Gaza – Musk – Starlink: గాజాపై పూర్తిస్థాయి గ్రౌండ్ ఎటాక్‌కు ముందు ఇజ్రాయెల్ ఆర్మీ.. గాజాలోని ఇంటర్నెట్, టెలికాం వ్యవస్థలను అన్నింటినీ ధ్వంసం చేసింది. దీంతో శుక్రవారం రాత్రి నుంచే గాజాకు ప్రపంచంతో సంబంధాలు కట్ అయ్యాయి. అక్కడ ఇజ్రాయెల్ ఆర్మీ ఏమేం చేస్తుందో బయటకు తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో అమెరికాకు చెందిన ఒక రాజకీయ నాయకురాలి రిక్వెస్ట్ మేరకు ట్విట్టర్, స్టార్ లింక్ కంపెనీల యజమాని ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. గాజాకు తన స్టార్ లింక్ నెట్‌వర్క్ ద్వారా శాటిలైట్ ఇంటర్నెట్ కనెక్టివిటీని కల్పిస్తానని వెల్లడించారు. అయితే ఈ సహాయం కేవలం గాజాలో పనిచేస్తున్న ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలతో పాటు ఇతరత్రా అంతర్జాతీయ స్థాయి మానవతా సహాయక సంస్థలకు మాత్రమే అందుతుందని మస్క్ తేల్చి చెప్పారు. ఈమేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. దీనిపై ట్విట్టర్ వేదికగా ఆయా సంస్థల ఉన్నతాధికారులతో మస్క్ డిస్కస్ చేశారని తెలిసింది. అనంతరం స్టార్ లింక్‌లోని తన మిడిల్ ఈస్ట్ టీమ్‌తో ఎలాన్ మస్క్ చర్చించినట్లు(Gaza – Musk – Starlink) సమాచారం.
We’re now on WhatsApp. Click to Join.
ఈ పరిణామంపై ఇజ్రాయెల్ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి ష్లోమో కర్హి స్పందించారు. స్టార్‌లింక్ నుంచి గాజాకు ఇంటర్నెట్ అందకుండా అడ్డుకుంటామని ప్రకటించారు. ‘‘మస్క్ తీసుకున్న నిర్ణయంపై పోరాడటానికి అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ఇజ్రాయెల్ ఉపయోగిస్తుంది’’ అని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ స్టార్ లింక్ గాజాలో యాక్టివిటీ మొదలుపెడితే.. దాన్ని హమాస్ వాడుకుంటుందని ఇజ్రాయెల్ మంత్రి ఆరోపించారు. ఇజ్రాయెల్‌లో ఇతర సమాచార వ్యవస్థలు విఫలమైన సందర్భంలో స్టార్‌లింక్ సేవలను బ్యాకప్‌గా వాడుకునే అంశంపై ఎలాన్ మస్క్‌కు ప్రతిపాదనలు పంపామని, చర్చలు ఇప్పటికే మొదలయ్యాయని ఆయన వెల్లడించారు.