Site icon HashtagU Telugu

GPS – Toll Collection : టోల్ ప్లాజాలలో ఇక జీపీఎస్ టెక్నాలజీ.. వాహనదారులకు ప్రయోజనమిదీ..

Gps Toll Collection

Gps Toll Collection

GPS – Toll Collection : ఫాస్టాగ్‌ను అమల్లోకి తెచ్చాక జాతీయ రహదారులపై టోల్‌ ప్లాజాల వద్ద వాహనదారులు వేచి ఉండే సగటు టైం  8 నిమిషాల నుంచి 47 సెకన్లకు తగ్గిపోయింది. ఈ సమయాన్ని మరింతగా తగ్గించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా టోల్‌ ప్లాజాల వద్ద ఛార్జీల వసూలుకు జీపీఎస్‌ ఆధారిత వ్యవస్థను వినియోగించనున్నారు.  2024 మార్చి నుంచి ఈ విధానం అందుబాటులోకి వస్తుందని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. జీపీఎస్‌ ఆధారిత టోల్ ఛార్జీల కలెక్షన్ విధానం(GPS – Toll Collection) వల్ల జాతీయ రహదారిపై ప్రయాణించిన దూరానికి మాత్రమే ఛార్జీ చెల్లిస్తే సరిపోతుంది. ఈ విధానం అందుబాటులోకి వచ్చాక టోల్‌ప్లాజాల వద్ద వాహనాలను ఆపాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే.. ఆటోమేటిక్‌‌గా వాహనం నంబర్‌ప్లేట్లను రీడ్ చేసే రీడర్లను టోల్ ప్లాజాల వద్ద  ఏర్పాటు చేస్తారు. దీనికి సంబంధించిన రెండు పైలట్‌ ప్రాజెక్టులు ఇప్పటికే దేశంలో అమలవుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఏమిటీ టోల్ ట్యాక్స్ ?

రాష్ట్రంలోని రోడ్లను ఉపయోగించడానికి ప్రతి వాహనదారుడు ‘రోడ్‌ ట్యాక్స్‌’ పే చేస్తాడు. వాహనం బరువు, తయారైన సంవత్సరం, సీటింగ్‌ కెపాసిటీ, ఇంజిన్‌ రకాలను బట్టి ఈ ట్యాక్స్‌‌ను నిర్ణయిస్తారు. ఇక రాష్ట్రంలోని జాతీయ రహదారులకు మరో ట్యాక్స్‌ను మనం పే చేయాల్సి ఉంటుంది.  అదే ‘టోల్ ట్యాక్స్’. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) పని చేస్తుంది. ఇది ప్రైవేటు కాంట్రాక్టు సంస్థల సహాయంతో వివిధ రాష్ట్రాల మధ్య హైవేలు, ఎక్స్‌ప్రెస్‌ హైవేలు నిర్మిస్తుంది. రోడ్డు వేయడానికి చేసిన ఖర్చును టోల్‌ రూపంలో వసూలు చేసి కాంట్రాక్టర్లకు పే చేస్తుంది. ఈ ప్రక్రియ కొన్నేళ్లపాటు సాగుతుంది. రోడ్డు వేయడానికి ఖర్చు చేసిన మొత్తం వసూలయ్యాక టోల్‌ ఫీజును 40 శాతానికి తగ్గిస్తారు. ద్విచక్ర వాహనాలకు టోల్‌ నుంచి మినహాయింపు ఉంటుంది. మిగిలిన వాహనాల పరిమాణాన్ని బట్టి టోల్‌ వసూలు చేస్తారు. టోల్ ప్లాజాల  నిర్వహణ బాధ్యతను ఎన్‌హెచ్‌ఏఐ పర్యవేక్షిస్తుంటుంది. రెండు టోల్‌ బూత్‌ల మధ్య సాధారణంగా 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంతకంటే తక్కువ దూరంలోనూ ఉండే అవకాశముంది. ఆ దూరాన్ని బట్టి ట్యాక్స్‌ వసూలు చేస్తారు. ప్రతి ఏటా ఏప్రిల్‌ 1న అవసరాన్ని బట్టి టోల్‌ ధరలను పెంచుతుంటారు.

Also Read: Whats Today : రాజ్యసభలోకి 3 క్రిమినల్ కోడ్ బిల్స్.. తెలంగాణ విద్యుత్ రంగంపై శ్వేతపత్రం