War Pause : అక్టోబరు 7వ తేదీ రాత్రి నుంచి గాజాపై బాంబుల వర్షం కురిపిస్తున్న ఇజ్రాయెల్ ఎట్టకేలకు 34 రోజుల తర్వాత ఒక మెట్టు దిగింది. దాదాపు 11వేల మంది గాజా సామాన్య పౌరులు చనిపోయాక కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఇక నుంచి ప్రతిరోజూ 4 గంటల పాటు గాజాపై దాడులు చేయబోమని ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించింది. ఈ టైంలో గాజాలోని హమాస్ మిలిటెంట్ల చెరలో ఉన్న బందీల విడుదల ప్రక్రియను చేపట్టొచ్చని తెలిపింది. ఆ ప్రాంతంలో ఇరుక్కుపోయిన విదేశీయులు కూడా వెళ్లిపోవచ్చని తెలిపింది. ఉత్తర గాజా ప్రజలు దక్షిణ గాజాకు వలస వెళ్లేందుకు ఈ టైంను వాడుకోవచ్చని ఇజ్రాయెల్ ఆర్మీ సూచించింది.
We’re now on WhatsApp. Click to Join.
దీనిపై స్పందించిన అమెరికా ప్రభుత్వం.. ‘సరైన దిశలో పడిన అడుగు ఇది’ అని కామెంట్ చేసింది. అయితే పూర్తిస్థాయి కాల్పుల విరమణ చేసేది లేదని అమెరికాకు ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది. హమాస్ స్థావరాలను, మిలిటెంట్లను పూర్తిగా తుద ముట్టించే దాకా పోరాటం కొనసాగిస్తామని వెల్లడించింది. కాల్పులను ఆపేసిన ఆ 4 గంటలలోగా గాజాలోకి మానవతా సాయాన్ని పంపించే వీలును కల్పిస్తామని పేర్కొంది. గాజా ప్రజల జీవితం దుర్భరంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో రోజూ కేవలం 4 గంటల కాల్పుల విరమణ చేస్తామని ఇజ్రాయెల్ చెప్పడాన్ని చాలా ప్రపంచ దేశాలు, మానవతా సంస్థలు(War Pause) ఖండిస్తున్నాయి.