700 Killed – 24 Hours : గత 24 గంటల వ్యవధిలో(మంగళవారం) గాజాపై ఇజ్రాయెల్ వాయుసేన విరుచుకుపడింది. ఆ దేశ ఆర్మీ జరిపిన వైమానిక దాడుల్లో దాదాపు 700 మందికి పైగా అమాయక పాలస్తీనా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈవివరాలను పాలస్తీనా ఆరోగ్యశాఖ వెల్లడించింది. అంతకుముందు రోజు(సోమవారం) కూడా మరో 400 మంది గాజా పౌరులను ఇజ్రాయెల్ ఆర్మీ హతమార్చింది. దీంతో అక్టోబరు 7 నుంచి ఇప్పటివరకు ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన వైమానిక దాడుల్లో చనిపోయిన గాజా పౌరుల సంఖ్య 7వేలు దాటింది. వీరిలో దాదాపు 3వేల మంది పిల్లలే ఉన్నారని సమాచారం. తాజా మంగళవారం అర్ధరాత్రి నిర్వహించిన వైమానిక దాడుల్లో ముగ్గురు హమాస్ డిప్యూటీ కమాండర్లను హతమార్చామని ఇజ్రాయెల్ ఆర్మీ(700 Killed – 24 Hours) వెల్లడించింది.
We’re now on WhatsApp. Click to Join.
గాజాకు మానవతా సాయం కొనసాగిస్తాం : భారత్
మంగళవారం రాత్రి అమెరికాలోని న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో భారత రాయబారి ఆర్ రవీంద్ర కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే తాము 38 టన్నుల ఆహార సామగ్రి, వైద్య సామగ్రిని గాజాకు పంపామని, మరింత సాయాన్ని కూడా త్వరలోనే పంపుతామని వెల్లడించారు. గాజాకు సాయం అందించే ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆరోగ్యం, విద్య, మహిళా సాధికారత, వ్యవస్థాపకత వంటి అంశాల్లో పాలస్తీనాకు అండగా ఉంటామని చెప్పారు. ఇజ్రాయెల్ దాడుల్లో గాజా పౌరుల మరణాలు పెరుగుతుండటం భారత్ కు ఆందోళన కలిగిస్తోందన్నారు. గాజాలోని సామాన్య పౌరులు, మహిళలు, పిల్లలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యకు రెండు దేశాల ఏర్పాటు, సరిహద్దుల గుర్తింపు ద్వారా పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని భారతదేశం తెలిపింది. పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య చర్చలను ప్రారంభించి, శాంతికి బాటలు వేయాలని పిలుపునిచ్చింది.