Russia Train Accident : ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన తొమ్మిది బోగీలు

ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఒక ప్యాసింజర్ రైలులోని తొమ్మిది బోగీలు పట్టాలు తప్పిన ఈ ఘటనలో 70 మందికి పైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. 

  • Written By:
  • Updated On - June 27, 2024 / 09:26 AM IST

Russia Train Accident : ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఒక ప్యాసింజర్ రైలులోని తొమ్మిది బోగీలు పట్టాలు తప్పిన ఈ ఘటనలో 70 మందికి పైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.  ఈ ప్రమాద ఘటన రష్యాలోని ఈశాన్య భాగంలో ఉండే కోమి ప్రాంతంలో చోటుచేసుకుంది. కోమి ప్రాంతంలోని వోర్కుటా నగరం నుంచి నల్ల సముద్రపు నొవోరోసిస్క్ ఓడరేవు నగరం వైపుగా రైలు వెళ్తుండగా ఇంటా నగరం సమీపంలో రైలు పట్టాలు తప్పింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్లే రైలు పట్టాలు తప్పి ఉండొచ్చని భావిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join

రష్యా కాలమానం ప్రకారం.. బుధవారం సాయంత్రం 6.12 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది.  ప్రమాదానికి గురైన ప్యాసింజర్ రైలులోని మొత్తం 14 కోచ్‌లలో 232 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. అత్యవసర సేవల విభాగం అధికారులు, సహాయక బృందాలు సంఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నాయి. గాయపడిన ప్రయాణికులను  ఆస్పత్రులకు తరలించారు. ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. బాధితుల వివరాలను రైల్వే అధికారులు(Russia Train Accident) సేకరిస్తున్నారు. గాయపడివారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా  ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ ఘటనలో ఎవరూ మృతి చెందినట్లు సమాచారం లేదు.

Also Read :LK Advani : ఎల్‌కే అద్వానీ ఎవరు ? బీజేపీ దిగ్గజ నేత కెరీర్ గ్రాఫ్

రైలు పట్టాలు తప్పిన ఘటనపై దర్యాప్తు చేసేందుకు రైల్వే జనరల్ డైరెక్టర్ ఒలేగ్ బెలోజెరోవ్ నేతృత్వంలో టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. ఘటనా స్థలానికి రెండు రికవరీ రైళ్లను పంపించారు. నార్త్-వెస్ట్రన్ ట్రాన్స్‌పోర్ట్ ప్రాసిక్యూటర్ కార్యాలయం పట్టాలు తప్పిన ఘటనపై క్రిమినల్ దర్యాప్తు ప్రారంభించింది.