Israel Vs Hamas : గాజా నుంచి తమ సైనిక బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ నో చెప్పింది. యుద్ధం ముగింపు లాంటి హమాస్ కీలక డిమాండ్లను కూడా ఇజ్రాయెల్‌లోని నెతన్యాహు సర్కారు తిరస్కరించింది. దీంతో పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్, ఇజ్రాయెల్ ప్రభుత్వం మధ్య ఈజిప్టులోని కైరో వేదికగా జరిగిన చర్చలు విఫలమయ్యాయి. చర్చల అనంతరం హమాస్ ప్రతినిధులు ఖతార్‌కు వెళ్లిపోయారు. ఈనేపథ్యంలో పాలస్తీనాలోని రఫా ప్రాంతంతో పాటు గాజాలోని ఇతర ఏరియాల్లో భారీ సైనిక దాడులు చేస్తామని ఇజ్రాయెల్ (Israel Vs Hamas) వార్నింగ్ ఇచ్చింది. దక్షిణ లెబనాన్‌లోని మేస్ అల్ జబల్ టౌన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో నలుగురు పౌరులు చనిపోగా, పలువురు గాయపడ్డారు. తాము హెజ్బొల్లా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడి చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది.
We’re now on WhatsApp. Click to Join
ఎవరు చెప్పినా వినం : నెతన్యాహు
‘‘యుద్ధాన్ని ఆపేదిలేదు. ఈవిషయంలో మేం అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గం. ఇజ్రాయెల్ ఒంటరిగా నిలబడాల్సి వస్తే, ఒంటరిగానే నిలబడతాం’’ అని వార్షిక హోలోకాస్ట్ స్మారక దినం సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. జర్మనీ, దాని మిత్ర దేశాలు 60 లక్షల మంది యాదులను చంపిన ఘటనకు స్మారకంగా ఇజ్రాయెల్‌లో ‘యోమ్ హషోహ్’ అనే దినోత్సవాన్ని జరుపుకుంటారు. ‘‘నేను ప్రపంచ దేశాల నాయకులకు ఒకటే చెప్పదల్చుకున్నాను. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, ఏ అంతర్జాతీయ వేదిక ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. తనను తాను రక్షించుకోకుండా ఇజ్రాయెల్‌ను ఆపలేవు’’ అని ఆయన పేర్కొన్నారు.
Also Read : Bernard Hill Dies: టైటానిక్ నటుడు బెర్నార్డ్ హిల్ మృతి
ఖతర్ ప్రభుత్వానికి చెందిన అల్-జజీరా న్యూస్ ఛానల్‌పై ఇజ్రాయెల్ నిషేధం విధించింది. హమాస్‌కు అనుకూలంగా వార్తలు ప్రసారం చేస్తున్నారనే అభియోగంతో ఇజ్రాయెల్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న ఈ చర్చల్లో అమెరికా, ఈజిప్టుతో పాటు ఖతర్ కీలక పాత్ర పోషిస్తోంది.