Male Contraceptive : కుటుంబ నియంత్రణ చర్యలలో భాగంగా ఇప్పటివరకు పురుషులకు సంతానం కలగకుండా నిరోధించేందుకు వాసెక్టమీ సర్జరీలు చేసేవారు. ఇంకొందరు పురుషులు సర్జరీ చేయించుకోలేక.. కండోమ్స్ ను వాడేవారు. ఇకపై వాటి అవసరం ఉండదు. ఎందుకంటే.. ప్రపంచంలోనే తొలిసారిగా మన దేశానికి చెందిన భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) పురుషులపై సంతాన నిరోధకంగా పనిచేసే ఇంజెక్షన్ ను డెవలప్ చేసింది. దాని పేరు.. ‘రివర్సిబుల్ ఇన్ హైబిషన్ ఆఫ్ స్పెర్మ్ అండర్ గైడెన్స్ (ఆర్ఐఎస్యూజీ)’. దాదాపు 303 మందితో ఢిల్లీ, ఉధంపుర్, లుధియానా, జైపుర్, ఖరగ్పుర్లలో నిర్వహించిన మూడోవిడత క్లినికల్ ట్రయల్స్ లో ఆ ఇంజెక్షన్ సేఫ్ అని తేలింది. అంతేకాదు.. గర్భనివారణలో ఈ ఇంజెక్షన్ 99.02% సమర్థంగా పనిచేస్తోందని అధ్యయనంలో వెల్లడైంది. కుటుంబ నియంత్రణ చికిత్స కోసం ఆస్పత్రులకు వచ్చిన వారిపైనే ఈ ట్రయల్స్ చేశామని ఐసీఎంఆర్ వర్గాలు వెల్లడించాయి.
ఒకసారి తీసుకుంటే..
ఈ ఇంజెక్షన్ ను శరీర భాగానికి సాధారణంగా ఇంజెక్ట్ చేస్తే సరిపోతుందని తెలిపారు. 60 మిల్లీగ్రాముల మోతాదులో ఈ ఇంజెక్షన్ ఇస్తే వీర్యంలోని శుక్రకణాలు 97.3 శాతం మేర తగ్గిపోతాయన్నారు. దీన్ని ఒకసారి తీసుకుంటే 13 ఏళ్ల పాటు సంతానం కలగదని చెప్పారు. ఆ తర్వాత మళ్లీ సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పొందుతారని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు వివరించారు. దీనివల్ల ఎలాంటి సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని స్పష్టం చేశారు. ఈమేరకు వివరాలతో కూడిన స్టడీ రిపోర్ట్ అంతర్జాతీయ జర్నల్ ‘ఆండ్రాలజీ’లో(Male Contraceptive) పబ్లిష్ అయింది.
We’re now on WhatsApp. Click to Join.
గర్భనిరోధక మాత్రలకు ముందు ఏం చేసేవారు?
1960వ దశకంలో మహిళల కోసం గర్భనిరోధక మాత్రలు భారీ స్థాయిలో తయారైనప్పుడు, గర్భం వద్దు అనే నిర్ణయం మహిళల చేతుల్లోకి వచ్చింది. తమ సెక్సువల్ పార్ట్నర్ కు చెప్పకుండా కూడా మహిళలు ఈ పనిని చేయగలిగేవారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మందికి పైగా మహిళలు గర్భనిరోధక మాత్రలు ఉపయోగిస్తున్నారు. యూరప్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌లో వీటిని అత్యధికంగా వినియోగిస్తున్నారు. ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఉత్తర అమెరికాలో గర్భం రాకుండా ఉపయోగించే వాటిలో గర్భనిరోధక మాత్రలు రెండో స్థానంలో ఉన్నాయి. ఆసియాలో అవి మూడో స్థానంలో ఉన్నాయి.