Site icon HashtagU Telugu

Rafah : రఫాపై ఇజ్రాయెల్ ఎటాక్.. 35 మంది సామాన్యులు మృతి

Rafah Strike

Rafah Strike

Rafah : గాజాలోని రఫా నగరంపై దాడి చేయొద్దని అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) వార్నింగ్ ఇచ్చినా ఇజ్రాయెల్ పెడచెవిన పెట్టింది. మరోసారి రఫా నగరంపై భీకర వైమానిక దాడికి పాల్పడింది. ఈ బాంబు దాడిలో రఫాలోని దాదాపు 35 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. సామాన్య ప్రజలు బిక్కుబిక్కుమంటూ తలదాచుకుంటున్న గుడారాలపైకి ఇజ్రాయెల్ ఆర్మీ అమానవీయంగా బాంబులను జారవిడవడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ దాడిలో గుడారాలన్నీ కాలిపోగా.. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో ఎంతోమంది సజీవ దహనమయ్యారు.  చనిపోయిన వారిలో పిల్లలు, మహిళలు కూడా ఉన్నారు. చనిపోయిన వారి కుటుంబాల రోదనలతో ఘటనా స్థలం మార్మోగింది. దాడి జరిగిన ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ప్రజలు ఉండడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్  ఉందని చెబుతున్నారు. తమ ప్రాంతాలపైకి హమాస్ ఆదివారం ఉదయం రాకెట్లు సంధించినందుకు ప్రతీకారంగానే రఫాపై(Rafah)  ఈ దాడి చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. రఫా నగరంలో ఏ జరుగుతోందో తమకు తెలియదని స్పష్టం చేసింది.

We’re now on WhatsApp. Click to Join

ఇజ్రాయెల్‌కు ఈజిప్టు షాక్

పాలస్తీనాకు చెందిన రఫా నగరం అనేది ఈజిప్టు బార్డర్‌లో ఉంటుంది. తమ దేశ బార్డర్‌లో ఇజ్రాయెల్ మిలిటరీ ఆపరేషన్ చేస్తుండటంపై ఈజిప్టు గుర్రుగా ఉంది. రఫా బార్డర్ వద్ద ఉండే సరిహద్దు గేటును రఫా క్రాసింగ్ అంటారు. రఫా క్రాసింగ్‌లో గాజా వైపు ఉండే భాగం ముందు నుంచే ఇజ్రాయెల్ ఆర్మీ అదుపులో ఉంటుంది. గాజాలోకి ఆయుధాలు, మందుగుండు వెళ్లకుండా చెక్ చేసేందుకు ఈ చెక్ పోస్టును ఇజ్రాయెల్ వాడుకుంటుంది. యుద్ధ సమయాల్లో గాజాలోకి నిత్యావసరాల వెళ్లకుండా ఇజ్రాయెల్ ఆర్మీ అడ్డుకునేది కూడా ఈ చెక్‌పోస్టు దగ్గరే. గాజా వైపు ఉన్న రఫా క్రాసింగ్‌ను పాలస్తీనా ప్రజలకు అప్పగించే వరకు తమ వైపు ఉన్న రఫా క్రాసింగ్‌ను తెరిచేది లేదని ఈజిప్టు ప్రకటించింది. ఇది ఇజ్రాయెల్‌కు షాకిచ్చే విషయమే. ఈక్రమంలో ఇజ్రాయెల్ పెద్దన్న అమెరికా రంగంలోకి దిగి ఈజిప్టుతో చర్చలు జరిపింది. దీంతో ఇజ్రాయెల్‌లోకి వెళ్లాల్సిన సహాయక వాహనాలను రఫా క్రాసింగ్‌ నుంచి కాకుండా, దక్షిణ ఇజ్రాయెల్‌లోని కెరెమ్ షాలోమ్ సరిహద్దు ద్వారా తీసుకళ్లేందుకు ఈజిప్టు అనుమతి ఇచ్చింది.

Also Read : Remal Cyclone : బెంగాల్‌లో తీరం దాటిన రెమాల్ తుఫాను.. ఏమైందంటే..