Israel Deal : ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధాన్ని కొన్ని రోజులు ఆపే దిశగా కొన్ని గంటల్లో కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇజ్రాయెల్, హమాస్‌లతో చర్చలు జరిపిన ఖతర్, అమెరికా, ఫ్రాన్స్ దేశాల అధికార ప్రతినిధులు దీనిపై కొంత పురోగతిని సాధించాయి. ఐదు రోజుల తాత్కాలిక యుద్ధ విరామానికి ఇజ్రాయెల్ ఓకే చెబితే.. తమ వద్ద బందీలుగా ఉన్న వారిలో దాదాపు 60 మంది పిల్లలు, మహిళలను విడుదల చేసేందుకు సిద్ధమని హమాస్ వెల్లడించిందని సమాచారం. ఈజిప్టు నుంచి గాజాలోకి ఇంధనం, మానవతా సహాయం వచ్చేందుకు అనుమతించాలని హమాస్ షరతు విధించింది. హమాస్ వద్ద ప్రస్తుతం దాపు 239 మంది బందీలు ఉన్నారు. బందీలను పెద్దసంఖ్యలో విడుదల చేయాలని, కనీసం 100 మందిని రిలీజ్ చేయాలని హమాస్‌కు ఇజ్రాయెల్ స్పష్టం చేసిందని తెలిసింది. గత రెండు వారాలుగా ఖతర్ రాజధాని దోహా వేదికగా ఇజ్రాయెల్, హమాస్ ప్రతినిధులు జరుపుతున్న శాంతి చర్చలకు మధ్యవర్తులుగా ఖతర్, అమెరికా, ఫ్రాన్స్ వ్యవహరించాయని తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.
గాజాలో పౌరుల మరణాల సంఖ్య పెరగడంతో హమాస్ చెరలోని యూదు బందీల భవితవ్యంపై వారి కుటుంబీకుల్లో ఆందోళన పెరిగింది. వారు నెతన్యాహూ కార్యాలయం ఎదుటే పెద్దఎత్తున నిరసనలకు దిగుతున్నారు. తమ వాళ్లను హమాస్ నుంచి విడిపించి, దేశానికిి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో ఒత్తిడిలో ఉన్న నెతన్యాహు.. ఈ డీల్‌కు ఓకే చెబుతారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 100కుపైగా దేశాలు కాల్పుల విరమణ పాటించాలని డిమాండ్ చేయడంతో ఒత్తిడికి లోనైన అమెరికా.. తన మిత్రదేశం ఇజ్రాయెల్‌ను అందుకు ఒప్పించే దిశగా అడుగులు(Israel Deal) వేస్తోంది.