BJP Politics: నార్త్ లో బీజేపీ చిటికేస్తే.. సౌత్ లో పార్టీలకు హార్ట్ బీట్ పెరిగిందా?

ఢిల్లీలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేయగలరో ఉత్తరప్రదేశ్ డిసైడ్ చేస్తుందంటారు. ఎందుకంటే మొత్తం 543 లోక్ సభా స్థానాల్లో కేవలం యూపీలోనే 80 సీట్లు ఉన్నాయి. అక్కడ ఇప్పటికే 255 అసెంబ్లీ సీట్లు గెలుచుకున్న బీజేపీకి..

  • Written By:
  • Updated On - March 25, 2022 / 12:04 PM IST

ఢిల్లీలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేయగలరో ఉత్తరప్రదేశ్ డిసైడ్ చేస్తుందంటారు. ఎందుకంటే మొత్తం 543 లోక్ సభా స్థానాల్లో కేవలం యూపీలోనే 80 సీట్లు ఉన్నాయి. అక్కడ ఇప్పటికే 255 అసెంబ్లీ సీట్లు గెలుచుకున్న బీజేపీకి.. ఎంపీ సీట్లు గెలవడం అంత పెద్ద కష్టం కాదు. అందుకే కమలాన్ని వాడిపోయేలా చేయడానికి కొత్త ఫ్రంట్ పెట్టడానికి ఇన్నాళ్లూ ఉవ్విళ్లూరిన ప్రాంతీయ పార్టీలు.. ఇప్పుడు తమ వ్యూహాలను మళ్లీ సమీక్షించుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది.

ఉత్తరప్రదేశ్ ఎన్నికల తరువాత పరిస్థితిని చూస్తే.. బీజేపీతో రాజకీయ యుద్ధం చేసే శక్తి కాంగ్రెస్ కు లేదని అర్థమవుతోంది. ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి కూటమిలా ఏర్పడినా.. దానికి నాయకత్వం వహించి ముందుకు నడిపించే ఓ జాతీయ పార్టీ కచ్చితంగా అవసరం. అలాంటి పాత్ర పోషించాలని జేడీఎస్ తహతహలాడుతోందా? కాకపోతే 2006లో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది జేడీఎస్. తరువాత రెండేళ్లకే అంటే 2008లో తన మద్దతును ఉపసంహరించుకుంది. దీంతో ప్రభుత్వం కుప్పకూలింది. అప్పటి నుంచి బీజేపీని రాజకీయంగా వ్యతిరేకిస్తోంది జేడీఎస్.

ఇక జేడీఎస్ లో చాలామంది నేతలు తమను తాము ప్రధానమంత్రి అభ్యర్థులుగా భావిస్తున్నారు. కానీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వారి ఆశల మీద నీళ్లు జల్లాయి. అయినా సరే 2024 ఎన్నికల్లో తామే ప్రధానమంత్రి అభ్యర్థులమని చాటడానికి వాళ్లు తమ ప్రయత్నాలను ఆపేలా కనిపించడం లేదు. ఒకవేళ ఫలితాలు తారుమారైతే.. ఇందులో చాలామంది మళ్లీ బీజేపీతో కలిసిపోయినా ఆశ్చర్యపోనక్కరలేదు.

ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీతో ద్వంద్వ వైఖరిని అవలంభిస్తోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ కూడా ఇదే. కేంద్రంలో ప్రధాని మోదీ, హోంశాఖా మంత్రి అమిత్ షాతో సత్సంబంధాలనే నెరుపుతారు. అదే సమయంలో రాష్ట్రంలో బీజేపీతో మాత్రం రాజకీయ యుద్ధం చేస్తారు. దీనికి కూడా కారణాలు ఉన్నాయి. రాష్ట్రం ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఆర్థిక పరిస్థితి తలకిందులైంది. ఇలాంటి సమయంలో కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగితే ఇబ్బందే. అందుకే తమ నాయకుడి మతం గురించి ప్రస్తావన వచ్చినా తాము దానికి తగ్గట్టే కౌంటర్లు ఇస్తామంటున్నారు ఆ పార్టీ నేతలు. బీజేపీతో జట్టు కట్టకపోయినా.. జగన్ మాత్రం మోదీతో వ్యక్తిగత సంబంధాలను కాపాడుకుంటూ ఉంటారని అంటున్నారు. అందులోనూ యూపీ ఎన్నికల ఫలితాల తరువాత ఈ బంధాన్ని మరింత దృఢంగా చేసుకునేలానే ఉన్నాయి జగన్ వ్యూహాలు.

నిన్న మొన్నటివరకు బీజేపీకి అనుకూలంగా ఉన్న టీఆర్ఎస్ ఇప్పుడు దానిపై కయ్యిమంటోంది. ధాన్యం కొనుగోలు మొదలు.. అన్ని అంశాలపైనా కస్సుబుస్సులాడుతోంది. ఇంకా బీజేపీని ఇరకాటంలోకి పెట్టడానికి ప్రశాంత్ కిషోర్ లాంటి రాజకీయ వ్యూహకర్తల సేవలను ఉపయోగించుకుంటోంది. రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా.. కేంద్రం తనవంతు వాటాను రాష్ట్రాలకు ఇవ్వాల్సిందే. కానీ అది సక్రమంగా జరగడం లేదన్నది కేసీఆర్ వాదన. అందుకే రాష్ట్ర పరిధిలో సమస్యలతోపాటు.. జాతీయస్థాయిలో సమస్యలపైనా బీజేపీపై సమరశంఖం పూరించారు. కానీ యూపీ ఫలితాల తరువాత ఈ ధోరణిని ఎన్నాళ్లూ కంటిన్యూ చేస్తారో చూడాలి.

తమిళనాట అధికారంలో ఉన్న డీఎంకే మాత్రం.. బీజేపీ రాజకీయ అస్త్రాలపై ఫోకస్ పెట్టింది. తమ నాయకులను ఇబ్బంది పెట్టడానికి దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తుందని భావిస్తోంది. అదే సమయంలో అన్నాడీఎంకే రాష్ట్రంలో బాగా బలహీనపడడంతో.. తాను ప్రధాన ప్రతిపక్షంగా ఎదగడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. అందుకే డీఎంకే వ్యతిరేక ఓటును క్యాష్ చేసుకునేలా పావులు కదుపుతోంది. కానీ ఉత్తరాది పార్టీగా ముద్ర ఉన్న బీజేపీకి తమిళనాడులో ఆదరణ దక్కదంటున్నాయి డీఎంకే వర్గాలు. జీఎస్టీలో తమకు రావలసిన వాటాను కేంద్రం ఇవ్వాల్సిందే అని డీఎంకే ప్రభుత్వం కోరుకుంటోంది. అది కేంద్రం బాధ్యత అని గుర్తుచేస్తోంది. తమ పాలసీ ప్రకారం.. బీజేపీ మతపరమైన రాజకీయ విధానాన్ని వ్యతిరేకిస్తామంది. అందుకే బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తూనే ఉంటామంది. ఎన్నికల ఫలితాలు తమ విధానాలను మార్చలేవని ఘంటాపథంగా చెప్పింది.

మొత్తానికి ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలు తరువాత.. దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీల విధానాల్లో మార్పొచ్చినట్టే కనిపిస్తోంది. పైకి ఒకటి చెప్పినా.. లోపలం మాత్రం.. బీజేపీతో లొల్లి పెట్టుకోకపోవడమే మంచిది అన్న అభిప్రాయంతో కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.