Site icon HashtagU Telugu

Virus Threat to the World: ప్రపంచానికి మరో వైరస్ ముప్పు ..!

Virus Threat to the World

Vairus

కరోనా కనుమరుగైందని భావిస్తున్న సమయంలో మరో కొత్త వైరస్ (Virus) ప్రపంచాన్ని భయపెడుతోంది. మరో ముప్పు ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమ ఆఫ్రికా దేశం ఘనాలో తాజాగా ఓ కొత్త వైరస్ వ్యాపిస్తోంది. ‘మార్ బర్గ్’ గా వ్యవహరిస్తున్న ఈ వైరస్ కేసులు ప్రస్తుతం ఘనాలో రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) అప్రమత్తమైంది. వైరస్ (Virus) వ్యాప్తి, ముప్పును అంచనా వేసేందుకు అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది.

ఈ కొత్త వైరస్ ప్రాణాంతకమని ఇప్పటికే డబ్ల్యూహెచ్ వో ప్రకటించింది. దీనికి వ్యాక్సిన్ కూడా అందుబాటులో లేదని వెల్లడించింది. మరోవైపు, ఈక్వటోరియల్ గినియాలో మార్ బర్గ్ వైరస్ బారిన పడి తొమ్మిది మంది చనిపోయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించినట్లు సమాచారం.

మార్ బర్గ్ వైరస్ కు వేగంగా వ్యాపించే గుణముందని డబ్ల్యూహెచ్ వో వెల్లడించింది. వైరస్ సోకిన వారిని తాకడం వల్ల, వారి రక్తంతో పాటు ఇతర శరీర ద్రవాల ద్వారా, రోగులు పడుకున్న ప్రదేశంలో పడుకోవడం వల్ల, వారి దుస్తులను వేసుకోవడం వల్ల ఇతరులకు వ్యాపిస్తుందని తెలిపింది. వైరస్ సోకిన జంతువులు, గబ్బిలాల వల్ల కూడా వైరస్ ఇతరులకు అంటుకుంటుందని హెచ్చరించింది.

గాలి ద్వారా ఈ వైరస్ వ్యాపించదని తేల్చిచెప్పింది. వైరస్ బాధితులు తీవ్రమైన జ్వరం, తలనొప్పితో బాధపడుతుంటారని వైద్య నిపుణులు పేర్కొన్నారు. శరీరంలో అంతర్గతంగా, బయటకు రక్తస్రావం జరుగుతుందని చెప్పారు. వైరస్ లక్షణాలు ఒక్కసారిగా బయటపడతాయని, చికిత్సలో జాప్యం జరిగితే ప్రాణాంతకంగా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

Also Read:  Palani Temple: మెట్టు మెట్టుకు హారతి వెలిగిస్తూ.. పళని దేవాలయం లో సమంత