AP, TS Elections: ఏపీ, తెలంగాణ‌ కు ఒకేసారి ఎన్నిక‌లు! `ముంద‌స్తు` కు జ‌గ‌న్‌?

ఏపీ, తెలంగాణ సీఎంలు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, కేసీఆర్ మ‌ధ్య బ‌ల‌మైన రాజ‌కీయ సంబంధం ఉంది. అన్న‌ద‌మ్ముల మాదిరిగా ఇచ్చిపుచ్చుకునే సాన్నిహిత్యం ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని తాజా రాజ‌కీయా ప‌రిణామాల క్ర‌మంలో ఇద్ద‌రూ ఒకేసారి ఎన్నిక‌ల‌కు వెళ్లే అవ‌కాశం ఉంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

  • Written By:
  • Updated On - November 16, 2022 / 01:28 PM IST

ఏపీ, తెలంగాణ సీఎంలు జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్ మ‌ధ్య బ‌ల‌మైన రాజ‌కీయ సంబంధం ఉంది. అన్న‌ద‌మ్ముల మాదిరిగా ఇచ్చిపుచ్చుకునే సాన్నిహిత్యం ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని తాజా రాజ‌కీయా ప‌రిణామాల క్ర‌మంలో ఇద్ద‌రూ ఒకేసారి ఎన్నిక‌ల‌కు వెళ్లే అవ‌కాశం ఉంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. అందుకే, వాళ్లిద్ద‌రూ వేర్వేరుగా సొంత‌ పార్టీ నేత‌ల‌తో స‌మావేశ‌మై ఎన్నిక‌లకు దిశానిర్దేశం చేశారు. ఇంకా 10 నెల‌లు మాత్ర‌మే ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఉంద‌ని కేసీఆర్ అంటే, కేవ‌లం 16 నెల‌లు ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఉంది క‌దా? అని ఉదాసీనంగా ఉండొద్ద‌ని జగన్ మోహన్ రెడ్డి విశాఖ నార్త్ లీడ‌ర్ల స‌మీక్ష స‌మావేశంలో చెప్ప‌డం హాట్ టాపిక్ గా మారింది.

ముంద‌స్తుకు ఛాన్స్ లేద‌ని కేసీఆర్ స్ప‌ష్టత‌ను ఇచ్చారు. షెడ్యూల్ ప్ర‌కారం ఎన్నిక‌ల‌కు ఉంటాయ‌ని తేల్చేశారు. అంతేకాదు, పాత వాళ్ల‌కు మ‌ళ్లీ టిక్కెట్లు ఇస్తాన‌ని హామీ ఇస్తూనే ప‌రోక్ష వార్నింగ్ ఇచ్చారు. అంద‌రి జాత‌కాలు త‌న వ‌ద్ద ఉన్నాయ‌ని బెదిరింపు ధోర‌ణిలో కేసీఆర్ సంకేతాలు ఇచ్చార‌ని వినికిడి. ఇక ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖ నార్త్ నియోజకవర్గం వైసీపీ కార్యకర్తలతో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వ‌హించి, ఎన్నిక‌ల‌కు సిద్ధం కావాల‌ని పిలుపునిచ్చారు. ఇంకా సమయం ఉంది కదా అని ఉదాసీనంగా ఉండొద్ద‌ని ప‌రోక్షంగా ముంద‌స్తుకు సంకేతాలు ఇచ్చారు. అంటే జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్ క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డానికి సిద్ధం అవుతున్న‌ట్టు వాళ్ల క‌ద‌లిక‌లు, మాట‌లు ఉన్నాయ‌ని ఎవ‌రైనా గ్ర‌హించొచ్చు.

Also Read:  CBN Kurnool: క‌ర్నూలు టీడీపీ దూకుడు, చంద్ర‌బాబు జోష్‌!

తిరిగి అధికారంలోకి రావడానికి కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డి స‌ర్వ‌శ‌క్తులు ఇప్ప‌టి నుంచే ఒడ్డుతున్నారు. ఇటీవ‌ల దాకా బీజేపీకి అన్ని ర‌కాలుగా ఇద్ద‌రూ మ‌ద్ధ‌తు ఇచ్చారు. రాజ‌కీయాల‌కు అతీతంగా మోడీతో అనుబంధం ఉంద‌ని ఏపీ సీఎం చెబుతున్నారు. త‌ద్భిన్నంగా మోడీని వ్య‌తిరేకిస్తూ కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. అదంతా డ్రామాలంటూ కాంగ్రెస్ ప‌దేప‌దే చెబుతోంది. వాస్త‌వం ఏమైన‌ప్ప‌టికీ జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్ మ‌ధ్య మాత్రం బ‌ల‌మైన సంబంధాలు ఉన్నాయ‌ని అంద‌రికీ తెలిసిందే. అందుకే, జగన్ మోహన్ రెడ్డి ప్ర‌భుత్వాన్ని కూల్చ‌డానికి బీజేపీ ప్ర‌య‌త్నం చేసింద‌ని ప‌లు వేదిక‌ల‌పై కేసీఆర్ చెబుతూ స‌రికొత్త రాజ‌కీయానికి తెర‌దీశారు. అంతేకాదు, కుమార్తె క‌విత మీద కూడా బీజేపీ ఆప‌రేష‌న్ చేసింద‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. అంటే, ఇద్ద‌రూ క‌లిసి బీజేపీని ఎదుర్కోవాల‌ని వైసీపీని కూడా ఆయ‌న సిద్ధం చేస్తున్నార‌న్న‌మాట‌.

తెలంగాణ వ్యాప్తంగా సుమారు 15లక్ష‌ల మంది ఏపీ ఓట‌ర్లు ఉన్న‌ట్టు ఒక అంచ‌నా. వాళ్లంద‌రూ ఏదో ఒక ఉద్యోగం, ఉపాథి కోసం తెలంగాణ‌లో సెటిలై ఓట‌ర్లుగా ఉన్నారు. ప్ర‌స్తుతం సెటిల‌ర్లు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. ఆ విష‌యం గ్రేట‌ర్ హైద‌రాబాద్‌, ఎమ్మెల్సీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా బ‌య‌ట‌ప‌డింది. పైగా సెటిల‌ర్ల ఓట్లు ఎక్కువ‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌కు భారీ మోజార్టీలు వ‌చ్చాయి. అందుకే, వాళ్ల‌ను మ‌రింత అనుకూలంగా మ‌లుచుకునే ప్ర‌య‌త్నాల‌ను గ‌త కొంత కాలంగా కేసీఆర్ స‌ర్కార్ చేస్తోంది. ఇక మ‌రో లాజిక్ ఏంటంటే, ఏపీ సెటిల‌ర్లు జగన్ మోహన్ రెడ్డి ప్ర‌భుత్వం మీద వ్య‌తిరేకంగా ఉన్నార‌ట. ప‌న్నుల రూపంలో క‌ట్టిన సొమ్మును నిరుపేద‌ల‌కు పంచేస్తున్నాడ‌న్న ఆక్రోశం కూడా టాక్స్ పేయ‌ర్స్ లో ఉంద‌ని ఇటీవ‌ల స‌ర్వేల్లోని సారాంశం. అభివృద్ధి ఏపీలో ఆగిపోయింద‌ని సెటిల‌ర్ల లో బ‌లంగా ఉంద‌ని స‌ర్వేల ద్వారా గ్ర‌హించిన అంశ‌మ‌ట‌. దానికి ప‌రిష్కారంగా ఒకేసారి ఎన్నిక‌ల‌కు వెళ్లే దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

Also Read:  Supreme Court: ఎమ్మెల్యే, ఎంపీల కేసులపై `సుప్రీం` ఆరా

రెండు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నిక‌ల‌ను నిర్వ‌హిస్తే, సెటిల‌ర్లు తెలంగాణ‌ లోనే నిలిచిపోయే అవ‌కాశం ఉంది. ఫ‌లితంగా టీఆర్ఎస్ పార్టీకి లాభం చేకూరుతుంద‌ని ఒక అంచ‌నా. అదే స‌మ‌యంలో ఇత‌ర ప్రాంతాల్లో సెటిలైన ఏపీ ఓట‌ర్లు పోలింగ్ రోజున ఆ రాష్ట్రానికి వెళ్ల‌క‌పోతే జగన్ మోహన్ రెడ్డికి క‌లిసొస్తుంద‌ని భావిస్తున్నారు. మొత్తం మీద ఇత‌ర ప్రాంతాల్లో ఉన్న సుమారు 15 ల‌క్ష‌ల ఏపీ ఓట‌ర్ల నాడిని అనుస‌రించి ఏపీ, తెలంగాణ ఎన్నిక‌ల‌ను ఒకేసారి నిర్వ‌హించేలా ఇద్ద‌రు సీఎంలు సిద్ధం అవుతున్నార‌ని టాక్‌. ఆ విధంగా జ‌రిగాలంటే, ముంద‌స్తుకు జగన్ మోహన్ రెడ్డి సిద్ధం కావాల్సి ఉంటుంది. అలాంటి సంకేతాలు గ‌తంలో ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌క్రిష్ణా రెడ్డి ఇవ్వ‌గా, తాజాగా విశాఖ నార్త్ లీడ‌ర్ల స‌మీక్ష‌లో జగన్ మోహన్ రెడ్డి పీల‌ర్స్ వ‌దిలారు. ఇవ‌న్నీ గ‌మ‌నిస్తే , వ‌చ్చే ఏడాది ఏపీ, తెలంగాణ రాష్ట్రాల‌కు ఒకేసారి ఎన్నిక‌లు ఒకేసారి ఉంటాయ‌ని భావించ‌డంలో త‌ప్పులేదేమో.!