Fashion Beauty: రైతు బిడ్డనని చెప్పుకోడానికి గర్వపడతాను: నిషా యాదవ్

ఐదడుగుల 11 అంగుళాలు. పొడవుకు తగ్గ అందం. ఇసుక తిన్నెరలు పరచుకున్నట్లుండే సోయగం. ఎంతైనా రాజస్తానీ పిల్ల కదా ఆ అందాలు అలా అమరిపోయాయి.

  • Written By:
  • Updated On - January 20, 2022 / 02:37 PM IST

ఐదడుగుల 11 అంగుళాలు. పొడవుకు తగ్గ అందం. ఇసుక తిన్నెరలు పరచుకున్నట్లుండే సోయగం. ఎంతైనా రాజస్తానీ పిల్ల కదా ఆ అందాలు అలా అమరిపోయాయి. పరదా చాటున మొహం దాచుకునేంత సాంప్రదాయాలు ఇప్పటికీ కొనసాగుతున్న రాజస్తాన్ నుంచి ఓ అమ్మాయి ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టడం ఏమంత సులభం కాదు. నిషా యాదవ్ ప్రయాణం కూడా అంత ఈజీగా సాగలేదు. మోడలింగ్ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకోడానికి చాలానే కష్టపడాల్సి వచ్చింది. ముఖ్యంగా కుటుంబం నుంచి ఆ తరువాత సమాజం నుంచి.
మోడలింగ్‌లో బికినీ ధరించడం చాలా కామన్. అసలు బికినీ అంటే ఏంటని నిషా యాదవ్ తండ్రి అడగడంతో సమస్యలు మొదలయ్యాయి. కింద చడ్డీ, పైన బనియన్ మాత్రమే ఉంటాయని తన చెల్లెలు ఇచ్చిన సమాధానంతో తండ్రి ఒక్కసారిగా తలపట్టుకున్నాడు. అలాంటి డ్రెస్‌లో చూసిన తరువాత బయట వాళ్లంతా ఎలా మాట్లాడుకుంటారో తెలుసా అంటూ కుప్పకూలిపోయారు. కాని, నాగరికత అనేది వేసుకునే డ్రస్సులో ఉండదని.. చూడాల్సిందల్లా అమ్మాయిల్లోని ఆత్మవిశ్వాసం, ధైర్యమేనని చెప్పుకొచ్చింది. ఆ తరువాత చుట్టుపక్కల వాళ్లు ఏమంటున్నా, ఎలాంటి కామెంట్స్ చేసినా నిషా యాదవ్ తండ్రి పట్టించుకోలేదు. తన కూతురు ఏంటో, తాను సాధించాలనుకుంటున్నది ఏంటో తెలుసుకున్నారు. అలా ముందు తన కుటుంబాన్ని మౌల్డ్ చేయగలిగింది. ఆ తరువాత మోడలింగ్ రంగంలో నిషా యాదవ్ సాధించిన విజయాలు చూసి చుట్టూ ఉన్న సమాజం కూడా తలవంచింది.
నిషా యాదవ్ కేవలం మోడలింగ్ రంగం వరకే పరిమితం అవలేదు. లా కోర్స్ చదువుతూ లాక్మే ఫ్యాషన్ వీక్ షోలో మెరుస్తూ ఉంటుంది. ఫ్యాషన్ షోల్లో చేసే క్యాట్ వాక్‌ల వెనక.. ఎంతో మంది అమ్మాయిల్లో స్ఫూర్తి నింపే కథ ఉంది. నిషా యాదవ్ విజయగాధ ఏంటో స్వయంగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీనే ఓ వీడియో రూపంలో షేర్ చేశారు. చిన్నతనంలో చదువుకోవడం కోసం రోజు 12 కిలోమీటర్లు నడిచి వెళ్లేది. రాజస్తాన్‌లోని కోట్‌పుత్లీ దగ్గర్లో ఉన్న ఓ చిన్న పల్లెటూరులో వీరి కుటుంబం ఉండేది. తండ్రి వ్యవసాయం. గేదెలు కడుగుతూ, అక్కడే స్నానం చేస్తూ పెరిగారు. ఇప్పటికీ, తన గ్రామానికి వెళ్లాలంటే నాలుగు చక్రాల బండి వెళ్లదు. రెండు కాళ్లతోనైనా నడవాలి లేదంటే రెండు చక్రాల సైకిల్ లేదా బైక్ మీదనైనా వెళ్లాలి. పైగా వీరిదేం ధనిక కుటుంబం కాదు. ఆరుగురి సంతానంలో ఐదుగురూ ఆడపిల్లలే. ఆడపిల్లలే భారం అనుకునే ఊళ్లో.. ఆడపిల్లలను బాగా చదివించాడా తండ్రి. డబ్బులేమైనా ఎక్కువయ్యాయా? వాళ్లను చదివిస్తే మాత్రం ఏదైనా సాధించగలరా? అంటూ గ్రామంలోని వాళ్లంతా గేలి చేస్తున్నా సరే.. ఆడపిల్లలకు చదువు అవసరం అని గట్టిగా నమ్మాడు.

తండ్రి ముందుచూపు ఫలితం ఆ ఐదుగురు అమ్మాయిల్లో పెద్ద కూతురు సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా, ఒకరు ఐఏఎస్ ఆఫీసర్‌గా, మరొకరు సబ్ ఇన్‌స్పెక్టర్‌గా స్థిరపడ్డారు. ఇంకొకరు పీహెచ్‌డీ చేస్తుండగా, నిషా యాదవ్ హైకోర్టులో లాయర్‌గా ప్రాక్టీస్ చేస్తూ మోడలింగ్‌లోనూ రాణిస్తోంది. ఒక్కగానొక్క సోదరుడు డాక్టరుగా సేవలందిస్తున్నారు. ఒకే ఇంట్లోని వాళ్లంతా ఇలా వేర్వేరు రంగాల్లో, ఉన్నతమైన స్థానాల్లో సెటిల్ అయ్యేలా చదివించడం ఆ తండ్రి గొప్పదనం అనే చెప్పాలి.
సర్కారీ బడిలో చదువుకున్నందున నిషా యాదవ్‌కు రాజస్తానీ తప్ప హిందీ, ఇంగ్లీష్ అంతంత మాత్రమే వచ్చు. అయినా సరే ధైర్యంగా ఇంజనీరింగ్‌లో అడుగుపెట్టింది. వచ్చీ రాని హిందీ, ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంటే, చుట్టూ ఉన్న వాళ్లు నవ్వుతుంటే.. వాటినే భవిష్యత్ సోపానాలుగా మార్చుకుంది. అదే ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఫ్యాషన్ ఫెస్ట్‌ లో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఫ్యాషన్ షో చేసింది. అంతే.. అప్పటి నుంచి నిషా యాదవ్ ఫేట్ మారిపోయింది. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్‌లో అందాల పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ రావడం, అది పేపర్లో రావడంతో.. తన అడుగులు ఎటువైపు వేయాలో డిసైడ్ చేసుకుంది. అలాగని, కేవలం మోడలింగ్ రంగంలోనే ఉండిపోలేదు. అజ్మీర్‌లో మాస్టర్స్ ఇన్ ఎకనమిక్స్ చేసింది నిషా యాదవ్.

మాస్టర్స్ చేసిన తరువాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాసింది నిషా యాదవ్. ఇందుకోసం రోజుకు 18 గంటలు కష్టపడి చదివింది. ఓవైపు చదువు కొనసాగిస్తూనే అందాల పోటీల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. తన కష్టానికి తగ్గ ఫలితంగా మిస్ రాజస్తానీ అవార్డ్ వరించింది. అలా మిస్ రాజస్తానీగా ఎంపికైన రోజే ఎస్‌బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా రాసొచ్చింది నిషా యాదవ్. అంటే.. ఫ్యాషన్ పట్ల ఎంత ప్యాజన్ ఉందో.. చదువు పట్ల కూడా అంతే గౌరవం ఉంది. నిజానికి చదువు, మోడలింగ్ పొంతన లేని రంగాలు. మోడలింగ్‌లో ఉంటే చదువును గాలికి వదిలేస్తారు చాలా మంది. పైగా చదువుపై ధ్యాసే కలగదు. ఒకసారి మోడలింగ్ అనే రంగుల ప్రపంచంలోకి వెళ్లాక మళ్లీ వేరే దారిలో నడవాలని కూడా అనిపించదు. కాని, నిషా యాదవ్ పట్టుదలతో చదివింది. హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టింది.