Mayank Agarwal : భారత క్రికెటర్ మయాంక్ అగర్వాల్ ఐసీయూలో చేరారు. త్రిపురలోని అగర్తల నుంచి గుజరాత్‌లోని సూరత్‌కు వెళ్లేందుకు విమానం ఎక్కుతుండగా ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. నోరుమంట, గొంతు మంటగా ఉందని చెప్పడంతో.. వెంటనే మయాంక్‌ను అగర్తలలోని ఐఎల్ఎస్ హాస్పిటల్‌కు తరలించారు. ఆ వెంటనే ఐసీయూలో చేర్పించి చికిత్స మొదలుపెట్టారు. ప్రస్తుతం మయాంక్ ప్రమాదం నుంచి బయటపడ్డారని సమాచారం. మయాంక్‌కు ప్రమాదమేం లేదని, కంగారు పడాల్సిన అవసరం లేదని తెలియడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక విమానంలో మయాంక్ వాడిన వాటర్ బాటిల్‌ను విమానం సిబ్బంది సీజ్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై కర్ణాటక రంజీ టీమ్ గానీ, విమాన సిబ్బంది గానీ ఎలాంటి ప్రకటనా చేయలేదు.
We’re now on WhatsApp. Click to Join.
విమాన సిబ్బంది వాటర్ బాటిల్‌ను యాసిడ్ ఉంచే ప్రాంతంలో ఉంచినందు వల్లే మయాంక్(Mayank Agarwal) అస్వస్థతకు గురై ఉంటారనే ప్రచారం జరుగుతోంది. మంచినీళ్లు అనుకొని మయాంక్ యాసిడ్ తాగాడనే పుకార్లు కూడా చక్కర్లు కొడుతున్నాయి. అయితే మయాంక్ వెంటనే దాన్ని ఉమ్మేయడంతో యాసిడ్ పొట్టలోకి వెళ్లలేదని చెబుతున్నారు. ఈ ప్రచారంలో నిజమెంత.. అబద్ధమెంత అనేది అధికారిక ప్రకటన వెలువడితే కానీ మనకు తెలియదు. ప్రస్తుతం రంజీ టోర్నీలో కర్ణాటక జట్టు కెప్టెన్‌గానూ మయాంక్ వ్యవహరిస్తున్నారు. రంజీ ట్రోఫీలో భాగంగా త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో కర్ణాటక జట్టు సోమవారం గెలిచింది. తదుపరి మ్యాచ్ కోసం కర్ణాటక జట్టు గుజరాత్‌లోని సూరత్‌కు బయల్దేరుతుండగా మయాంక్ అగర్వాల్ అస్వస్థతకు గురయ్యాడు.