Site icon HashtagU Telugu

Top Union Budgets : దేశంపై చెరగని ముద్రవేసిన 7 కేంద్ర బడ్జెట్లు ఇవే..

Top Union Budgets

Top Union Budgets

Top Union Budgets : ఫిబ్రవరి 1న పార్లమెంటులో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్నారు.  ఎన్నికల ఏడాది కావడంతో ఈ బడ్జెట్‌కు ఉన్న ప్రాధాన్యత చాలా ఎక్కువే.  ఈసందర్భంగా మనదేశ చరిత్రలో చిరకాలం నిలిచిపోయేలా ముద్రవేసిన  టాప్ బడ్జెట్లపై ఒక లుక్ వేద్దాం..

We’re now on WhatsApp. Click to Join

  • మనదేశపు తొలి బడ్జెట్‌ను 1947 నవంబర్ 26న నాటి కేంద్ర ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముఖం చెట్టి ప్రవేశపెట్టారు. మార్చి 31, 1948 వరకు ఏడున్నర నెలల స్వల్ప కాలం కోసం దీన్ని ప్రవేశపెట్టారు. అయితే దేశ (భారత్, పాక్) విభజన కారణంగా అది అమల్లోకి రాలేదు.
  • 1957 సంవత్సరంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో నాటి కేంద్ర ఆర్థిక మంత్రి టీటీ కృష్ణమాచారి సంపద పన్నును(Top Union Budgets) ప్రవేశపెట్టారు. దీన్ని 2016లో రద్దు చేశారు.
  • 1970లో ఆర్థికమంత్రి పదవికి మొరార్జీ రాయ్ దేశాయ్ రాజీనామా చేశారు. దీంతో నాటి ప్రధాని ఇందిరా గాంధీనే ఆర్థిక శాఖ బాధ్యతలను చేపట్టారు. ఆ ఏడాది బడ్జెట్‌ను కూడా  ఆమే ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో రూ.2 లక్షలు పైబడిన ఆదాయంపై మార్జినల్ ట్యాక్స్ రేట్‌ను 11 పర్సంటేజ్ పాయింట్లు పెంచి 93.5 శాతానికి చేర్చారు. అభివృద్ధి, సంక్షేమం కోసం పన్నులను పెంచాల్సిన అవసరం ఉందని ఆనాడు ఇందిరా గాంధీ అభిప్రాయపడ్డారు. గరిబీ హఠావో అనే నినాదాన్ని ఇచ్చారు.
  • 1986  బడ్జెట్‌లో  ఆర్థికమంత్రి వీపీ సింగ్ పరోక్ష పన్నుల్లో సంస్కరణలను ప్రారంభించారు. మాడిఫైడ్ వాల్యూ యాడెడ్ టాక్స్ (MODVAT) స్కీమ్‌ను ప్రవేశపెట్టారు. విడి భాగాలు, పదార్థాలపై తయారీదారులు చెల్లించిన ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా రీయింబర్స్‌మెంట్ పొందేందుకు ఈ పథకం అనుమతి ఇచ్చింది.  దీనివల్ల మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉన్నవారిపై అదనపు పన్నుల భారం తగ్గింది. ఉత్పత్తుల ధర సైతం తగ్గింది.
  • 1991 సంవత్సరంలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను భారతదేశ చరిత్రలో అత్యుత్తమ బడ్జెట్‌గా పరిగణిస్తారు. ఇది మన దేశంలో లైసెన్స్ రాజ్‌కు ముగింపు పలికింది. ఆర్థిక సంస్కరణలకు తెర తీసింది. భారతదేశం దివాలా అంచున నిలిచిన టైంలో ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తెలుగువాడైన పీవీ నర్సింహారావు నాడు ప్రధానిగా ఉండగా.. నాటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ కస్టమ్స్ సుంకంతోపాటు ఎక్సైజ్ రేట్లను తగ్గించింది. ఎగుమతులు, దిగుమతులను పెంచేందుకు ఇంపోర్ట్-ఎక్స్‌పోర్ట్ పాలసీలో మార్పులు తీసుకొచ్చారు. భారత కంపెనీల్లోకి విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు తలుపులు తెరిచారు.
  • 1997లో నాటి ఆర్థిక మంత్రి పి.చిదంబరానికి తొలి బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్‌లో ఆదాయపన్నును 40 శాతం నుంచి 30 శాతానికి తగ్గించారు. దేశీయ కంపెనీలపై పన్నులను 40 శాతం నుంచి 35 శాతానికి తగ్గించారు. కార్పొరేట్ ట్యాక్స్‌పై సర్‌ఛార్జీని రద్దు చేశారు.
  • 2003లో నాటి ఆర్థిక మంత్రి జస్వంత్ సింగ్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌‌లో దేశంలోని కీలక నగరాలను కలిపే స్వర్ణ చతుర్భుజి రోడ్డు మార్గం కోసం రూ.75 వేల కోట్లను కేటాయించారు. న్యూఢిల్లీ, ముంబై ఎయిర్‌పోర్టుల ఆధునికీకరణతోపాటు.. హైదరాబాద్, బెంగళూరుల్లో విమానాశ్రయాల ఏర్పాటుకు ఈ బడ్జెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
  • 2017 సంవత్సరంలో రైల్వే బడ్జెట్‌ను కేంద్ర బడ్జెట్‌లో కలిపేశారు. దీంతో 92 ఏళ్లపాటు కొనసాగిన ప్రత్యేక రైల్వే బడ్జెట్‌ సంప్రదాయానికి అరుణ్ జైట్లీ గుడ్ బై చెప్పారు.

Also Read :Letter To Modi : ప్రధాని మోడీకి వైఎస్ షర్మిల లేఖ.. ఏయే అంశాలను ప్రస్తావించారంటే..