Site icon HashtagU Telugu

BJP Chief Bandi Sanjay: అర్ధరాత్రి వేళ బండి సంజయ్ అరెస్ట్

BJP Chief Bandi Sanjay

Resizeimagesize (1280 X 720)

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ (BJP Chief Bandi Sanjay)ను తెలంగాణ పోలీసులు మంగళవారం అర్థరాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన మద్దతుదారులు వీధుల్లోకి వచ్చి పోలీసులకు వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభించారు. భారీ సంఖ్యలో పోలీసు బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని బండి సంజయ్ ని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. పేపర్‌ లీక్‌ కేసులో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర అధ్యక్షుడు బుధవారం ఉదయం 9 గంటలకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయనున్నారని బీజేపీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే దీనిపై ఇంకా పోలీసుల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

మరోవైపు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలిపేందుకు బీజేపీ యోచిస్తోంది. ఈ విషయమై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రమేందర్‌రెడ్డి వార్తాసంస్థకు సమాచారం అందజేస్తూ.. కరీంనగర్‌లోని ఆయన నివాసం నుంచి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు. తెలంగాణలో ప్రధాని మోదీ కార్యక్రమానికి భంగం కలిగించే ప్రయత్నం ఇది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను అక్రమంగా అరెస్టు చేసినందుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.

Also Read: Gun Firing In Hyderabad: హైదరాబాద్‌లో అర్ధరాత్రి కాల్పుల కలకలం.. పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు.. ఒకరి మృతి

మరోవైపు, బండిని అరెస్ట్ చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. పోలీసు జులం నశించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అరెస్ట్ చేసిన బీజేపీ అధ్యక్షుడిని బొమ్మలరామారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గ్రూప్-1 ప్రశ్నపత్రాల లీకేజీ విషయంలో బండి సంజయ్ గతంలో ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. వాటికి సంబంధించి విచారణకు హాజరు కావాల్సిందిగా సిట్ రెండుసార్లు నోటీసులు జారీ చేసింది. ఆయన వెళ్లకుండా తన లీగల్ టీంను పంపించారు. మరోవైపు పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలోనే బండిని అరెస్ట్ చేసి ఉంటారని కూడా చెబుతున్నారు. పోలీసులు మాత్రం ఏ విషయాన్ని వెల్లడించలేదు.

తెలంగాణలో నిర్మించిన కొత్త సచివాలయ గోపురంపై బండి సంజయ్ ఇటీవల వివాదాస్పద ప్రకటన చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిజాం సంస్కృతికి అద్దం పట్టే సచివాలయ భవనంలోని గోపురం తొలగిస్తామని చెప్పారు. మేం అధికారంలోకి వస్తే తెలంగాణలో కొత్తగా నిర్మించిన సచివాలయం గోపురాలు సహా నిజాం సాంస్కృతిక చిహ్నాలను తొలగిస్తామని కరీంనగర్ బీజేపీ ఎంపీ సంజయ్ కుమార్ బండి అన్నారు. భారతి, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా తగిన మార్పులు చేస్తాం. దీంతో పాటు ఒవైసీని ప్రసన్నం చేసుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వ సచివాలయాన్ని తాజ్ మహల్‌గా మార్చారని బండి ఆరోపించారు.