Supreme Court – Gay Marriages : సేమ్ సెక్స్ మ్యారేజెస్ కు చట్టబద్ధత కల్పించాలంటూ దాఖలైన 21 పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పును వెలువరించింది. స్వలింగ సంపర్కుల కోసం ప్రత్యేక వివాహ చట్టాన్ని తీసుకురాకపోతే.. మనం మళ్లీ స్వాతంత్ర్యానికి పూర్వపు స్థితికి వెళ్లినట్లేనని దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అయితే దీనిపై పార్లమెంటే నిర్ణయం తీసుకోవాలని, అది న్యాయ సమీక్షకు లోబడి ఉండాలని వెల్లడించింది. కోర్టులు చట్టాలను రూపొందించలేవని, కేవలం చట్టాలు సమర్థంగా అమలయ్యేలా సూచనలు చేస్తాయని తేల్చి చెప్పింది. 21 పిటిషన్లను విచారించిన సుప్రీం, ఈ అంశంపై 4 వేర్వేరు తీర్పులను ఇచ్చింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. ఈ పిటిషన్లపై ఇంకా తుది తీర్పు వెలువడలేదు. ప్రస్తుతం రాజ్యాంగ ధర్మాసనంలోని మిగిలిన న్యాయమూర్తులు తమ తీర్పులను వెల్లడిస్తున్నారు. తీర్పు ఇచ్చే క్రమంలో సీజేఐ చంద్రచూడ్ (Supreme Court – Gay Marriages) కీలక వ్యాఖ్యలు చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
సీజేఐ డీవై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు ఇవీ..
- దేశంలో ప్రతి పౌరుడికి పెళ్లి చేసుకునే హక్కు ఉంది. గేస్, లెస్బియన్లు, ట్రాన్స్ జెండర్లు, బై సెక్సువల్ వర్గాల వారికి కూడా ఇది వర్తిస్తుంది. అయితే ఈ పెళ్లిళ్లను చట్టబద్ధంగా గుర్తించాలా ? వద్దా ? అనే దానిపై తుది నిర్ణయాన్ని పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు తీసుకుంటాయి.
- పెళ్లి చేసుకునే సేమ్ సెక్స్ దంపతులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత, వారి హక్కులను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్రాలపై ఉంటుంది.
- పెళ్లి చేసుకోకుండా సంబంధం నెరిపే దంపతులు, సేమ్ సెక్స్ దంపతులు కూడా పిల్లలను దత్తత తీసుకోవచ్చు.
- సేమ్ సెక్స్ మ్యారేజెస్ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కేబినెట్ సెక్రటరీ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. సేమ్ సెక్స్ వాళ్లు పెళ్లి చేసుకుంటే వారికి రేషన్ కార్డుల మంజూరు, పెన్షన్ కేటాయింపు, గ్రాట్యుటీ మంజూరు, వారసత్వ పరంపర కొనసాగింపు, బ్యాంకుల్లో జాయింట్ ఖాతాలను తెరవడం వంటి అంశాలలో ఎలాంటి నిబంధనలు ఉండాలనే దానిపై స్టడీ చేయాలి. వారికి కూడా ఇతర దంపతుల లాగే ప్రభుత్వ ప్రయోజనాలు దక్కేందుకు మార్గం సుగమం చేయాలి.
- స్వలింగ సంపర్కం అనేది కేవలం పట్టణాలు లేదా సమాజంలో ఉన్నత వర్గాలకే పరిమితమైనదనే అభిప్రాయాన్ని వీడాలి.
- లైంగిక ధోరణి ఆధారంగా వ్యక్తుల పట్ల వివక్ష చూపకూడదు.