Conservation of Rivers : వాటర్ ఉమెన్.. నదుల్లో నీళ్లే కాదు..కన్నీళ్లు కూడా ఉంటాయ్

ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాలు, నివాసాల్లో నుంచి వచ్చే మురుగు నీరు, ఇతర వ్యర్థాల వల్ల గోమతి నది అనేక ప్రాంతాల్లో కలుషితం అవుతుంది. మురుగునీటి శుద్ధి కర్మాగారాలున్నా..

  • Written By:
  • Publish Date - October 28, 2023 / 06:30 AM IST

Conservation of Rivers : నదులు.. గంగ, యమున, గోదావరి, కృష్ణా, పెన్నా.. ఇలా మనదేశంలో చాలా నదులున్నాయి. వీటిగొప్పతనం గురించి చెప్పమంటే.. ఒక్కొక్కరిలో కవి పుట్టుకొస్తాడు. కానీ.. మనలో ఎంతమంది నదులను పవిత్రంగా, కాలుష్యం కాకుండా చూసుకుంటున్నాం ? ఉదయం లేచిన దగ్గరనుండి రాత్రి పడుకునేంతవరకూ వ్యర్థాలను నదుల్లోకి వదులుతూ వాటిని కలుషితం చేస్తూనే ఉంటున్నాం. ఏదైనా పండుగ ఉంటేనో, కార్తీక మాసంలోనో ప్రత్యేకంగా పుణ్యస్నానాల కోసం నదులు గుర్తొస్తాయి కదూ. మిగతా రోజుల్లో వాటిలో వ్యర్థాలు పెరిగి జీవం కోల్పోయే పరిస్థితిలో ఉంటే మాత్రం అస్సలు పట్టించుకోం.

కానీ ఒక మహిళ.. ఒకే ఒక్క మహిళ.. రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్న పుణ్యనది గోమతి సంరక్షణ కోసం 1001 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. ఆమె పేరు షిప్రా పథక్. ఉత్తరప్రదేశ్ కు చెందిన షిప్రాకు నదులన్నా, వాటి పురాణ కథలన్నా ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే ఈ పాదయాత్ర చేసింది. గోమతి నది ప్రవాహం సన్నగా మొదలై క్రమంగా బలపడుతూ వెళ్తుంది. ప్రయాణం గొప్పతనం బలం అని ఆ నది మౌనంగానే చెబుతుంది. అందుకే గోమతి నదిని రక్షించుకుందాం అనే నినాదంతో షిప్రాపథక్ ఈ పాదయాత్ర చేసింది.

ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాలు, నివాసాల్లో నుంచి వచ్చే మురుగు నీరు, ఇతర వ్యర్థాల వల్ల గోమతి నది అనేక ప్రాంతాల్లో కలుషితం అవుతుంది. మురుగునీటి శుద్ధి కర్మాగారాలున్నా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. గంగానది కంటే గోమతి నది ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొంటోందని నివేదికలు చెబుతున్నాయి. పంచతత్వ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలైన షిప్రా.. నదిని రక్షించేందుకు ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని ఎదురుచూడకుండా మన నదిని మనమే రక్షించుకోవాలని అంటుంది షిప్రా. ఆమెకు వాటర్ ఉమన్ అనే పేరు కూడా వచ్చింది. గోమతి నదిని రక్షించుకుందాం అనే నినాదంతో 15 జిల్లాల్లో ఊళ్లు, పల్లెలు, పట్టణాల మీదుగా సాగిన ఈ పాదయాత్రలో ఆ నది ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్ల గురించి ప్రజలకు తెలిపింది.

ప్రతిరోజూ 30-35 కిలోమీటర్ల వరకూ పాదయాత్ర చేసి.. నది ఒడ్డున మొక్కలు నాటుదాం.. ఆక్రమణలను అడ్డుకుందాం.. పుణ్యనదిని కాపాడుకుందాం అంటూ అవగాహన కల్పించింది. షిప్రా నినాదాలతో వందలాది ప్రజలు నదిఒడ్డున మొక్కలు నాటడాన్ని ఒక ఉద్యమంలా చేసుకున్నారు. గతంలో కూడా షిప్రా నర్మద నది సంరక్షణ కోసమై 3600 కిలోమీటర్ల వరకూ యాత్ర చేసింది. నదులు కలుషితమైతే మనకేంటి అనే భావనలో నుంచి అందరూ బయటకు రావాలని తెలిపింది. నదులు బాగుంటునే.. మనకు భవిష్యత్ ఉంటుందని వివరించింది షిప్రా. మనిషి జీవించడానికి రక్తం ఎంత అవసరమో.. ఆరోగ్యంగా ఉండాలంటే మంచినీరు అంతే అవసరమని చెబుతోంది. షిప్రా చెప్పింది నిజమే కదా. నదులు కలుషితమైతే.. మన ఆరోగ్యం కూడా కలుషితమవుతుందనే అర్థం. మనం కూడా ఇకపై నదులను ఆరోగ్యంగా ఉంచేందుకు మనవంతు ప్రయత్నం చేద్దాం.