WHO: ఆల్కహాల్,తీపిపానీయాల వాడకం తగ్గించడం కోసం సరికొత్త సిఫార్సును తీసుకువచ్చిన డబ్ల్యూహెచ్‌వో?

ప్రస్తుత రోజుల్లో మనుషుల జీవనశైలితో పాటు ఆహారపు అలవాట్లు కూడా పూర్తిగా మారిపోయాయి. దీంతో మనుషులు అతి చిన్న వయసులోనే లేనిపోని సమస్యలను

  • Written By:
  • Publish Date - December 6, 2023 / 03:31 PM IST

ప్రస్తుత రోజుల్లో మనుషుల జీవనశైలితో పాటు ఆహారపు అలవాట్లు కూడా పూర్తిగా మారిపోయాయి. దీంతో మనుషులు అతి చిన్న వయసులోనే లేనిపోని సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. చిన్న వయసుకే రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా మద్యపానం తీపి పానీయాలు కారణంగా చాలామంది అనేక రకాల రోగాల బారిన పడుతున్నారు. దీంతో ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది మరణిస్తున్నారు. అయితే ఈ మృత్యువాత సంఖ్యను తగ్గించడం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు స్వచ్ఛంద సంస్థలు మానవాళి ఆరోగ్య సంరక్షణకు ఏళ్లుగా ఎంతో కృషి చేస్తున్నాయి.

అయినప్పటికీ ఫలితాలు మాత్రం రావడం లేదు. దీంతో వాటిని అరికట్టడం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌వో భిన్న మార్గాలను అన్వేషిస్తోంది. అందులో భాగంగానే ఆల్కహాల్ తీపి పానీయాల వాడకంపై ఎక్సైజ్ పన్నును మరింత ఎక్కువ విధించాలని తాజాగా కొత్త సిఫార్సులు చేసింది డబ్ల్యూహెచ్‌వో. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు ఆల్కహాల్‌, షుగర్‌ బేవరేజెస్‌పై తక్కువ సుంకాన్ని విధిస్తున్నాయని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. పలు దేశాల్లో వీటిపై విధిస్తున్న పన్నును పరిశీలించగా చాలా దేశాల్లో తక్కువ విధిస్తున్నారని తమ పరిశోధనలో తేలిందని తెలిపింది. ఆరోగ్య మానవాళిని పెంచేందుకు ఆల్కహాల్‌, తీపిపానియాలపై ఎక్కువ పన్ను వేయడం మెరుగైన ప్రభావం చూపుతుందని పేర్కొంది డబ్ల్యూహెచ్‌వో.

ఇందుకు సంబంధించి తాజాగా డబ్ల్యూహెచ్‌వో ఆల్కహాల్‌ ట్యాక్స్‌ పాలసీ మాన్యువల్‌ను విడుదల చేసింది. అధిక పన్నుల వల్ల లిక్కర్‌ వాడకాన్ని అరికట్టవచ్చని, తద్వారా ఆసుపత్రుల్లో చేరికలు, మరణాలు, ట్రాఫిక్‌ ఉల్లంఘనలు, నేరాలను అదుపులో పెట్టవచ్చని పేర్కొంది. మద్యం విపరీతంగా తాగే అలవాటు ఉన్నవారు మార్కెట్‌లో తక్కువ ధరకు దొరికే దానినే ఎంచుకుంటారని ఒక పరిశోధనలో తేలినట్లు పేర్కొంది. మద్యం వాడకం వల్ల ఏటా ప్రపంచ వ్యాప్తంగా 26 లక్షల మంది, అనారోగ్య ఆహార పదార్థాల వల్ల ఏటా 8 లక్షల మంది చనిపోతున్నారని తెలిపింది. ఆల్కహాల్‌, తీపిపానియాలపై ఇప్పుడు విధిస్తున్న సుంకానికి అధనంగా ఎక్కువ మొత్తంలో పన్ను వేయడం వల్ల గణనీయసంఖ్యలో మరణాలను ఆపవచ్చని పేర్కొంది. ఇలా చేయడం వల్ల హానికర ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించడమే కాకుండా ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడే ఉత్పత్తులను పెంచేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. తీపిపానియాలపై ప్రపంచవ్యాప్తంగా 108 దేశాల్లో పన్ను ఉన్నప్పటికీ ఆ ఉత్పత్తిలో సగటున పన్ను 6.6 శాతం ఉంటున్నట్లు తెలిపింది. అనారోగ్యానికి గురిచేసే ఉత్పత్తులపై టాక్స్‌ విధించడం వల్ల అరోగ్యకర జనాభా పెరుగుతుంది.