Super App: “టాటా న్యూ” యాప్ గురించి తెలుసా?

టాటా నుంచి మరో లేటెస్టు సర్వీసు వచ్చేసింది. టాటా గ్రూప్ ఆల్ ఇన్ వన్ సూపర్ యాప్ ను విడుదల చేసింది.

  • Written By:
  • Updated On - April 8, 2022 / 11:44 AM IST

టాటా నుంచి మరో లేటెస్టు సర్వీసు వచ్చేసింది. టాటా గ్రూప్ ఆల్ ఇన్ వన్ సూపర్ యాప్ ను విడుదల చేసింది. టాటా న్యూ (Tata Neu)పేరుతో ఈ ఫ్లాట్ ఫాంను పరిచయం చేసింది. టాటా గ్రూప్ ఛైర్ పర్సన్ ఎన్ చంద్రశేఖరన్ ఈ ఫ్లాట్ ఫాంను ఆవిష్కరించారు. ఇప్పటివరకు టాటా గ్రూప్ ఉద్యోగులకు, ఇన్విటేషన్ ఉన్నవారికి మాత్రమే ఈ యాప్ అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు యూజర్లందరికీ అందుబాటులోకి వచ్చింది. ఇవాళ కొత్త రోజు. టాటా డిజిటల్ టాటా ఫ్యామిలీలో అతి పిన్న వయస్కుడు టాటా న్యూ మీ ముందుకు వచ్చేసిందంటూ చంద్రశేఖరన్ ఆవిష్కరణ సందర్భంగా అన్నారు.

ఇప్పటికే ఎన్నో బ్రాండ్స్ ను భారతీయులకు పరిచయం చేసిన టాటా గ్రూప్ ఇప్పుడు టాటా న్యూ యాప్ ద్వారా కూడా సేవలను అందించేందుకు ముందుకు వచ్చింది. టాటా సూపర్ యాప్ రూపకల్పనకు 2020లోనే అడుగులు పడ్డాయి. ఏడాదిన్నర తర్వాత ఈ యాప్ ప్రపంచానికి పరిచయం చేసింది. భారతీయుల జీవితాలను సులభతరం చేయడమే లక్ష్యంగా ఈ యాప్ ను తీసుకొచ్చినట్లు టాటా గ్రూప్ అంటోంది. ఇక ఈ యాప్ ప్రత్యేకతల గురించి చూసినట్లయితే…యాప్ చూడటానికి బ్లాక్ బ్యాక్ గ్రౌండ్ తో ప్రీమియం లుక్ కనిపిస్తోంది. ఇందులో న్యూ కాయిన్స్ పేరుతో రివార్డ్ సెక్షన్ కూడా ఉంది. వినియోగదారులు న్యూ కాయిన్స్ ను ఈ యాప్ తో పాటు ఫిజికల్ స్టోర్స్ లో కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. టాటా న్యూ యూజర్లు టాటా క్లిక్, బిగ్ బాస్కెట్, ఎయిర్ ఏసియా ఇండియా, క్రోమా లాంటి టాటా బ్రాండ్స్ ను ఈ యాప్ ద్వారానే యాక్సెస్ చేసుకోవచ్చు.

ఈ యాప్ లో గ్రాసరీస్, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ డెలివరీ, హోటల్ బుకింగ్స్, ప్లెట్ బుకింగ్స్ వంటి సేవలన్నీ లభిస్తాయి. వేరువేరు సేవలకు వేర్వేరు యాప్స్ డౌన్ లోడ్ చేయాల్సిన అవసరం లేకుండా ఒకే యాప్ లోనే అన్ని సేవలను పొందవచ్చు. టాటా పే ద్వారా పేమెంట్స్ కూడా చేయవచ్చు. మొబైల్ రీఛార్జ్ నుంచి డీటీహెచ్ సర్వీసు వరకు అన్ని రకాల పేమెంట్స్ చేయొచ్చు. ఇక ఈ యాప్ లో బయ్ నౌ పే లేటర్, డిజిటల్ గోల్డ్, ఇన్స్యూరెన్స్, పర్సనల్ లోన్స్ వంటి సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. బిగ్ బాస్కెట్ నుంచి సరుకుల్ని, 1 ఎంజి నుంచి మందుల్ని తెప్పించుకోవచ్చు. టాటా న్యూ యాప్ గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ లో అందుబాటులో ఉంది.