Shoebullah Khan: ఒక జర్నలిస్టు హత్య.. నెహ్రూను ఆలోచింపజేసింది .. నిజాం పీఠాన్ని కూల్చేసింది!!

ప్టెంబర్ 17న బీజేపీ నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవం కావచ్చు.. టీఆర్ఎస్ , మజ్లిస్ నిర్వహించిన జాతీయ సమైక్యతా దినోత్సవం కావచ్చు.

  • Written By:
  • Updated On - September 19, 2022 / 03:27 PM IST

సెప్టెంబర్ 17న బీజేపీ నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవం కావచ్చు.. టీఆర్ఎస్ , మజ్లిస్ నిర్వహించిన జాతీయ సమైక్యతా దినోత్సవం కావచ్చు.. పేరు ఏదైనా సరే ఆ రోజున తెలంగాణ ప్రజలంతా తప్పకుండా స్మరించుకోవాల్సిన మహనీయులు ఎందరో ఉన్నారు. వారిలో అత్యంత ముఖ్యుడు జర్నలిస్టు షోయబుల్లా ఖాన్. ఆయనపై ప్రత్యేక కథనమిది.

భారత ప్రభుత్వంలో హైదరాబాద్ సంస్థానాన్ని కలిపేయాలంటూ అక్షర పోరాటం చేసిన స్వాతంత్ర్య సమరయోధుడు షోయబుల్లా ఖాన్.

నిజాంకు వ్యతిరేకంగా,ఖాసిం రజ్వీ దురాగతాల్ని ఖండిస్తూ కలం బలాన్ని చూపిన యోధుడు షోయబుల్లా ఖాన్.

హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేయాలని సిఫార్సు చేస్తూ నిజాం రాజుకు
ఏడుగురు ముస్లిం పెద్దలు విజ్ఞాపన పత్రం సమర్పించారు. ఈ పత్రాన్ని షోయబుల్లా ఖాన్ తన ఉర్దూ దినపత్రిక “ఇమ్రోజ్” లో యథాతథంగా ప్రచురించారు.

ఈ ప్రకటనాంశాన్ని భారత ప్రభుత్వం ఐక్యరాజ్యసమితిలో ఉపయోగించుకుంటుందేమోనని నిజాం నవాబు భయపడ్డాడు.

షోయబుల్లా ఖాన్ ఇంటికి వెళ్లే దారిలో కాపు కాసిన నిజాం రజాకార్లు.. ఆయనను అడ్డుకొని దారుణంగా హత్య చేశారు. 28 సంవత్సరాల చిన్న వయస్సులో నిజాం రజాకార్ల అరాచకానికి షోయబుల్లా ఖాన్ అమరుడయ్యాడు.

ప్రధాని నెహ్రూ సైతం..

ఈ క్రూర హత్య ఘటన గురించి నాడు అన్ని ప్రముఖ జాతీయ పత్రికలలో వార్త ప్రచురితం అయింది.దీనిపై అప్పట్లో దేశ మొదటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రు కూడా స్పందించారు. ఒక సంతాప సందేశాన్ని విడుదల చేశారు. హత్యల సంస్కృతిని నెహ్రూ ఆనాడు తీవ్రంగా ఖండించారు.
షోయబుల్లా ఖాన్ హత్య 1948 సంవత్సరం ఆగస్టు 21న జరిగింది.
ఈ అంశంపై 1948 సెప్టెంబర్ 7న భారత రాజ్యాంగ సభలో ప్రధాని నెహ్రూ ప్రసంగించారు. “హైదరాబాద్ అరాచకం లో మునిగిపోయింది. ఈనేపథ్యంలో సైనిక చర్య తప్పేలా లేదు” అని నెహ్రూ స్పష్టం చేశారు. ఈ కామెంట్ చేసిన 6 రోజుల తర్వాత హైదరాబాద్ సంస్థానం పై భారత సైన్యం మిలిటరీ యాక్షన్ మొదలైంది. విజయవంతమైంది. ఈరకంగా ఒక ఉర్దూ జర్నలిస్టు హత్య ఘటన ఇండియా లో హైదరాబాద్ విలీనానికి ప్రేరణ కలిగించింది. బాటలు వేసింది.

నిజాంకు దడ పుట్టించే న్యూస్ స్టోరీస్

* షోయబుల్లాఖాన్‌ పూర్వీకులది
ఉత్తరప్రదేశ్‌. వీరి కుటుంబం యూపీ నుంచి నిజాం ప్రాంతానికి వలస వచ్చింది. ఖమ్మం జిల్లా సుబ్రవేడ్‌లో 1920 అక్టోబర్‌ 17న హబీబుల్లాఖాన్, లాయహున్నీసా బేగం దంపతులకు షోయబుల్లాఖాన్‌ జన్మించారు.

* షోయెబుల్లా ఖాన్ విద్యాభ్యాసం పూర్తిచేసుకున్నాక జర్నలిజం లోకి అడుగు పెట్టారు.

* ఆయన జర్నలిజం ప్రయాణం “తాజ్వీ” పత్రికలో ప్రారంభమైంది. నిజాం నిరంకుశత్వాన్ని వ్యతిరేకిస్తూ.. ఖాసిం రజ్వీ దురాగతాల్ని ఖండిస్తూ విశ్లేషణాత్మక కథనాలను షోయెబుల్లా ఖాన్
ఇందులో రాశారు.
* షోయెబుల్లా ఖాన్ కథనాల్ని ప్రచురిస్తున్న కారణంగా నిజాం ప్రభుత్వం తాజ్వీ పత్రికను నిషేధించింది.
* దీంతో నగలు నట్రా అమ్మి బూర్గుల రామకృష్ణారావు,
కాంగ్రెస్‌ నాయకుడు ముందుముల నరసింగరావు సహాయంతో హైదరాబాద్‌లోని కాచిగూడలో ఇమ్రోజ్‌ అనే ఉర్దూ పత్రికను షోయబ్‌ స్థాపించారు. దానికి సంపాదకునిగా బాధ్యతలు తీసుకున్నారు.
* ఇమ్రోజు పత్రిక కూడా నిజాం నిరంకుశత్వాన్ని విధానపరంగా విభేదించింది.
* రయ్యత్ పత్రికలోనూ నిజాం ప్రభుత్వం అమలుచేస్తున్న దమనకాండ, ప్రజాఉద్యమాన్ని అణచివేసేందుకు రజ్వీని ఉసిగొలుపుతున్న పద్ధతులను వ్యతిరేకిస్తూ కథనాలు రాశారు షోయెబుల్లా ఖాన్. దీంతో ఆ పత్రికపై కూడా నిజాం ప్రభుత్వం వేటు వేసింది.

క్రూరంగా హత్య..

1948 సంవత్సరం ఆగస్టు 21న కాచిగూడ రైల్వే స్టేషన్‌లోని ఇమ్రోజ్‌ పత్రిక ఆఫీస్‌ నుంచి అర్ధరాత్రి తన బావమరిది ఇస్మాయిల్‌ఖాన్‌తో కలిసి షోయెబుల్లా ఖాన్ ఇంటికి బయలుదేరారు. ఈక్రమంలో చప్పల్‌బజార్‌ రోడ్డులో రజాకార్లు అతిక్రూరంగా చేతిని నరికి, తుపాకులతో బుల్లెట్ల వర్షం కురిపించారు.  అడ్డుకోబోయిన తన బావమరిది చేతులు సైతం నరికేశారు. రక్తపు మడుగులో విలవిల్లాడుతూ 1948 ఆగస్టు 22వ తేదీన తెల్లవారు జామున షోయబ్‌ తుదిశ్వాస విడిచారు.

షోయబుల్లా ఖాన్ పై మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కామెంట్స్..

“రజాకార్లు పాక్‌ వెళ్లిపోయారు.
సెప్టెంబరు 17ను మజ్లిస్‌ ఏనాడూ వ్యతిరేకించలేదు. హైదరాబాద్‌ సంస్థానం విలీనానికి మౌల్వీ అల్లావుద్దీన్‌, తుర్రేబాజ్‌ ఖాన్‌, జర్నలిస్ట్‌ షోయబుల్లా ఖాన్‌ చేసిన వీరోచిత పోరాటాన్ని విస్మరించవద్దు. వలసవాదం, భూస్వామ్యవాదం, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా హైదరాబాద్‌ సంస్థాన ప్రజలు వీరోచిత పోరాటం చేశారు. హిందూ-ముస్లింలు కలిసి పోరాడారు. అయితే, ఇది హైదరాబాద్‌ భూభాగ విముక్తికి జరిపిన పోరాటం కాదు. అప్పట్లో ప్రజలపై దాడులకు పాల్పడిన రజాకార్లు ఆ వెంటనే పాకిస్థాన్‌కు వెళ్లిపోయారు. భారత్‌లో భాగం కావాలని కోరుకున్నవారంతా ఇక్కడే ఉండిపోయారు. హైదరాబాద్‌ చరిత్రను అర్థం చేసుకోవాలి.. నిజాం పాలనలో ఉన్న ప్రాంతాల విలీనం ప్రజల మద్దతుతోనే సాధ్యమైంది” అని మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల సెప్టెంబర్17న కామెంట్స్ చేశారు.