Wife-Husband-7 Coin Bags : ఒక వ్యక్తి కోర్టుకు 7 మూటలు తీసుకొచ్చాడు..
అవన్నీ రూపాయి.. రెండు రూపాయల కాయిన్స్ తో నిండి ఉన్నాయి..
ఇంతకీ కోర్టుకు డబ్బులతో ఎందుకు వచ్చాడని ఆలోచిస్తున్నారా ?
తన నుంచి విడాకులు తీసుకున్న భార్యకు భరణంగా ఇచ్చేటందుకు..
ఆ 7 బ్యాగ్స్ లో మొత్తం 55వేల రూపాయలు ఉన్నాయని కోర్టుకు చెప్పాడు..
ఈ కాయిన్స్ ను చూసిన మాజీ భార్య.. విడాకులు ఇచ్చాక కూడా తనను ఇలా వేధిస్తున్నాడని బాధపడింది.
ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే.. రాజస్థాన్ కు చెందిన దశరథ్ కుమావత్కి, సీమా కుమావత్తో పదేళ్ల కిందట పెళ్లయింది. పెళ్లయిన 3-4 ఏళ్లకే ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో భర్త దశరథ్ కుమావత్ విడాకుల కోసం కోర్టులో అప్లై చేసుకున్నాడు. ఈ కేసును విచారణ జరిపిన కుటుంబ న్యాయస్థానం ప్రతినెలా భార్యకు భరణంగా రూ.5వేలు చెల్లించాలని భర్తను ఆదేశించి విడాకులు మంజూరు చేసింది. గత 11 నెలలుగా భర్త ఈ మొత్తాన్ని భార్యకు ఇవ్వడం లేదు. దీంతో ఆమె భర్తపై కోర్టు ద్వారా రికవరీ వారెంట్ జారీ చేయించింది. ఆ తర్వాత కూడా ఆ మొత్తాన్ని చెల్లించకపోవడంతో అది అరెస్ట్ వారెంట్గా మారింది.
Also read : Live In Relationship : సహజీవనం చేసే వాళ్లకు విడాకులు అడిగే హక్కు లేదు : కేరళ హైకోర్టు
హర్మడ పోలీస్ స్టేషన్లో భర్తను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈక్రమంలో అతడు 7 సంచుల్లో 55వేల రూపాయల విలువైన కాయిన్స్ ను(Wife-Husband-7 Coin Bags) కోర్టుకు తీసుకొచ్చాడు. ఈ 7 కాయిన్స్ సంచుల బరువు దాదాపు 280 కిలోలు ఉంది.కోర్టులో ఉన్నవారంతా నాణేలను చూసి ఆశ్చర్యపోయారు. దీన్ని భార్య వ్యతిరేకించింది. ఇలా కూడా భర్త తనను వేధిస్తున్నాడని ఆరోపించింది. అవి చెల్లుబాటయ్యే భారత కరెన్సీయే అని భర్త తరఫు న్యాయవాది బదులిచ్చాడు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. ఆ నాణేలను లెక్కించి ప్రతి వెయ్యి రూపాయలకు 1 సంచి తయారుచేసి బాధిత మహిళకు ఇచ్చేయాలని ఆదేశించింది. ఇక భరణం మొత్తాన్ని చెల్లించిన భర్తను కోర్టు బెయిల్పై విడుదల చేసింది.