Israel – Hamas Deal : ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో తొలి రోజైన శుక్రవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. 39 మంది పాలస్తీనా ఖైదీలను తమ జైళ్ల నుంచి ఇజ్రాయెల్ విడుదల చేసింది. వీరిలో 24 మంది మహిళలు, 15 మంది మైనర్లు ఉన్నారు. వారందరినీ ప్రత్యేక బస్సుల్లో ఈజిప్టు బార్డర్‌లోని రఫా క్రాసింగ్ దగ్గర వదిలింది. అక్కడి నుంచి వారిని గాజాలోకి తీసుకెళ్లారు. గతంలో ఈ మహిళలపై హత్యానేరం కేసులను, పిల్లలపై రాళ్లు రువ్విన కేసులను ఇజ్రాయెల్ పోలీసులు నమోదు చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
మరోవైపు 24 మంది బందీలను హమాస్ కూడా రిలీజ్ చేసింది. వీరిలో 13 మంది ఇజ్రాయెలీ యూదులు, 11 మంది థాయ్ జాతీయులు ఉన్నారు. తొలుత వీరందరిని గాజాలోని అంబులెన్సులలో ఈజిప్టులోని రఫా బార్డర్ వద్దకు తీసుకెళ్లి వదిలేశారు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉంచిన బస్సులలో బందీలను ఇజ్రాయెల్‌కు తీసుకెళ్లారు. ఈ పరిణామాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వాగతించారు. రానున్న రోజుల్లో మరింత మంది బందీలనుు ఇలాగే విడుదల చేయాలని కోరారు. తాత్కాలిక కాల్పుల విరమణను పొడిగించేందుకు ఈ శాంతియుత పరిస్థితులు మంచి అవకాశమని తెలిపారు. దాదాపు 8,000 మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్నారు. వీరిలో 3,000 మందిని గత ఏడు వారాల్లో పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్ ఏరియాలో అదుపులోకి (Israel – Hamas Deal) తీసుకున్నారు.