BRS: బిఆర్ఎస్ వెనుక జాతీయ చరిత్ర

స్వాతంత్ర్యం వచ్చాక భారతదేశ జాతీయ పార్టీల చరిత్ర తీసుకుంటే బీజేపీ తర్వాత కొత్త జాతీయ పార్టీలేవీ ఏర్పడలేదు.

  • Written By:
  • Publish Date - October 5, 2022 / 08:35 PM IST

స్వాతంత్ర్యం వచ్చాక భారతదేశ జాతీయ పార్టీల చరిత్ర తీసుకుంటే బీజేపీ తర్వాత కొత్త జాతీయ పార్టీలేవీ ఏర్పడలేదు. కొన్ని ప్రాంతీయ పార్టీలు తమ పేర్లలో ‘ఆల్ ఇండియా’ అని పేరు పెట్టుకున్నా(ఏఐఏడీఎంకే, ఏఐఎమ్ఐఎమ్, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్) అవేవీ అఖిల భారత పార్టీలు కాలేకపోయాయి.
ఎన్నికల కమిషన్ నిర్వచనం ప్రకారం రెండు మూడు రాష్ట్రాలలో పోటీ చేసో, ఒకటి అరా సీట్లు గెలిచో నేషనల్ పార్టీ హోదా సంపాదించాకున్నాయి గాని, అసలైన అఖిల భారత పార్టీలుగా విస్తరించలేకపోయాయి. మరొక రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి ప్రాంతీయ పార్టీ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీయే.
ఎన్నికల కమిషన్ నిర్వచనం ప్రకారం ఇపుడు ఇండియాలో జాతీయ పార్టీ హోదా పొందిన ప్రాంతీయ పార్టీల ప్రభావం సొంత రాష్ట్రం బయట నామమాత్రమే. మరొకవైపు కమ్యూనిస్టు పార్టీల ప్రాబల్యం కుంచించుకుపోయి జాతీయ పార్టీ హోదా కోల్పోయే ప్రమాదం అంచుల దాకా వచ్చిన సందర్భాలు ఉన్నాయి.
రెండు అఖిల భారత పార్టీలలో ఒకటి 1885లో పుట్టిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. రెండోది ఆ తర్వాత దాదాపు వందేళ్లకు 1980లో ఉనికిలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ.
1885-1980 మధ్య దాదాపు శతాబ్ద కాలంలో అనేక జాతీయ పార్టీలు వచ్చాయి, పోయాయి. సోషలిస్టు పార్టీలు, భారతీయ జనసంఘ్, ముస్లిం లీగ్, కొన్ని కిసాన్ పార్టీలు, రకరకాల వామపక్షాల పార్టీలు అఖిల భారత స్థాయిలో ప్రాచుర్యం పొందినా, అవి కొన్ని సంవత్సరాల తర్వాత రూపాంతరం చెందడమో లేక రూపు మాసిపోవడమో జరిగింది.
ఈ పరిణామం ఎన్నికల్లో కూడా చూడవచ్చు. 1952లో జరిగిన మొదటి లోక్ సభ ఎన్నికల్లో 14 జాతీయ పార్టీలుండేవి. క్రమంగా వీటి సంఖ్య 2019 నాటికి ఏడుకు పడిపోయింది. 2019లో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన నేషనల్ పీపుల్స్ పార్టీకి జాతీయ పార్టీ హోదా రావడంతో దేశంలో జాతీయ పార్టీల సంఖ్య ఇపుడు ఎనిమిదికి పెరిగింది. జాతీయ పార్టీలనేవి ఎన్నికల కమిషన్ నిర్వచనం ప్రకారం పొందిన అర్హతే తప్పేఅఖిల భారత స్థాయికి విస్తరించిన పార్టీ అని అర్థం కానే కాదు. వీటిని మల్టీస్టేట్ పార్టీలుగా చూడాల్సిందే.
జాతీయ పార్టీ హోదా ఓట్ల ఆధారంగా, సీట్ల అధారంగా వస్తుంది. ఇతర రాష్ట్రాలలో పోటీ చేసి ఓట్లు పొందినా సీట్లు పొందినా కనీసం నాలుగు రాష్ట్రాలలో గుర్తింపు పొందినా జాతీయ హోదా వస్తుంది. ఒక పార్టీకి జాతీయ పార్టీ హోదా రావాలంటే అర్హతలేమిటో పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్‌లో స్పష్టంగా చెప్పారు. అంతే తప్ప ‘జాతీయ పార్టీ’ అని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడమనేదేమీ ఉండదు. ఈ హోదాను సాధించడమే తప్ప ప్రకటించుకోవడం అనేది ఉండదు.