Site icon HashtagU Telugu

Water Crisis in Hyderabad : హైదరాబాద్ కు పెను ప్రమాదం పొంచి ఉందా..?

Water Crisis In Hyderabad

Water Crisis In Hyderabad

హైదరాబాద్ (Hyderabad) కు పెను ప్రమాదం పొంచి ఉందా..? బెంగుళూర్ తరహాలో నీటి కోసం (Water Crisis) కొట్లాటలు మొదలుకాబోతున్నాయా…? నీరు లేక ఇళ్ల నిర్మాణం ఆగిపోనుందా..? వేసిన బోర్లు ఎందుకు పనికిరాకుండా పోతాయా..? నగరవాసులు నీరు లేక సొంతర్లకు పయనం కావాల్సిందేనా..? నీరు పొదుపు చేయకపోతే మరో బెంగుళూర్ (Bangalore) గా హైదరాబాద్ కానుందా..? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒకటే..అది అవుననే చెప్పాలి.

గత సంవత్సరం తక్కువ వర్షాపాతం నమోదవటం, భూగర్భ జలాలు రోజురోజుకూ అడుగంటిపోతుండటంతో.. బెంగళూరులో నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. ఎక్కడికక్కడ బోర్లు ఎండిపోయి సుమారు.. నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా దేశ ఐటీ రాజధానిలో నీటి సంక్షోభం ఏర్పడింది. నగరంలోని పలుప్రాంతాల్లో నీటి ఎద్దడి ఎక్కువగా ఉండటంతో.. నీటి వినియోగంపై అధికారులు అంక్షలు కూడా విధించే స్థాయికి పరిస్థితులు దిగజారిపోయాయి. అయితే.. అలాంటి పరిస్థితులే హైదరాబాద్‌లోనూ రాబోతాయని హెచ్చరిస్తున్నారు. కోటికి పైగా జనాభాతో ఉన్న గ్రేటర్ హైదరాబాద్‎లో రానున్న రోజుల్లో తీవ్ర నీటి ఎద్దడి ఎదురుకాబోతుంది. ఇప్పటికే నగరంలో ప్రజల అవసరాలకే నీరు లభించని పరిస్థితి నెలకొంది. ఇళ్ల వద్ద బోర్లు ఎండిపోవడంతో ప్రజలు నీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు. వారు ప్రైవేట్‌ వాటర్‌ ట్యాంకర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది.

We’re now on WhatsApp. Click to Join.

గత వానాకాలం వర్షాలు సరిగా కురవకపోవడంతో కృష్ణా, గోదావరి బేసిన్ ప్రాజెక్టులు అడుగంటాయి. ఫలితంగా హైదరాబాద్‎కు మంచినీటి కష్టాలు మొదలయ్యాయి.గతేడాది వర్షాలు సరిపడనంతా పడలేదని.. ప్రాజెక్టుల్లో కూడా నీళ్లు లేవని.. అందుకే రైతులకు సాగునీరు ఇవ్వలేకపోతున్నామని, భూగర్భనీటి స్థాయిలు కూడా తగ్గిపోతున్నాయని నీటి కష్టాలు తప్పవని.. ప్రభుత్వ పెద్దలు డైరెక్టుగానే చెప్పకనే చెప్పేస్తున్నారు. రాష్ట్రమంతా ఎలా ఉన్నా.. సాధారణంగానే వేసవిలో హైదరాబాద్‌లో నీటి ఎద్దడి ఉంటుంది. అలాంటిది ఇప్పుడున్న పరిస్థితిలో ముందుముందు ఎలాంటి సంక్షోభం ఏర్పడనుందోనని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అందుకే ప్రభుత్వం సైతం ఇంకుడుగుంతల నిర్మాణానికి చర్యలు చేపడితే బాగుంటుందని భూగర్భ శాస్త్రవేత్తలు చెపుతున్నారు. వర్షపునీటిని వృధాగా పోనీయకుండా ఎక్కడికక్కడ ఆ జలాలను ఇంకుడు గుంటల లోనికి చేర్చగలిగితే భూగర్భ జల మట్టం పెరగడానికి ఎంతగానో దోహదపడతాయి. ఆరుబయట, ఇళ్ల ప్రహరీ లోపల, బోర్ల చుట్టు పక్కల ఇంకుడు గుంటల నిర్మాణం చేపడితే భూగర్భ జలం పెరుగుతుంది. ఏటేటా తగ్గిపోతున్న భూగర్భ జలమట్టం వృద్ధికి ఇంకుడు గుంటలే శరణ్యం. వీటి నిర్మాణానికి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. వీటిని నిర్మించి వృథా నీటిని వాటిలోకి పంపించడం ద్వారా ఆ ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం పెంపొందించుకోవచ్చు. ఇంకుడు గుంటలు నిర్మించినందున ఆ చుట్టు ప్రక్కల పడిన వృధాగా పోయే వర్షపు నీరు ఆ గుంటలో చేరి భూగర్భ జల మట్టము పెరిగి ఇదివరకు ఎండిపోయిన గొట్టపు బావులు తిరిగి జలసిరితో నిండిన సందర్బాలు అనేకం ఉన్నాయి. అందుకే ప్రభుత్వం వీటిపై దృష్టి సారించాలని కోరుతున్నారు. అలాగే నీటిని వృధా చేయకుండా ఉండాలని..ఎంత అవసరమో అంతే నీటిని వాడుకోవాలని సూచిస్తున్నారు.

Read Also :  Devineni Uma : దేవినేని ఉమకు చంద్రబాబు షాక్.. ఇండిపెండెంట్‌గా బరిలోకి ?