Israel Deal : ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం అక్టోబరు 7 నుంచి నవంబరు 23 వరకు కంటిన్యూగా జరిగింది. గత శుక్రవారం(నవంబరు 24) నుంచే అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ, బందీల బదిలీ ఒప్పందం ఈరోజు రాత్రితో ముగియబోతోంది. దీంతో ఇక రేపటి నుంచి మళ్లీ యుద్ధం మొదలు కాబోతోందా ? అనే డిస్కషన్ అంతటా జరుగుతోంది. మళ్లీ యుద్ధం మొదలైతే.. మరింత ప్రాణనష్టం జరుగుతుందనే ఆందోళనను సర్వత్రా వెలిబుచ్చుతున్నారు. ఇప్పటికే ఇజ్రాయెల్ దాడుల్లో దాదాపు 14వేల మంది అమాయక గాజా పౌరులు చనిపోయారు. వారిలో దాదాపు 10వేల మంది పిల్లలు, మహిళలే ఉన్నారు. శుక్ర, శని, ఆదివారాల్లోనూ ఇజ్రాయెల్ వైపు నుంచి పాలస్తీనా ఖైదీలు విడుదలయ్యారు. హమాస్ వైపు నుంచి ఇజ్రాయెలీ బందీలు రిలీజ్ అయ్యారు.
We’re now on WhatsApp. Click to Join.
ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే గాజాలో ఇంకా ఇజ్రాయెల్ ఆర్మీ ఉంది. అది ఇప్పుడే వెనక్కి వెళ్లే అవకాశాలు లేవు. గాజా నుంచి హమాస్‌ను పూర్తిగా తుది ముట్టించిన తర్వాతే అన్నీ ఆలోచిస్తామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు అంటున్నారు. వాస్తవానికి ఆయనపై స్వదేశంలో చాలా ఒత్తిళ్లు ఉన్నాయి. హమాస్ దాడి నుంచి దేశాన్ని రక్షించడంలో విఫలమైనందుకు రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇజ్రాయెలీ బందీలను విడుదల చేయించేందుకు ప్రయారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. ఈనేపథ్యంలో ఆయన బందీలను విడిపించేందుకే మొగ్గు చూపుతారని, హమాస్‌తో కుదిరిన బందీల విడుదల ఒప్పందాన్ని ఇంకొన్ని రోజులు పొడిగిస్తారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
Also Read: Polling Vs Rain : తెలంగాణలో పోలింగ్ రోజున వాన పడుతుందా ?
హమాస్ చెరలో దాదాపు 250 మంది ఖైదీలు ఉండగా.. నాలుగు రోజుల్లో (ఈరోజుతో కలుపుకొని) కేవలం 50 మంది విడుదలయ్యారు. అంటే మరో 200 మంది హమాస్ దగ్గర బందీలుగా ఉన్నారు. వారందరిని కూడా విడిపించాలంటూ ఇజ్రాయెల్ రాజధాని టెల్అవీవ్లో నిరసనలు హోరెత్తుతున్నాయి. ఈ ఒత్తిడి నేపథ్యంలో బందీలంతా విడుదలయ్యే దాకా సీజ్ ఫైర్‌ను ఇజ్రాయెల్ కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ దిశగా ఇజ్రాయెల్ అంగీకరిస్తుందా ? లేదా ? అనేది పక్కాగా తెలియాలంటే(Israel Deal) ఇంకో ఒకటి, రెండు రోజులు వేచిచూడాల్సిందే.