్నాయా ? అంటే ఇపుడు వివిధ దేశాల ఆర్ధిక పరిస్థితులు చూస్తుంటే అదే నిజమని తెలుస్తోంది. ఒక వైపు అమెరికాలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్య, అంచనాలకు మించిన ద్రవ్యోల్బణం ఖంగారు పెట్టిస్తుంటే…బ్రిటన్‌, జపాన్‌, స్విట్జర్లాండ్ ఆర్ధిక పరిస్ధితులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇవన్నీ ఇచ్చే ఇండికేషన్‌ ఒక్కటే మరోసారి ఆర్ధిక అనిశ్చిత్తి తప్పదని…ఇంతకీ ప్రపంచ వ్యాప్తంగా మాంధ్యం రావడానికి కారణమేంటి ? భారత్‌ లో పరిస్ధితులు ఎలా ఉండబోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్భణ భయాలు పెరుగుతుండటంతో మరో సారి ఆర్ధిక మాంధ్యం తప్పదా అనే సందేహాలు వస్తున్నాయి.

2008 తరువాత మరోసారి అంత పెద్ద మొత్తంలో ఆర్ధిక వ్యవస్ధ చిన్నాభిన్నమయ్యే అవకాశాలున్నాయని ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పెరుగుతున్న ద్రవ్యోల్భణాన్ని అరికట్టేందుకు వడ్డీ రేట్లను పెంచింది అమెరికా ఫెడ్‌. మరొక వైపు నెమ్మదించిన వృద్ధి రేటు, అధిక నిరుద్యోగత, ఆర్థిక మాంద్యం నెలకొనే అవకాశాలు లేకపోలేదని అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ స్వయంగా ఒప్పుకుంది. అమెరికాలో 40 ఏళ్ల గరిష్ఠస్థాయులకు ద్రవ్యోల్బణం చేరడంతో నియంత్రణ కార్యక్రమాలను చేపట్టే పనిలో పడింది అక్కడి ప్రభుత్వం. కీలకరేట్లను మరో 0.75 శాతం పెంచి, 3-3.25 శాతానికి చేర్చింది. వచ్చే ఏడాదిలోనూ వడ్డీరేట్ల పెంపు కొనసాగి 4.6 శాతానికి చేరుతుందని, 2007 తరవాత అదే గరిష్ఠం అవుతుందని పేర్కొంటున్నారు. కొన్ని నెలల పాటు కనుక నిరుద్యోగిత రేటు 0.5 శాతం చొప్పున పెరిగితే, తదుపరి మాంద్యం తప్పదని ఆర్థిక వేత్తలు పేర్కొంటున్నారు. మరొకవైపు బ్రిటన్‌ కేంద్రీయ బ్యాంకు అయిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ కీలక ప్రామాణిక రేటును మరో అర శాతం పెంచి 2.25 శాతానికి చేర్చింది. ఇది 27 ఏళ్ల గరిష్ఠం.

కీలక రేట్లను పెంచడం వరుసగా ఏడోసారి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే దిశగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. అయితే అమెరికా ఫెడ్‌, ఇతర దేశాల కేంద్ర బ్యాంకుల మాదిరి రేట్ల పెంపు విషయంలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ మరింత దూకుడుగా వెళ్లడం లేదు. ఇక జపాన్‌ పరిస్ధితి కూడా అలాగే ఉంది. ఐతే ఇక్కడ జపాన్‌ ప్రభుత్వం కీలక రేటును యథాతథంగా -0.1% వద్దే కొనసాగించింది. ఇందువల్ల అమెరికా డాలరుతో పోలిస్తే యెన్‌ మారకపు విలువ క్షీణించి, 24 ఏళ్ల కనిష్ఠమైన 146 యెన్‌లకు దిగివచ్చింది. యెన్‌ క్షీణతను అడ్డుకునేందుకు జపాన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ జోక్యం చేసుకోవడంతో డాలర్‌ విలువ 142 యెన్‌లకు పరిమితమైంది. మరోక వైపు స్విట్జర్లాండ్‌ సెంట్రల్‌ బ్యాంకు కూడా కీలక వడ్డీ రేట్లను 0.75% పెంచింది. ఈ స్థాయిలో పెంచడం ఇదే మొదటిసారి. తాజా పెంపుతో స్విట్జర్లాండ్‌ కీలక వడ్డీ రేటు -0.25 శాతం నుంచి 0.50 శాతానికి పెరిగింది. తద్వారా ఏడేళ్ల పాటు మైనస్‌లో కొనసాగిన వడ్డీ రేట్లకు ముగింపు పలికింది.

ఇది కూడా ఆర్ధిక ప్రమాదాపు అంచున ఉన్నట్లు తెలుస్తోంది. ఇక టర్కీ ద్రవ్యోల్బణం 80 శాతానికి పైన ఉన్నప్పటికీ,వడ్డీ రేట్ల కోతను విధించింది. ఇపుడు కాకపోయినా మరికొద్ది రోజుల్లో అక్కడ ఆర్ధిక పరిస్ధితి అతులాకుతలం అయ్యే ఛాన్స్‌ ఉందనేది ఆర్ధిక నిపుణులు మాట. రేట్ల కోత నేపథ్యంలో, టర్కీ కరెన్సీ లిరా విలువ క్షీణించడం ఆందోళన కలిగిస్తున్న అంశం.