Site icon HashtagU Telugu

Earthquake : తీవ్ర భూకంపం.. ఇళ్ల నుంచి జనం పరుగులు

Chile Earthquake

Chile Earthquake

Earthquake : ఇండోనేషియాలో ఇవాళ తెల్లవారుజామున తీవ్ర భూకంపం సంభవించింది.  తలాడ్ దీవులలో భూమి తీవ్రంగా కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.7గా నమోదైంది. భూకంప కేంద్రం భూమి కింద 80 కిలోమీటర్ల లోతులో ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సీఎస్) వెల్లడించింది.  భూమి ఒక్కసారిగా కంపించడంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. దీనికి సంబంధించిన పలు  వీడియోలు అక్కడి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రే భూప్రకంపనలు రావడంతో జనం రోడ్లపైకి వచ్చేసి ఉదయం దాకా అక్కడే పడిగాపులు కాశారు.  అయితే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. అంతకుముందు జనవరి 4న ఇండోనేషియాలోని బలాయ్ పుంగుట్ ప్రాంతంలోనూ తీవ్ర భూకంపం సంభవించింది. దాని భూకంప కేంద్రాన్ని(Earthquake) 221.7 కి.మీ లోతులో గుర్తించారు.

We’re now on WhatsApp. Click to Join.

భూకంపంతో కొత్త బీచ్‌లు

జపాన్‌లో జనవరి 1న సంభవించిన  భారీ భూకంపం ప్రభావంతో నోటో ద్వీపకల్పంలో కొత్త బీచ్‌లు ఏర్పడ్డాయి. భూకంపం వల్ల ఇక్కడి సముద్ర తీరం వెంబడి భూమి పెరిగింది. కొన్ని ప్రదేశాలలో తీర ప్రాంతాన్ని 820 అడుగుల వరకు పెంచింది. దీంతో ఇక్కడ కొత్త బీచ్‌లు ఏర్పడ్డాయి. ఈవివరాలను యూనివర్సిటీ ఆఫ్‌ టోక్యో వెల్లడించింది. ఈ మార్పు కారణంగా సముద్ర తీరం వెంట దాదాపు 13 మీటర్ల వరకు భూమిపైకి లేచింది. దీనికి సంబంధించిన శాటిలైట్‌ చిత్రాలను అధికారులు విడుదల చేశారు.

Also Read: World’s Rarest Blood Groups : ప్రపంచంలోనే అత్యంత అరుదైన బ్లడ్ గ్రూపు ఏదో మీకు తెలుసా..?

ఎటుచూసినా శిథిలాల గుట్టలు

జనవరి 1న సంభవించిన భూకంపం ప్రభావంతో జపాన్‌లోని ప్రభావి ప్రాంతాల్లో ఎటుచూసినా శిథిలాల గుట్టలు, విరిగిపడిన కొండచరియలే కనిపిస్తున్నాయి.  ఆపై విపరీతంగా కురుస్తున్న మంచు వల్ల రెస్క్యూ వర్క్ వేగంగా జరగడం లేదు. ఇళ్లు కూలిపోవడం వల్ల ఎంతోమంది చలికి వణుకుతూ రోడ్డుపైనే అవస్థలు పడుతున్నారు. ఇక్కడ 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపంతో 168 మంది మరణించారు. వందలాది మంది గాయాల పాలయ్యారు. ఇటీవల శిథిలాల కింది నుంచి 90 ఏళ్ల వృద్ధురాలు సజీవంగా బయటపడింది.  ఆమె ఐదు రోజులు పాటు భవనాల శిథిలాల కిందే మరణంతో పోరాడి విజయం సాధించింది. భూకంపాల ముప్పు ఇంకా తొలగిపోలేదని, ఇవి పునరావృతం కాబోతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్రమంగా భూకంప తీవ్రత తగ్గిపోతుందని, కానీ అంతకుముందు భూకంపాలతో పోలిస్తే తక్కువేనని చెప్పారు.