30 Years Silence : ఆమె భక్తి అనన్య సామాన్యం. ఒక ఏడాది కాదు.. రెండేళ్లు కాదు.. ఏకంగా గత 30 ఏళ్లుగా ఆమె మౌనవ్రతం పాటిస్తోంది. జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌కు చెందిన 85 ఏళ్ల సరస్వతీ దేవికి శ్రీరాముడంటే చాలా భక్తి. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత ఆమె అయోధ్య సందర్శనకు వెళ్లింది. మసీదు ఉన్న ప్లేస్‌లో రామ మందిరాన్ని నిర్మించేదాకా ‘మౌనవ్రతం’ పాటిస్తానని ఆనాడే ఆమె డిసైడ్ అయింది. ఆనాటి నుంచి ఇప్పటిదాకా సరస్వతీ దేవి రోజులో 23 గంటలు మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉంటోంది. ఏదైనా కావాలంటే సైగలతో అడుగుతోంది. రోజూ ఒక గంట మాత్రమే కుటుంబసభ్యులతో మాట్లాడుతోంది. అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం 2020లో ప్రధాని మోడీ భూమి పూజ చేసిన రోజున.. సరస్వతీదేవి 24 గంటల మౌనవ్రతం పాటించింది. జనవరి 22న జరిగే రామమందిర ప్రారంభోత్సవానికి రావాలంటూ సరస్వతీ దేవికి కూడా ఆహ్వానం అందింది. సోమవారం రాత్రి అయోధ్యకు బయలుదేరిన సరస్వతీ దేవి.. అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠ పూర్తయిన తర్వాత మౌనవ్రతాన్ని వీడనుంది. మూడు దశాబ్దాలుగా మౌనంతో ఉండటం వల్ల ఆమెను స్థానికులు మౌనీమాత(30 Years Silence) అని పిలుస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
అయోధ్య గర్భగుడిలో కొలువుదీరనున్న శ్రీరాముడి విగ్రహాన్ని చూడాలని యావత్ ప్రపంచం ఆతృతగా ఎదురుచూస్తోంది. అయితే ఆ శ్రీరాముడి విగ్రహాన్ని ఈ నెల 17 వ తేదీన అయోధ్య నగరంలో ఊరేగింపు చేపట్టాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మొదట నిర్ణయించుకుంది. అయితే ఆ నిర్ణయాన్ని తాజాగా ట్రస్ట్ ఉపసంహరించుకుంది. అయోధ్య నగరంలో శ్రీరాముడి విగ్రహ ఊరేగింపు కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయోధ్య గర్భగుడిలో ప్రాణ ప్రతిష్ఠ జరగనున్న బాల రాముడి రూపంలో ఉన్న శ్రీరాముడి విగ్రహ ఊరేగింపును రద్దు చేసినట్లు తెలిపింది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో నగరానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని.. భక్తుల రద్దీ కారణంగానే ఉన్నతాధికారుల సూచనలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. భారీగా తరలివస్తున్న భక్తుల మధ్య నుంచి అయోధ్య రాముడి ఊరేగింపు జరిపితే భద్రతా పరంగా సమస్యలు తలెత్తుతాయని అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. అయితే అదే రోజున రామజన్మభూమి ప్రాంగణంలో ఆ బాల రాముడి కొత్త విగ్రహాన్ని ప్రదర్శిస్తామని స్పష్టం చేసింది.