Poisoned In Jail : పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ‘‘ఇస్లామాబాద్‌లోని బానీ గలా ప్రాంతంలో ఉన్న నా ఇంటిని సబ్ జైలుగా మార్చేసి అందులో నా భార్య బుష్రా బీబీని నిర్బంధించారు. అక్కడ నా భార్యకు ఏదైనా జరిగితే ఆర్మీ చీఫే బాధ్యత వహించాలి’’ అని ఆయన వెల్లడించారు. తన భార్యకు ఆహారంలో విషం కలిపి ఇచ్చారని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ఆ విషం ప్రభావం బుష్రా బీబీ నాలుక, చర్మంపై స్పష్టంగా కనిపించిందని చెప్పారు. ప్రభుత్వ ఖజానాలోని విదేశీ కానుకలను అక్రమంగా అమ్ముకున్న కేసులో విచారణ నిమిత్తం ఇమ్రాన్ ఖాన్‌ను ఇస్లామాబాద్ హైకోర్టు ఎదుట ప్రవేశపెట్టగా.. జడ్జి నాసిర్ జావేద్ రాణాకు ఈవివరాలను ఇమ్రాన్ తెలియజేశారు. తన భార్యకు ప్రాణాపాయం ఉందని, ఆమెకు తగిన రక్షణ కల్పించాలని కోరారు. బుష్రా బీబీకి జరిగిన ఫుడ్ పాయిజనింగ్‌పై గతంలో రిపోర్టు ఇచ్చిన వైద్యులపై తనకు నమ్మకం లేదని.. ఇస్లామాబాద్‌లోని షౌకత్ ఖానుమ్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ అసిమ్‌తో ఆమెకు వైద్య పరీక్షలు(Poisoned In Jail) చేయించాలని కోర్టును కోరారు.
We’re now on WhatsApp. Click to Join
ఇదే కేసులో విచారణ నిమిత్తం కోర్టుకు వచ్చిన ఇమ్రాన్ భార్య బుష్రా బీబీ.. మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలు చెప్పారు. ‘‘నేను తినే భోజనంలో టాయిలెట్ క్లీనర్‌ను కలిపారు. అందుకే ఆ ఫుడ్‌ను తిన్నాక నా కళ్ళు వాచాయి. ఛాతీ నొప్పి, కడుపు నొప్పితో బాధపడ్డాను. ఆ ఫుడ్‌ను తిన్నప్పుడు నోరంతా చేదుగా అయిపోయింది’’ అని ఆమె తెలిపారు. ఫుడ్‌లో టాయిలెట్ క్లీనర్‌ను కలిపారనే విషయాన్ని ఎవరు చెప్పారనేది వెల్లడించేందుకు బుష్రా నిరాకరించారు. బని గాలా సబ్ జైలులో కనీసం ఇంటి కిటికీలు తెరించేందుకు కూడా తనకు అనుమతి ఇవ్వడం లేదని కోర్టుకు బుష్రా తెలిపారు.
Also Read : Aryan Khan: లారిసా బొనేసి.. ఆర్యన్ ఖాన్ బ్రెజీలియన్ గర్ల్ ఫ్రెండ్.. ఎవరామె ?
ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్న టైంలో ప్రభుత్వ ఖజానాలోని విదేశీ కానుకలను అక్రమంగా అమ్మేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించిన కేసులో ఇద్దరికి కూడా కోర్టు చెరో 14 సంవత్సరాల జైలుశిక్ష విధించింది. ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైలులో ఉండగా, బుష్రాను ఇస్లామాబాద్‌లోని ఆమె నివాసం బాని గలాలో గృహనిర్బంధంలో ఉంచారు.