Site icon HashtagU Telugu

World Elephant Day : గజరాజులకు గండం.. మొదటి శత్రువు మనిషే !

World Elephant Day

World Elephant Day

World Elephant Day : ఇవాళ గజరాజుల దినోత్సవం..

భూమి మీద ఉన్న అతి పెద్ద క్షీరదాలు ఏనుగులే.

ఏనుగులతో మన ఇండియన్స్ కనెక్ట్  అయినంతగా మరే దేశం వాళ్లు కూడా కనెక్ట్ కాలేకపోయారు..

అందుకే మన పురాణాల్లో కూడా గజరాజుల ప్రస్తావన ఉంది..   

దేవేంద్రుడి వాహనం కూడా ఐరావతం.

ప్రధమ పూజ్యుడు విఘ్నేశ్వరుడు సైతం గజముఖధారియే.

అంతటి ప్రాశస్త్యం కలిగిన గజరాజుల మనుగడ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.

ఏనుగుల జాతి అంతరించే ప్రమాదం ఉందని నివేదికలు  చెబుతున్నాయి.

మన దేశంలో జరుపుకునే పండగల్లో, ఊరేగింపులు, ఉత్సవాల్లో ఏనుగులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. జార్ఖండ్, కర్ణాటక, కేరళ, ఒరిస్సా రాష్ట్రాలు రాష్ట్ర జంతువుగా ఏనుగుకు ప్రాధాన్యం ఇచ్చాయి. 23 రాష్ట్రాల్లో 27,312 ఏనుగులు ఉన్నట్లు 2017లో కేంద్ర ప్రభుత్వం తెలిపింది.  2012 నుంచి 2017 మధ్య కాలంలో(5 సంవత్సరాలలో)  దాదాపు 300 ఏనుగులు అంతరించినట్లు లెక్కలు చెబుతున్నాయి. కేరళలో ఏనుగులను మచ్చిక చేసుకుని వాటితో పనులు చేయించుకుంటారు. 700 ఏనుగులతో వివిధ రూపాల్లో వెట్టిచాకిరి చేయిస్తున్నట్టుగా గణాంకాలు సూచిస్తున్నాయి. ఏనుగులు అద్భుతమైన జ్ఞాపకశక్తి కలిగిన జంతువులు. వాటికి ఏదైనా సహాయం చేస్తే మర్చిపోవు. అడవిలో ఆహారం కొరత ఏర్పడడంతో జనావాసాల్లోకి ఏనుగులు ప్రవేశిస్తున్నాయి. ఇవి రైల్వే ట్రాక్‌లు దాటుతూ ప్రమాదాల బారిన పడుతున్నాయి. వేటగాళ్లు, స్మగ్లర్ల బారిన పడి ఏనుగులు మృత్యువాత పడకుండా ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. జంతు సంరక్షణ చట్టాలు పక్కాగా అమలు చేయాలి.

Also read :  Ponduru Khadi- Mahatma Gandhi : పొందూరు ఖాదీ అంటే గాంధీజీకి మహా ఇష్టం.. ఎందుకు ?

మారవోయ్ మనిషి.. 

వినోదం కోసం, సాంస్కృతిక ఉత్సవాల కోసం ఏనుగులను బంధించే సంస్కృతి మన దేశంలో ఉంది. నేడు భారతదేశంలో 2,600 కంటే ఎక్కువ బందీ ఏనుగులు ఉన్నాయని అంచనా వేయబడింది. ఆచారం పేరుతో జరిగే ఈ చర్యలన్నీ కూడా వాటి స్వేచ్ఛను హరించేవే. ఏనుగు దంతాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్‌ ఉండటంతో వాటిని వేటాడి, హింసించి దాని దంతాలను బలవంతంగా పీకి వాటితో దొంగ వ్యాపారాలు చేస్తున్నాడు మనిషి. వాటికి సొంతమైన అడవి భూమిని పంటల పేరుతో ఆక్రమించి, వాటి మనుగడకు అవసరమైన నీటి కుంటలను పూడ్చేస్తూ వాటితో చెలగాటమాడుతున్నాడు. పొలాల్లోకి రాకుండా వాటి చుట్టూ కంచె వేసి కరెంట్‌ షాక్ పెడుతున్నారు. వీటి కారణంగా బలైన మూగ ప్రాణాలు ఎన్నో. అంతేకాకండా జనావాసాల్లోకి తప్పిన పోయిన వచ్చిన వాటిపై కరుణ చూపకుండా కొట్టి చంపిన ఉదంతాలు అనేకం. ఏదీ ఏమైనా మనిషి ఇలాగే ప్రవర్తిస్తే అంతరించి పోయిన జీవజాతుల్లో ఏనుగులు కలవడం ఖాయం.

Also read : China Floods: చైనాలో వరదల బీభత్సం.. 29 మంది మృతి, 16 మంది మిస్సింగ్

ఏనుగుల దినోత్సవం చరిత్ర

2011లో కనజ్వెస్ట్ పిక్చర్స్‌ అనే సినీ నిర్మాణ సంస్థకు చెందిన కెనడియన్ సినీ నిర్మాతలు ప్యాట్రిసియా సిమ్స్, మైఖేల్ క్లార్క్, ఎలిఫెంట్ రీఇంట్రడక్షన్ ఫౌండేషన్ ఆఫ్ థాయ్‌లాండ్‌ సంస్థ సెక్రటరీ జనరల్ శివపోర్న్ దర్దరనంద సంయుక్తంగా ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రతిపాదించారు. 2012లో సిమ్స్‌తో కలిసి ఎలిఫెంట్ రీఇంట్రడక్షన్ ఫౌండేషన్ అధికారికంగా మొదటిసారి ‘వరల్డ్ ఎలిఫెంట్‌ డే’ను(World Elephant Day) నిర్వహించింది. ఆ సదస్సులో ఆసియా, ఆఫ్రికా జాతి ఏనుగులు ఎదుర్కొంటున్న కష్టాలపై చర్చించారు.  దీంతోపాటు వరల్డ్ ఎలిఫెంట్ సొసైటీని కూడా ఏర్పాటు చేశారు. అప్పటి నుండి ఏనుగులు పడుతున్న కష్టాలు, వాటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.