BRS Plenary: బీఆర్ఎస్ ప్లీనరీ తీర్మానాలు, జాతీయ రాజకీయాలే లక్ష్యం!

వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ ప్లీనరీ తీర్మానాలను ప్రవేశపెట్టారు.

  • Written By:
  • Updated On - April 27, 2023 / 03:04 PM IST

పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ మినీ ప్లీనరీ(Brs plenary )లు నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR) బీఆర్ఎస్ ప్లీనరీ తీర్మానాలను ప్రవేశపెట్టారు.

భారతదేశాన్ని 75 సంవత్సరాల పరిపక్వ ప్రజాస్వామ్య దేశంగా ఘనంగా చెప్పుకుంటున్నాం. కానీ, నేటికీ దేశ ప్రజలు మాత్రం కనీస అవసరాలైన తాగునీరు, సాగునీరు, విద్యుత్తు లభించక అల్లాడిపోతున్నారు. మౌలిక వసతుల కొరత వల్ల దేశప్రగతి (Country Growth) మందగిస్తున్నది. దేశాభివృద్ధికి చోదకశక్తిగా నిలవాల్సిన యువశక్తి ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో నిర్వీర్యమై, నిరాశా నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నది. భారతీయ సమాజంలో కుల, మత, లింగ వివక్షలు నేటికీ కొనసాగుతూ ఉండటం విషాదం. ఈ వివక్షల వల్ల సంకుచిత ధోరణులు తలెత్తి, భారతీయ సమాజ వికాసం ఆశించిన స్థాయిలో జరగడం లేదు. దేశంలో అసహనం, ఆందోళన పెరిగిపోతున్నాయి. సామాజిక సమానత్వం కొరవడిన దేశంలో దళిత, గిరిజన, ఆదివాసీ, బడుగు, బలహీన వర్గాల ప్రజలు స్వావలంబన, ఉపాధి అవకాశాలు లభించక పేదరికంలో మగ్గిపోతున్నారు.

ఆధునిక విలువలు ప్రతిబింబించే భారత రాజ్యాంగం ప్రజలందరికీ ప్రాథమిక హక్కులు, రక్షణలను కల్పించినప్పటికీ నేటికీ దేశంలో దళిత, మైనారిటీ వర్గాల ప్రజల మీద జరుగుతున్న దాడులు నాగరికతా విలువలను పరిహసిస్తున్నాయి. అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను దిగజారుస్తున్నాయి. దేశంలో కొనసాగుతున్న ఈ రకమైన వైఖరులు ఎంతమాత్రం ఆమోదయోగ్యమైనవి కావు. ఎంతోమంది చరిత్రకారులు పేర్కొన్నట్లు మన భారతదేశం నిజంగా రత్నగర్భ. ప్రకృతి (Nature) ప్రసాదించిన అపారమైన అద్భుత వనరులెన్నో దేశానికి ఉన్నాయి. పుష్కలమైన జల సంపద, అటవీ సంపద, భూగర్భంలో అపారంగా అనేకరకాల ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. అయితే, అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుని నోట్లో శని ఉన్నట్లు.. పాలకుల వైఫల్యం వల్ల ప్రజలు కనీస అవసరాలు తీరక, దుర్భరమైన పేదరికాన్ని అనుభవించవలసి వస్తున్నది. ఉదాహరణకు మనిషి మనుగడకు ప్రాథమిక అవసరమైన నీటి విషయాన్నే పరిశీలిద్దాం.

దేశంలో నీటి వనరుల లభ్యత దేశ ప్రజల అవసరాలకు మించిన స్థాయిలో ఉంది. ఏటా దాదాపు 4,000 బిలియన్ క్యూబిక్ మీటర్ల వర్షం కురుస్తున్నది. అంటే 1 లక్ష 40 వేల టీ.ఎం.సీ.ల వర్షపాతం సంభవిస్తున్నది. ఇందులో ఆవిరై పోయిన, గడ్డ కట్టుకుపోయిన, ఇంకిపోయిన సగం నీటిని తీసేస్తే నికరంగా 70 వేల టీఎంసీల నీరు (Water) నదుల్లో ప్రవహిస్తున్నది. విషాదమేమిటంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దేశవ్యాప్తంగా కేవలం 20 టి.ఎం.సీ.ల నీటిని మాత్రమే వినియోగంలోకి తెచ్చుకున్నాం. వినియోగ యోగ్యమైన మిగతా 50 వేల టీ.ఎం.సీ.ల జలాలు వృథాగా ఉప్పు సముద్రం పాలవుతున్నాయి. ఇందులోనుంచి మరో 20 వేల టి.ఎం.సిల నీటిని వినియోగించుకుంటే దేశంలో సాగు యోగ్యమైన 41 కోట్ల ఎకరాల్లో ప్రతి ఎకరానికీ సాగునీరందించవచ్చు.

ఈ లెక్కలు ఎవరి కల్పితాలు కావు. స్వయంగా కేంద్ర ప్రభుత్వం వెలువరించిన గణాంకాలు. 50 వేల టీ.ఎం.సీ.ల నీరు సముద్రం పాలవుతుంటే.. ఏమీ పట్టనట్టు దేశ పాలకులు తమాషా చూస్తున్నారు. దేశంలో ఎక్కడచూసినా తాగునీటికి, సాగునీటికి కటకటనే. 75 సంవత్సరాల చరిత్ర చూస్తే స్వాతంత్ర్యం లభించిన తొలినాళ్లలో నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నకాలంలో దేశ నిర్మాణం కోసం బలమైన అడుగులు పడ్డాయి. దేశవ్యాప్తంగా సాగునీటి అవసరాల కోసం భాక్రానంగల్, నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) తదితర భారీ ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. కానీ, తదనంతరం దేశాన్ని పరిపాలించిన ప్రభుత్వాలు పూర్తిగా నిష్ర్కియా పరత్వంతో వ్యవహరించాయి. నిర్ణీత కాల వ్యవధితో కూడిన, ఆచరణ యోగ్యమైన సమగ్ర సాగునీటి విధానం రూపొందించి, అమలు చేయకపోవడం వల్ల దేశ ప్రజలు అనవసరంగా, అకారణంగా అష్టకష్టాలు అనుభవిస్తూ శాపగ్రస్త జీవితాలు గడుపుతున్నారు. ఇప్పటికీ దేశానికి తగిన సాగునీటి విధానం రూపొందకపోవడం ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యగా చెప్పుకోవాలి.

ప్రకృతి వరప్రసాదంగా అనేక జీవ నదులు పారుతున్న భారతదేశంలో కరువు కాటకాలతో ప్రజలు అల్లాడుతున్నారు. పచ్చని పంటలు పండాల్సిన పొలాలు నెర్రెలుబారి నిర్జీవమై పోతున్నాయి. దిక్కుతోచని రైతన్నలు సాగునీటి కోసం తమ శ్రమఫలాన్నంతా ధారపోస్తున్నారు. బోర్ల మీద బోర్లు వేసినా ఫలితంలేక నిరాశా, నిస్పృహలతో నీరసించి పోతున్నారు. అంతకంతకూ అప్పుల భారం పెరిగిపోయి దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ పాపానికి కారకులు ఇంకెవరో కాదు, ఖచ్చితంగా ఈ దేశ పాలకులే.

పాలకుల అవగాహనా రాహిత్యానికి ఎన్నో నిదర్శనాలు. భారతదేశంకన్నా విస్తీర్ణంలోనూ, జనాభాలోనూ చాలా చిన్నవైన దేశాలు పెద్ద పెద్ద రిజర్వాయర్లు నిర్మించుకున్నాయి. మన దేశం కంటే చాలా చిన్న దేశమైనా జింబాబ్వేలో ప్రపంచంలోనే అతిపెద్ద దైన రిజర్వాయర్ ఉంది. జాంబేజీ నదిపై నిర్మించిన కరీబా డ్యామ్ సామర్థ్యం 6,533 టిఎంసిలు. అదే విధంగా రష్యాలోని అంగారా నదిపై 5,968 టిఎంసిలతో బ్రాట్స్క్ డ్యామ్ ఉంది. ఆఫ్రికా ఖండంలోని ఘనా అనే దేశంలో ఓల్టా నదిపై 5,085 టిఎంసిల సామర్థ్యం కలిగిన అకొసోంబో రిజర్వాయరు ఉంది. కెనడా దేశంలో మనీకూగాన్ నదిపై 4,944 టీ.ఎం.సీ.ల జాన్సన్ డ్యామ్, వెనిజులా దేశంలో కరోనీ నదిపై – 4,767 టీ.ఎం.సీలతో గురి అనే పేరుగల డ్యామ్, ఈజిప్టు దేశంలో – నైలు నదిపై – 4,661 టీ.ఎం.సీ.లతో అస్వన్ హై డ్యామ్, కెనడా దేశంలో బ్రిటిష్ కొలంబియాలో పీస్ నదిపై – 2,613 టీఎంసీలతో బెన్నెట్ డ్యామ్, రష్యా దేశంలో యెనిసే నదిపై – 2,588 టీఎంసీలతో క్రాస్నో యార్స్ క్ డ్యామ్, రష్యా దేశంలో జేయా నదిపై – 2,401 టీఎంసీలతో జేయా డ్యామ్, కెనడా దేశంలోని లా గ్రాండే నదిపై 2179 టీఎంసీలతో రాబర్ట్ బౌరాసా డ్యామ్, చైనా దేశంలో – యాంగ్సీ నదిపై- 1400 టీ.ఎం.సీ.ల త్రీగార్జెస్ డ్యామ్, అమెరికా దేశంలోని – కొలరాడో నదిపై- 1243 టీ.ఎం.సీ.లతో హూవర్ డ్యామ్, బ్రెజిల్ దేశంలోని – పరానా నదిపై- 1024 టీ.ఎం.సీ.లతో ఇతైపూ మొదలైన రిజర్వాయర్లు రూపుదాల్చాయి.

ఇలాంటి భారీ రిజర్వాయర్లు మనదేశంలో కనీసం రెండు మూడైనా ఉండాలి కదా? లేవంటే పాలకులు ఎంత అవగాహనా రాహిత్యంతో ఉన్నరో అర్ధం చేసుకోవచ్చు. ఇటువంటి రిజర్వాయర్ల నిర్మాణం వల్ల సాగునీటి అవసరాలు తీరిపోవడమేగాకుండా, అతివృష్టి, అనావృష్టి ద్వారా సంభవించే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అటు వరదల ముప్పును, ఇటు కరువు కాటకాలను రెండింటినీ నివారించే అవకాశమూ ఉంటుంది.
పాలకులు ఇటువంటి చర్యలేవీ చేపట్టకపోవడం వల్ల ఇప్పటికే అనేకమంది అన్నదాతలు అసువులుబాసారు. అనాథలైన వారి కుటుంబాలు అంతులేని విషాదాలను ఎదుర్కొన్నాయి.

ఈరోజు ఒక్క తెలంగాణ (Telangana) రాష్ట్రం మినహాయించి, దేశంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలు తాగు, సాగునీరు లభించక భయంకరమైన బాధలు అనుభవిస్తున్నారు. దేశంలోని అనేక ప్రముఖ పట్టణాల్లో, నగరాల్లో వారం పదిరోజులకొకసారిగానీ తాగునీరు సరఫరా కావడం లేదు. ఇక పల్లెల సంగతి మరింత అధ్వాన్నం. మహిళలు బిందెలు నెత్తిన పెట్టుకొని మైళ్లకు మైళ్లు నడిచి తాగునీరు తెచ్చుకోవలసి వస్తున్నది. కడివెడు నీళ్లకోసం వీధిపోరాటాలకు దిగవలసి వస్తున్నది. కలుషిత జలాలు తాగడం వల్ల ఫ్లోరోసిస్ వంటి వ్యాధుల బారిన పడి జీవితాలనే కోల్పోవలసి వస్తున్నది.
మనదేశంలో రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ ఒక ప్రహసనంగా మారిపోయింది. రాష్ట్రాల వాటాలను తేల్చడం కోసం ఏర్పాటు చేసిన ట్రిబ్యునళ్లు తరాలు గడిచిపోతున్నా తీర్పులు వెలువరించవు. అసమర్థ కేంద్ర ప్రభుత్వాలుంటే ఎట్లా ఉంటదంటే.. ట్రిబ్యునల్ కేసులపై రెండు, మూడు దశాబ్దాలైనా తీర్పులు రావు. ఎన్విరాన్ మెంటల్, గ్రీన్ ట్రిబ్యునల్ క్లియరెన్సులు రావడానికి మరిన్ని దశాబ్దాలు పడుతుంది. ప్రాజెక్టుల రూపకల్పన, డిజైన్ల ఖరారు, సీడబ్ల్యూసీ ఆమోదం, అనుమతులు ఇవి క్లియర్ కావడానికి ఇంకొన్ని దశాబ్దాలు. ఈ అలసత్వం, అకారణ జాప్యం వల్ల కొన్ని తరాల ప్రజలు తమ విలువైన జీవితాలనే మూల్యంగా చెల్లించాల్సి వస్తున్నది.

ఇప్పటికీ మహానది నీళ్ల కోసం ఒరిస్సా, ఛత్తీస్ గఢ్ కొట్టుకోవాల్సిన అవసరం ఉందా? సట్లెజ్, దాని ఉప నదులైన రావి, బియాస్, చీనాబ్ నదుల జలాల కోసం పంజాబ్, హర్యానా, రాజస్థాన్ తన్నుకోవాల్నా? నర్మదా జలాల కోసం గుజరాత్ నుంచి మధ్యప్రదేశ్ దాకా కొట్టుక చావాల్నా? కావేరీ నదీ జలాల కోసం తమిళనాడు, కర్ణాటక, కేరళ జుట్లు జుట్లు పట్టుకోవాల్నా? కృష్ణా, గోదావరి నదుల నీళ్ల కోసం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రల మధ్య ఎంతకూ తెగని నిరర్ధక పంచాయతీలు కొనసాగుతనే ఉండాల్నా?

అత్యంత లోపభూయిష్టమైన నీటి విధానం వల్లనే దేశ ప్రజలు తరతరాలుగా తాగు, సాగునీటి కోసం పడరాని పాట్లు పడుతున్నరు. చెప్పరాని బాధలు అనుభవిస్తున్నరు. దేశంలో ఇపుడు అవలంబిస్తున్న లోపభూయిష్టమైన నీటి వినియోగ విధానాన్ని సమూలంగా మార్చేందుకే బీఆర్ఎస్ పుట్టింది.
రైతులే కేంద్రంగా నవభారత నిర్మాణం కోసం ‘‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’’ అంటూ గులాబీ జెండానెత్తింది. కండ్లముందు వేల టీఎంసీల నీరు సముద్రం పాలవుతున్న దుస్థితిని తొలగించడం కోసమే బీఆర్ఎస్ పుట్టింది. ప్రకృతి ఇచ్చిన జల సంపదను సంపూర్ణంగా, సమగ్రంగా వినియోగంలోకి తీసుకురావాలన్నదే బీఆర్ఎస్ లక్ష్యం ఇందుకోసం భారత ప్రజలను ఏకీకృతం చేసి, బలీయమైన రాజకీయశక్తిగా బీఆర్ఎస్ పురోగమించాలని ఈ సభ తీర్మానిస్తున్నది. వృథాగా సముద్రం పాలవుతున్న నీటిని వినియోగించుకోవడానికి అవసరమైన ప్రాజెక్టులను బీఆర్ఎస్ నిర్మించాలి. ఈ నీళ్లలో ప్రతి రాష్ట్రానికీ తగిన నీటి కేటాయింపులు ఉండాలి. ప్రతీ రాష్ట్రంలో కనీసం ఒక భారీ నీటి ప్రాజెక్టునైనా కేంద్ర నిధులతో నిర్మించాలి.

భవిష్యత్తులో బీఆర్ఎస్ నేతృత్వంలో దేశ అవసరాలకు తగిన విధంగా ఒక సమగ్ర సాగునీటి విధానం రూపొందాలి. తెలంగాణలో నెలకొల్పిన రైతురాజ్యం భారతదేశమంతటా స్థాపించాలి. ఇందుకోసం అలుపెరగని పోరాటం దిశగా బీఆర్ఎస్ పార్టీ పురోగమించాలి అని నేటి బీఆర్ఎస్ ప్రతినిధుల సభ తీర్మానిస్తున్నది.

నీళ్ల వ్యథ ఎట్లుందో.. కరంటు కథ అట్లే ఉంది. కోల్ ఇండియా ఇచ్చిన లెక్కల ప్రకారం దేశంలో 360 బిలియ‌న్ ట‌న్నుల బొగ్గు ఉంది. ఈ బొగ్గుతో 125 ఏండ్లు ఏ కొరత లేకుండా కరెంటు ఇవ్వవచ్చు. దేశంలో ఇంకా కనుగొనని బొగ్గు నిక్షేపాలు ఎన్నో ఉన్నాయి. వాటినుంచి కూడా వెలికి తీస్తే శతాబ్దాల పాటు కరెంటును ఉత్పత్తి చేయవచ్చునని ఖనిజ శాస్త్ర నిపుణుల పరిశోధనల ద్వారా తేలుతున్నది. మన దేశానికి 4 లక్షలకు పైగా మెగావాట్ల విద్యుత్ స్థాపిత సామర్థ్యం ఉంది. దేశంలో ఉన్న జల వనరులను సంపూర్ణంగా వినియోగించుకుంటే మరో లక్ష మెగావాట్ల విద్యుదుత్పత్తికి అవకాశం ఉంది. భారతదేశంలో అనంతమైన సౌరశక్తి అందుబాటులో ఉంది. ఇన్ని ఉండి కూడా కరెంటు కోతలతో దేశం చీకటి వెతలను అనుభవిస్తున్నది. కరెంటు కొరత ప్రభావం వ్యవసాయం, వ్యాపారం, పరిశ్రమలు తదితర అనేక రంగాలపై పడి దేశ ఆర్థికస్థితి బలహీన పడుతున్నది.
తలసరి విద్యుత్ వినియోగం అనేది అభివృద్ధి స్థాయిని తెలియజేసే ప్రబలమైన సూచిక. ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే ఐస్ లాండ్ అనే చిన్నదేశం అగ్రస్థానంలో ఉంది. ఈ దేశంలో తలసరి విద్యుత్‌ వినియోగం 52,980 యూనిట్లు. నార్వేలో 27,529 యూనిట్లు. ఖతార్ లో 17,670, స్వీడన్ లో 16,538, కెనడాలో 16,405, అమెరికాలో 12,314, దక్షిణ కొరియా 11,355, సౌదీ అరేబియా 9,920, ఆస్ట్రేలియాలో 9,531, ఫ్రాన్స్ 8,545, 7,692, చైనా 5,950, బ్రెజిల్ 3,091 యూనిట్లు కాగా మన ఇండియాలో తలసరి విద్యుత్ వినియోగం కేవలం 1,218 మాత్రమే. 140 దేశాలను సర్వే చేస్తే మన ఇండియా స్థానం 104. ఇది విశ్వగురువులుగా బడాయిలు పోతున్న మన పాలకులు సాధించిన మహత్తర ఫలితం.

మన దేశంలో అందుబాటులో ఉన్న 361 బిలియన్ టన్నుల బొగ్గును హైబ్రిడ్ పద్ధతిలో వాడినట్లయితే దేశ ప్రజలందరికీ అన్నిరంగాలకు 24 గంట‌లు నిరంతరాయంగా నాణ్యమైనే విద్యుత్తును 150 సంవత్సరాలపాటు అందించవచ్చు. వ్యవసాయరంగంలో నెలకొన్న కరెంటు సంక్షోభాన్ని సునాయసంగా పరిష్కరించుకోవచ్చు. ఇందుకు మన తెలంగాణ రాష్ట్రమే ప్రత్యక్ష ఉదాహరణ. తెలంగాణ తరహాలో దేశంలో విద్యుత్తు సరఫరా చేయాల్సిన అవసరం ఉండగా అందుకు భిన్నంగా దేశ ప్రజల నెత్తురు, చెమటతో నిర్మాణమైన లక్షల కోట్ల విలువైన విద్యుదుత్పత్తి, విద్యుత్తు పంపిణీ వ్యవస్థలను, అవి నిర్మాణం చేసుకున్న మౌలిక వసతులను అడ్డికి పావుసేరు చొప్పున ప్రైవేటు భూతాలకు అప్పజెప్పేందుకు దేశ పాలకులు రంగం సిద్ధం చేస్తున్నారు. అంతేగాకుండా దేశీయమైన బొగ్గు నిల్వలుండగా అవినీతికి పాల్పడుతూ అనవసరంగా విదేశీ బొగ్గును రాష్ట్రాలతో అధిక ధరకు కొనిపిస్తున్నారు. ఇటు బొగ్గు గనుల్ని, అటు విద్యుత్తు రంగాన్ని రెండింటినీ ప్రైవేటుకు అప్పజెప్పి ప్రజల మీద మోయలేని బిల్లుల భారాన్ని మోపేందుకు నిర్లజ్జగా పన్నాగాలు రచిస్తున్నారు. ఈ ప్రజా వ్యతిరేక విధానాలను తుదముట్టించేందుకు బీఆర్ఎస్ పార్టీయే దేశవ్యాప్త ఉద్యమం నిర్మించాలని ఈ ప్లీనరీ తీర్మానిస్తున్నది. తెలంగాణలో కరెంటు సమస్యను పరిష్కరించిన అనుభవంతో దేశంలోనూ వ్యవసాయానికి ఉచితంగా, అన్నిరంగాలకు 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేసే విధంగా నూతన విద్యుత్తు విధానాన్ని బీఆర్ఎస్ అమల్లోకి తీసుకురావాలని నేటి బీఆర్ఎస్ ప్రతినిధుల సభ తీర్మానిస్తున్నది.

ప్రభుత్వం మద్దతిస్తే తప్ప వ్యవసాయ రంగం నిలబడలేని స్థితి దేశమంతా అలుముకొని ఉంది. కానీ ఈ విషయంలో కేంద్రంలో ఇన్నేళ్లుగా పాలించిన ప్రభుత్వాలు ఎన్నడూ రైతుకు అండగా నిలబడలేదు. దేశంలో రైతులు పంట పెట్టుబడి నుంచి పంట కొనుగోలు దాకా అన్నిదశల్లోనూ అష్టకష్టాలను ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో మాత్రమే దుక్కి దున్నిన దశ నుంచీ పంటల కొనుగోలు దాకా ప్రభుత్వం అడుగడుగునా అండదండలనిస్తున్నది. రైతుబంధు పథకం ద్వారా ప్రభుత్వమే రైతుకు పంట పెట్టుబడి సాయాన్ని ఏడాదికి ఎకరానికి (రెండు పంటలకు) 10 వేల రూపాయలిస్తున్నది

రైతు ఏ కారణంచేత మరణించినా, ఆ కుటుంబం ఆగం కావద్దని రైతు బీమా పథకం ద్వారా ఆ కుటుంబానికి 5 లక్షల సాయం అందిస్తున్నది. రైతుల ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే ఎల్.ఐ.సీ. సంస్థకు చెల్లిస్తున్నది. తెలంగాణ రైతుబంధు, రైతు బీమా పథకాలను ఐక్యరాజ్య సమితి కూడా అభినందించడం మనందరికీ గర్వకారణం. తెలంగాణ ప్రభుత్వం 1 కోటి ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించింది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ప్రతి ఏటా 2 కోట్ల 9 లక్షల ఎకరాల పంట సాగవుతున్నది. దీంతో వానా కాలం, యాసంగి కలిపి దాదాపు 3 కోట్ల టన్నుల పంటల దిగుబడి వస్తున్నది. నేడు తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నపూర్ణ అయింది. రైతు బాధలు తెలిసిన రైతుబిడ్డ మన సీఎం కేసీఆర్ గారు ఏ తంటాలు లేకుండా, ఊరూరా కాంటాలు పెట్టించి మొత్తం ధాన్యాన్ని కొంటూ రైతుబాంధవుడిగా నిలిచారు. ఇదే విధంగా దేశమంతటా జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
దేశంలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను స్థాపించడం ద్వారా అటు రైతుకు మేలు చేయడమేకాకుండా, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెద్దఎత్తున కల్పించవచ్చు. అద్భుతమైన ఆహార వైవిధ్యం, సంస్కృతి ఉన్న భారతదేశంలో నేడు పిల్లలు, పెద్దలు విదేశీ మెక్ డొనాల్డ్ తదితర కంపెనీల పిజ్జాలు, బర్గర్లు తింటుండటం సిగ్గుచేటైన విషయం. దేశ పాలకులు సరిగా వ్యవహరిస్తే, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను గొప్పగా అభివృద్ధి చేసి, దేశంలో అద్భుతమైన ఫుడ్ చైన్ నిర్మించవచ్చు. మన దేశం బ్రాండ్ తో విదేశాలకు అనేక ఫుడ్ ప్రొడక్టులను ఎగుమతి చేయవచ్చు. కానీ, ఇపుడు దేశంలో ఆ పని జరగడం లేదు. దిగుమతులే తప్ప ఎగుమతులు జరుగుతున్న దాఖలాలు లేవు.

ఈ దేశంలో రైతుల పరిస్థితి నానాటికీ దిగజారిపోతున్నది. పంటలు పండాల్సిన పొలాల్లో రైతుల శవాలు తేలుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 13 నెలలపాటు రైతులు ధర్నాలు నిర్వహించారు. ఈ ఆందోళనల్లో 750 మంది రైతులు ఆహుతైపోయారు. అయినా, ఈ దేశంలోని అనేక రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదు. రైతు బాధలు తెలిసిన రైతు బాంధవుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ దేశమంతటా విస్తరించి, పంటలు పండించే రైతులను పాలకులుగా మార్చాలని హలంపట్టిన చేతులతో కలం పట్టించి చట్టాలను తయారు చేయాలని, మట్టిని పిసికిన చేతులు మంచి ప్రణాళికలను రూపొందించాలని, రైతు సంక్షేమం వర్ధిల్లే విధంగా దేశంలో నిజమైన రైతు రాజ్యాన్ని నెలకొల్పే దిశగా బీఆర్ఎస్ పురోగమించాలని ఈనాటి పార్టీ ప్రతినిధుల సభ తీర్మానిస్తున్నది.

ప్రజాస్వామ్యం అంటే అన్నివర్గాల ప్రజలూ సమాన ప్రతిపత్తితో పరస్పరం గౌరవాభిమానాలతో జీవించే ఉన్నతమైన జీవన విధానం. ఒక వర్గం ప్రజల్ని అణగదొక్కి వుంచే అధికారం ఎవ్వరికీలేదు. ఏనాటికైనా ఈ కుల వ్యవస్థ రద్దయిపోవాలి. కుల నిర్మూలన దిశగా ప్రయాణించడమే నిజమైన పురోగమనం. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా దళితుల జీవితాల్లో అలుముకున్న చీకట్లు మాత్రం తొలిగిపోలేదు. తరతరాల సామాజిక వివక్ష నేటికీ కొనసాగుతూనే ఉన్నది. అనాగరికమైన పద్ధతుల్లో దళితుల మీద నేటికీ అవమానకరమైన దాడులు, హింస జరుగుతూనే ఉన్నది. సమానత్వ ప్రపంచాన్ని నిర్మించాలనే భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయం నెరవేర్చడంలో ఇంతకాలం ఈ దేశాన్ని పాలించిన పాలకులు పూర్తిగా విఫలమయ్యారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దళితులను ఆదుకునేందుకు ఏ రకమైన కార్యాచరణ రూపొందించలేదు. ఒక్క పథకాన్నీ అమల్లోకి తేలేదు. దేశ జనాభాలో అధికశాతం ప్రజలను దారుణమైన వివక్షతో అణచివేస్తున్నది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును వల్లిస్తూ, ఆయన ఆశయాలకు ద్రోహం చేస్తున్నది. బీజేపీ ప్రభుత్వ హయాంలో దళితులమీద దాడులు పెరిగి పోయాయి. బీజేపీ ప్రభుత్వ దళిత వ్యతిరేక వైఖరిని బీఆర్ఎస్ ప్రతినిధుల సభ తీవ్రంగా ఖండిస్తున్నది. వేల సంవత్సరాలుగా అణగారిపోయిన దళిత సామాజిక వర్గం, మిగతా సామాజిక వర్గాలతో సమానంగా అభివృద్ధిని సాధించాలంటే కొద్దిపాటి సంస్కరణలు సరిపోవు. విశాలదృక్పథంతో ఒక పెద్ద ప్రయత్నం జరగాలె, అది విప్లవాత్మక మార్పుకు దారితియ్యాలే అన్నది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పట్టుదల. వారి దార్శనిక దృక్పథంలోంచి జనించిన విప్లవాత్మక పథకం తెలంగాణ దళితబంధు.

ఆర్తితో పెనుగులాడుతున్న దళితుల చేతికి చాలినంత పెట్టుబడి అందిస్తే వారిలో ఆత్మవిశ్వాసం రెక్కలు విప్పుకుంటుంది. ఆకాశమే హద్దుగా ముందడుగు వేయటం సాధ్యమవుతుందని బీఆర్ఎస్ అధినాయకులు కేసీఆర్ గారు భావించారు. ఆ ఇచ్చేది కూడా గత ప్రభుత్వాల మాదిరిగా అప్పుగా ఇవ్వకూడదని పూర్తిగా ఉచిత గ్రాంటు రూపంలో ఇవ్వాలని నిర్ణయించారు. తెలంగాణ దళితబంధు పథకం ఫలితంగా రాష్ట్రంలోని వేలాది దళిత కుటుంబాలు స్వావలంబనను సాధించాయి. ఆ విజయ గాథలు దేశవ్యాప్తంగా మార్మోగుతున్నాయి. తెలంగాణా దళితబంధు నిశ్చయంగా దళిత ప్రజానీకానికి వెలుగునిచ్చు చైతన్యజ్యోతిగా దేశవ్యాప్తంగా ప్రశంసలందుకుంటున్నది. దళితుల సమగ్ర అభ్యున్నతి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకాన్ని బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా అమలు చేయడం కోసం దేశ విధాన నిర్ణేతగా బీఆర్ఎస్ అవతరించాలని సభ తీర్మానిస్తున్నది.

మెరుగైన మౌలిక వసతుల కల్పనే దేశ అభివృద్ధికి సోపానం. ప్రపంచంతో పోలిస్తే మనదేశంలో మౌలిక వసతుల కల్పన ఆశించిన స్థాయిలో జరగలేదు. రహదారుల నుంచి విమానాశ్రయాలు, నౌకాశ్రయాల దాకా అన్నింటా వెనకబాటే. ఏ ప్రమాణంలో చూసినా మన దేశంలోని మౌలిక వసతులు చాలా తక్కువస్థాయిలో ఉండటం బాధాకరం. భారతదేశంలో జాతీయ రహదారులపై వాహనాల సగటు వేగం కేవలం 50 కిలోమీటర్లు మాత్రమే ఉన్నది. జపాన్, సౌత్ కొరియా లాంటి దేశాల్లో 80 కిలోమీటర్లు, బ్రిటన్, అమెరికాల్లో 95 నుంచి 115 కిలోమీటర్లుగా ఉన్నది. భారతదేశంలో రైలు సగటు వేగం గంటకు 36 కిలోమీటర్లయితే, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో రైలు సగటు వేగం 80 కిలోమీటర్లు. ఇండియాలో సగటు కారు స్పీడు పాకిస్తాన్ కంటే తక్కువ స్థాయిలో ఉన్నది. 162 దేశాల్లో మనది 127వ స్థానం..గూగుల్ మ్యాపు వాళ్లు ప్రపంచవ్యాప్తంగా రూట్ మ్యాప్ ట్రావెలింగ్ టైమ్ తెలుసుకోవడానికి చేసిన సర్వేలో ఈ విషయం తేలింది. రోడ్డు రవాణాలో అంతర్జాతీయ సగటు ట్రక్కు స్పీడు 105 కి.మీ. ఉంటే.. మన దేశం ట్రక్కు స్పీడు కేవలం 80 కిలోమీటర్లు మాత్రమే. అంతర్జాతీయంగా గూడ్సు రైలు స్పీడును పరిశీలిస్తే చైనాలో 120 కిలోమీటర్లు ఉంటే.. అమెరికాలో 78 కి.మీ, మన దేశంలో సగటు స్పీడు కేవలం 24 కిలోమీటర్లు మాత్రమే. 2022 సంవత్సరంలో చైనాలోని పోర్టులు హ్యాండిల్ చేసిన కార్గో కంటెయినర్ల సంఖ్య 210 మిలియన్లు. సింగపూర్ పోర్టులు నిర్వహించిన కంటెనర్ల సంఖ్య 37.3 మిలియన్లు కాగా, మన దేశంలోని పోర్టులు నిర్వహించిన కంటెయినర్ల సంఖ్య కేవలం 25.7 మిలియన్లు మాత్రమే. అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా భారతదేశంలో మౌలిక వసతులను అభివృద్ధి చేసేందుకు బీఆర్ఎస్ అద్భుతమైన ప్రణాళికలను రచిస్తున్నది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలోనే దేశంలో భారీస్థాయిలో అద్భుతమైన మౌలిక వసతుల కల్పన జరిపించాలని ఈ సభ తీర్మానిస్తున్నది.

ఒక దేశం సామాజిక సమగ్ర స్వరూపాన్ని అవగాహన చేసుకోవడంలో గణాంకాలు కీలకపాత్ర వహిస్తాయి. ‘‘ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్’’గా పేరుగాంచిన ‘మహాలనోబిస్’ పేర్కొన్నట్టు “statistics without planning has no fruit, planning without statistics has no root.” ప్రణాళిక లేని గణాంకాలతో ఫలితం ఉండదు, గణాంకాలు లేని ప్రణాళికలతో ప్రయోజనం ఉండదు. మన దేశంలో 1872 లో మొదటిసారిగా జనాభా గణన జరిగింది. ప్రపంచ యుద్ధాలు జరుగుతున్న కాలంలో కూడా జనాభా గణన జరపకుండా ఆపలేదు. కానీ, నేడు దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం మాత్రం జనాభా గణన చేపట్టడానికి నిరాకరిస్తున్నది. దురదృష్టమేమిటంటే ఈనాటికీ పన్నెండేళ్ల క్రితం 2011 సంవత్సరంలో జరిపిన జనాభా లెక్కల ప్రాతిపదికనే కేంద్ర ప్రభుత్వ పాలసీలు కొనసాగుతున్నాయి. ఫలితంగా ఆయా సామాజిక వర్గాలకు వారి జనాభా దామాషాకు అనుగుణంగా అభివృద్ధి ఫలితాలు లభించడం లేదు. ఇంతకంటే ప్రజా ద్రోహం మరోటి లేదు. బడుగు బలహీన వర్గాల వ్యతిరేక భావజాలం కలిగిన బీజేపీ, అట్టడుగువర్గాలకు సామాజిక న్యాయం లభించకుండా ఉండాలనే దుర్మార్గపు తలంపుతోనే జనాభా గణన చేపట్టడం లేదు.
1953లో ఏర్పాటు చేసిన కాలేల్కర్ కమిషన్ ఆ తర్వాత వచ్చిన అనేక కమిషన్లు బి.సి. వర్గాల జనగణన చేయాలని సిఫార్సు చేసినా ఏ ప్రభుత్వమూ ఆయా కమిషన్ల సిఫార్సులను పట్టించుకున్న పాపాన పోలేదు. పదే పదే తాను బి.సి.వర్గానికి చెందిన వాడినని గొప్పలు చెప్పుకునే ప్రధాని నరేంద్ర మోడీ సైతం నేడు బి.సి.ల జనగణన జరపడానికి ముందుకు రాకపోవడం బి.సి.వర్గాల పట్ల బీజేపీకి ఉన్న చిన్నచూపునకు నిదర్శనం.
తాజాగా రూపొందించిన ఖచ్చితమైన గణాంకాలతో మాత్రమే అభివృద్ధి, సంక్షేమంలో బి సి వర్గాలకు న్యాయమైన వాటా లభిస్తుంది. కానీ ఈ సామాజిక న్యాయ సూత్రాన్ని అమలు చేయడంలో దేశాన్ని పాలించిన అన్ని ప్రభుత్వాలూ విఫలమయ్యాయి
దేశ జనాభాలో యాభై శాతానికి పైబడి బీసీ వర్గాల సంఖ్య ఉన్నప్పటికీ డెబ్భై ఐదేళ్ళ స్వతంత్ర భారత చరిత్రలో వారికోసం ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేయలేదు. ఇది ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల అప్రజాస్వామిక వైఖరికి, అణచివేత ధోరణికి నిదర్శనం.

ఇంతకాలం వెనుకబాటుకు గురైన బీసీ వర్గాల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ రాజీలేని పోరాటం చేస్తున్నది. భవిష్యత్తులో దేశ పరిపాలనా విధానాన్ని నిర్ణయించే శక్తిగా బీఆర్ఎస్ ఎదిగి, శాస్త్రీయంగా జనగణనను జరపాలని, ముఖ్యంగా వెనుకబడిన వర్గాల జనగణన జరిపి, ఆ గణాంకాల ఆధారంగా వెనుకబడిన వర్గాలకు తగిన ప్రయోజనాలను అందించాలని ఈ సభ కోరుతున్నది. అదేవిధంగా కేంద్రంలో బీసీ సంక్షేమ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని ఆ దిశగా బీఆర్ఎస్ పురోగమించాలని ఈ ప్రతినిధుల సభ తీర్మానిస్తున్నది.

సర్వమత సమాదర భావానికి ఆలవాలంగా నిలిచిన దేశంలో నేడు విచ్ఛిన్నకర శక్తులు చెలరేగుతూ విద్వేషాగ్నుల్ని రగిలిస్తున్నాయి. దేశాన్ని నిత్య రావణకాష్టంగా మారుస్తున్నాయి. మతోన్మాద శక్తుల కుతంత్రాలతో భారతదేశానికి ప్రాణ వాయువుగా నిలిచిన “భిన్నత్వంలో ఏకత్వం” అనే జీవన సూత్రానికి ప్రమాదం ఏర్పడ్డది. భారత రాజ్యాంగం అన్ని మతాలకు, సంస్కృతులకు సమాన ప్రతిపత్తిని కల్పించింది. భారతదేశ పౌరులందరికీ సమాన హక్కులను, సమాన గౌరవాన్ని ప్రమాణం చేసింది. మన రాజ్యాంగ స్ఫూర్తి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది.
భారతీయ సంస్కృతికి, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా బయలుదేరిన మతతత్వ శక్తులు భారతీయ సమాజంలోని ఏకత్వాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయి. పరమత సహనానికి పేరుగాంచిన భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా అప్రతిష్ట పాలు చేస్తున్నాయి.
మతోన్మాద శక్తులు ఇదేవిధంగా పెట్రేగిపోతే దేశ అంతర్గత ఐక్యత విచ్ఛిన్నమై పోతుంది. దేశం సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పూర్తిగా పతనమై పోతుంది. ఈ కల్లోలం ఇట్లే ప్రబలితే, అశాంతి ఇదేవిధంగా చెలరేగితే, దేశానికి రావాల్సిన అంతర్జాతీయ పెట్టుబడులు రాకపోగా, వచ్చిన పెట్టుబడులు సైతం వెనక్కు మళ్ళిపోయే విపత్కర పరిస్థితి దాపురిస్తుంది. దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు దారులు మూసుకుపోతాయి. దేశ భవిష్యత్తు అంధకారంలోకి జారుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైపోయింది అభివృద్ధి ప్రాతిపదికన ఎన్నికలలో గెలిచే సత్తా ఎటూ లేదు కనుక, ప్రజల దృష్టిని మళ్లించటం కోసం, ఉద్రిక్తతలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే దుర్మార్గమైన ఎత్తుగడతో విభజన రాజకీయాలకు పాల్పడుతున్నది. మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు… ఈ విద్వేషకర వాతావరణం ఈ విధంగానే కొనసాగితే దేశం 100 సంవత్సరాలు వెనక్కు పోవడం ఖాయం. దేశం ఒకసారి తిరోగమనం బాట పడితే, తిరిగి కోలుకోవడానికి మరో 100 సంవత్సరాలు పట్టినా ఆశ్చర్యం లేదు.
మతోన్మాద శక్తుల దుష్పరిపాలన వల్ల అటువంటి దుర్గతి మన దేశానికి పట్టకుండా ఉండాలంటే దేశ యువత వెంటనే కార్యక్షేత్రంలోకి దిగాలని బిఆర్ఎస్ విస్తృతసభ పిలుపునిస్తున్నది. మానవ సంబంధాలను విచ్ఛిన్నం చేస్తున్న ఆటవిక, అనాగరిక, అరాచక సంస్కృతిని రూపుమాపేందుకు, ద్వేషం స్థానంలో ప్రేమను, అసహనం స్థానంలో సామరస్యాన్ని, అలజడి స్థానంలో ప్రశాంతతను ప్రతిష్ఠించేందుకు భారతీయ పౌరులందరూ ఏకం కావాలని బిఆర్ఎస్ విస్తృత సభ తీర్మానిస్తున్నది. మన తర్వాత స్వాతంత్ర్యాన్ని పొందిన మన పొరుగు దేశమే అయిన చైనా బలీయమైన ఆర్ధిక శక్తిగా అవతరించి, యావత్ ప్రపంచాన్నే శాసించగల స్థాయికి చేరుకుంది. అణుబాంబు విస్ఫోటనంలో అన్నీ కోల్పోయిన జపాన్ బూడిదలోంచి లేచిన ఫీనిక్స్ పక్షిలా అభివృద్ధిలో ఆకాశాన్నందుకున్నది. ఆటో మొబైల్ మొదలుకొని అనేక సాంకేతిక పరికరాల ఉత్పత్తిలో నేడు ప్రపంచంలోనే అగ్రగామిగా రూపుదాల్చింది. కనీసం మంచినీళ్లు కూడా లేని సింగపూర్ ప్రపంచం నివ్వెరపోయేలా అభివృద్ధి చెందింది.
అదేవిధంగా దక్షిణ కొరియా, మలేషియా తదితర దేశాల విజయగాథలెన్నో మన కళ్లముందే ఉన్నాయి. ఆ విజయ గాథల నుండి మనం నేర్చుకోవాల్సిన అంశాలెన్నో ఉన్నాయి. తీసుకోవాల్సిన స్ఫూర్తీ ఉన్నది. కానీ, మన దేశ పాలకులకు అదేం పట్టదు. మూస పద్ధతిలో గుడ్డెద్దు చేలో పడ్డట్టు దేశ పరిపాలన సాగుతున్నది. బీఆర్ఎస్ ఈ మూసను బద్దలు కొడుతూ నవీన దృక్పథంతో, నూతన చేతనతో దేశంలో గుణాత్మక పరివర్తనను సాధించే లక్ష్యాన్ని స్వీకరించింది. పార్టీల గెలుపే గెలుపు కాకూడదని, అది ప్రజల గెలుపు కావాలని బీఆర్ఎస్ నమ్ముతున్నది. బీఆర్ఎస్ కేవలం ఎన్నికల కోసమో, అధికారం కోసమో పుట్టిన పార్టీ కాదు. భారతదేశంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైన పరివర్తనను సాధించేందుకే బీఆర్ఎస్ పుట్టింది. ఈ దిశగా ప్రజల ఆలోచనా సరళిలోనూ, వారి జీవితాల్లోనూ గుణాత్మకమైన మార్పును సాధించే దిశగా బీఆర్ఎస్ అప్రతిహతంగా పురోగమించాలని ఈ సభ తీర్మానిస్తున్నది