Yelavarthy Nayudamma: స్ఫూర్తిదాయ‌కం `నాయుడ‌మ్మ‌` జీవ‌న‌గ‌మ‌నం

నేటి యువ తరానికి దార్శనికుడు నాయుడమ్మ. ఆయ‌న సేవ‌లు, భావాలు, విజ‌యాలు, న‌డ‌వ‌డిక గురించి తెలుసుకోవ‌డం ప్ర‌స్తుత స‌మాజానికి ఎంతో మేలు చేస్తుంది.

  • Written By:
  • Publish Date - September 10, 2022 / 04:03 PM IST

నేటి యువ తరానికి దార్శనికుడు నాయుడమ్మ. ఆయ‌న సేవ‌లు, భావాలు, విజ‌యాలు, న‌డ‌వ‌డిక గురించి తెలుసుకోవ‌డం ప్ర‌స్తుత స‌మాజానికి ఎంతో మేలు చేస్తుంది. స‌మాజానికి నాయుడమ్మ చేసిన సేవ‌ గురించి ఎంత తెల్సుకున్నా తక్కువే అవుతుంది. కులం పేరుతో మేధావుల‌ను కూడా బ‌జారుకీడ్చుతున్న ప‌ర‌మ‌నీచ సంస్కృతి ప్ర‌భ‌లుతోన్న ప్ర‌స్తుతం త‌రుణంలో ఈ వ్యాసం యువ‌త‌కు స్పూర్తినిస్తుంద‌న‌డంలో సందేహం లేదు.

నాయుడ‌మ్మ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ లో BSc చేసారు. అక్క‌డి. విద్యార్ధి ఉద్యమాల్లో ఎర్ర జండాలు పట్టుకుని నడిచారు. ఆయన మద్రాసు వచ్చి `లా` కోర్సులో చేరాడు. ఆ చదువు ఇష్ఠం లేక పది రోజుల్లోనే మానేశారు. అప్పుడే మద్రాసు లెదర్ టెక్నాలజీ సంస్థ డైరెక్టర్ కాట్రగడ్డ శేషాచలం తో ఆయ‌న‌కు పరిచయం ఏర్పడింది. నాయుడమ్మ ఉన్నత చదువు చదివారని తెల్సుకుని తమ సంస్థ లో కెమిస్ట్రీ డెమానిస్ట్రేటర్ గా 17 రూ.ల జీతంతో ఉద్యోగ మిచ్చారు. ఆ శేషాచలం ద్వారానే ఉద్యో గానికి సెలవు పెట్టి బ్రిటన్ వెళ్ళారు. అక్కడి నుంచి అమెరికా వెళ్ళి PHd చేసి తిరిగి వచ్చారు. ఈ క్రమంలో అయ్యే ఖ‌ర్చును అలవెన్స్ రూపంలో శేషాచలం సర్ధుబాటు చేసి పెద్ద మ‌న‌సు చాటుకున్నారు.

అమెరికా లీ హోం విశ్వవిధ్యాలయం లో నాయుడమ్మ, వసంత్ పండిట్ ఒకేసారి MS చేసారు. ప్రధాని నెహ్రూ చెల్లెలు విజయలక్ష్మీ పండిట్ కుమారుడే ఈ వసంత్ పండిట్. అమెరికా లో రాయబారిగా ఉన్న విజయలక్ష్మి పరిచయం వల్ల 35వ ఏడాది వ‌చ్చేట‌ప్ప‌టికి CLRI డైరెక్టర్ గా నాయుడమ్మ నియామకాన్ని నెహ్రూ ఖరారు చేసారు. ఆ తరు వాత అధికారంలోకి వచ్చిన ఇందిర CSIR డైరక్టర్ జనరల్ గా నియమించారు. అది చాలా పెద్ద ఉద్యోగం. చాలా మంది ఆశించే ఆ పోస్ట్ ను కూడా రెండు కండిష‌న్లతో ఆయ‌న చేరార‌ట‌. ఆ కండిష‌న్ల‌లో మొద‌టిది ఈ ఉద్యోగంలో కేవలం 5 సంవత్స‌రాలు మాత్రమే పని చేస్తానని నాయుడ‌మ్మ అన్నార‌ట‌. రెండవది వివిధ అంతర్జాతీయ సంస్థలకు సలహాదారునిగా ఉన్నందు వల్ల , వాటి కొరకు ప్రతి సంవ‌త్స‌రం మూడు వారాలు విదేశాలకు వెళ్ళేందుకు అనుమతి ఇవ్వా లని ష‌ర‌తు పెట్టారట‌. ఆయ‌న పెట్టిన కండీష‌న్ల‌ను విన్న ఇందిర అవాక్కు అయ్యార‌ని ఆనాడున్న వాళ్లు చెబుతారు.

`ఈయనెవరయ్యా బాబు , నాకే షరతులు పెడుతున్నాడు అని సైన్స్ – టెక్నాలజీ మంత్రిని పిలిపించి అడిగింది . కారణం ఆ పదవికి సిపార్సు చేసింది దక్షిణాది మంత్రి కాబట్టి. ఆ మంత్రి ఎవరో కాదు, ఒక‌ప్పుడు నాయ‌డ‌మ్మ‌ను మహిళగా భావించిన సి. సుబ్రమణ్యం. ఆ పదవికి ఆయన మాత్రమే అర్హుడని పట్టుబడడంతో ఇందిర ఆమోదించ వల్సి వచ్చింది. ఆ త‌రువాత సుబ్ర హ్మణ్యం లోక్ సభకు ఎన్నికై కేంద్ర సైన్స్ & టెక్నాలజీ మంత్రి అయ్యారు. కాల‌క్ర‌మంలో వ్యవసాయ, ఆర్ధిక, రక్షణ శాఖలు కూడా నిర్వహించారు. ఆయన హయాంలోనే హరిత విప్లవం భార‌త దేశంలో ఊపందుకుంది. ఆయ‌న‌`భారతరత్న` అవార్డును కూడా అందుకున్నారు.

నాయుడమ్మ పేరు విన‌గానే చాలా మంది ఒక మహిళ పేరు అని అనుకునే వారు. 1957 లో తమిళనాడు సచివాలయం లో CLRI డైరె క్టర్ హోదాలో అప్పటి మంత్రి చిదంబరం సుబ్రహ్మణ్యంను మర్యాద పూర్వకంగా కలవాలని మంత్రి పేషీ నుంచి అనుమతి తీసుకుని నాయుడ‌మ్మ వెళ్లారు. సెక్ర‌ట‌రీ వెళ్ళి నాయుడమ్మ వ‌చ్చార‌ని మంత్రి సుబ్ర‌మ‌ణ్యంకు చెప్పగా కొద్ది సేపు తరువాత పంపించు అని చెప్పి గబగబా వాష్ రూం కు వెళ్ళి మొఖం కడిగి, తల దువ్వి , పౌడర్ అద్ది బెల్ నొక్కి కమిన్ అన్నార‌ట‌. తీరా, నాయుడమ్మ లోనికి వెళితే చూసి నోరు వెళ్ళ బెట్టి ఎగా , దిగా చూసి సదరు మంత్రి వర్యులు నవ్వుకున్నార‌ట‌. ఇదే విషయాన్ని CLRI సమావేశం లో నాయుడమ్మ సమక్షం లోనే అందరికీ ఈ విషయం చెప్పి నవ్వులు పూయించారు ఆ మంత్రి. `1977 నవంబర్ లో ఒక సమావేశంలో నాయుడమ్మ అంటే మహిళ అని మీరంతా ఊహించుకుని ఉంటారు . మన్నించండి, మిమ్మల్ని నిరాశ పరచాను కదూ అంటూ ప్రసంగం మొదలు పెట్టారు.

అందుకే సమావేశ ప్రారంభంలో నన్ను నాయుడమ్మ అంటారండి అని పరిచయం చేసుకునేవార‌ట . నాయుడమ్మ తర చుగా ఒక మాట అంటూ ఉండే వారు. ఒక వ్యక్తిని గ్రామం నుంచి బైటకు తీసుకు వెళ్ళవచ్చు. కానీ ఆ వ్యక్తి లోని గ్రామాన్ని మాత్రం ఎన్నటికీ తీసివేయ లేమ‌ని చెప్పేవారు. నాయుడమ్మ రైలులో కిటికీ ప్రక్కనే కూర్చుని పంట చేలను , గ్రామా లను చూస్తూ నిడుబ్రోలు వచ్చే వారు. అక్కడి నుంచి జట్కా బండిలో కూర్చుని ఆ పంట చేల‌ను చూస్తూ `ఇంటూరు` తన చెల్లెలు వద్దకు వెళ్ళి ఒక రోజు గడిపి , ఆ తరువాత కాలి నడకన 3 కి. మీ నడుచు కుంటూ యలమర్రు చేరేవారట‌. చెట్లు ,చేల మధ్య‌ పంచె కట్టు కుని తిరుగుతూ, గ్రామంలో అందరితో కల్సి కూర్చుని కబుర్లు చెబుతూ కొంత సమయాన్ని గడిపేవారు. నేను పుట్టుకతో రైతును, వృత్తిరిత్యా అంటరాని వాణ్ణి అనే వారు. దానికీ ఒక కారణం లేక‌పోలేదు.
CLRI డిప్యూటీ డైరెక్టర్ గా ఉన్నప్పుడు చాలా పెద్ద పెద్ద వారితో పరిచయాలు ఉండేవి. అలా ఒకసారి తమిళనాడు గవర్నర్ తో సమావేశం కావాల్సి వచ్చింది. తోలు పరిశ్రమ,చర్మ కారులతో అతి దగ్గరగా నాయుడమ్మ మసలేవారు. అది చూసిన‌ గవర్నర్ నాయుడ‌మ్మ‌ కులం పై ఒక అవగాహనలో ఉన్నాడు. కుతూహలం కొద్దీ, ఉండబట్టలేక ఒక రోజు తానే ఫోన్ చేసి మీ కులం తెలుసుకో వచ్చునా అని అడిగితే దానికి నాయుడమ్మ నేను వృత్తిరీత్యా అంటరాని వాడిని అని చెప్పడం జరిగింది. సత్యసాయి భక్తుడైన ఒక శాస్త్రవేత్త నాయు డమ్మ ను తీసుకుని పుట్టపర్తి వెళ్ళాడు. శూన్యం నుండీ వీభూది తీసి అందిస్తుంటే నాయుడమ్మ నమస్కరించి వీబూది బదులు పచ్చని గడ్డి మొలకను మొలిపించండి స్వామీ అన్నాడట. సాయి అనుచరులు వెంట‌నే ఇక్కడి నుండీ వెళ్ళిపొమ్మని పంపించి వేసారు. వీబూదికి బదులు గుమ్మడి కాయ సృష్ఠిస్తే నేనూ ఆయన భక్తునిగా మారిపోయే వాడిని అనేవారు నాయుడమ్మ. మూఢ నమ్మ కాల వ్యతిరేకి నాయుడమ్మ. శాస్త్రాలు ,మూఢనమ్మకాలపై వ్యాసాలు కూడా రాసారు. ఇదే విషయం పై శాస్త్రవేత్తలను కూడా హెచ్చరించే వారు. సైన్స్ – అద్భుతాలు ఒక ఒరలో ఇమడవు. కాలం చెల్లిన విలువలు, అపోహలు, మూఢ విశ్వాసాలను భారత శాస్త్రవేత్తలు విడనాడాలి, నిరశించాలి. విజ్ఞానం , హేతువాదం ప్రజల ఆలోచన లకు మూలం కావాలి. ఆ దిశగా సమాజ మార్పుకు కృషి చెయ్యాలి అని సూచించారు.

ఇందిర , NTR లకు సలహా దారునిగా పనిచేసారు. ఇద్దరికీ నమ్మకస్తుడు. CSIR కు డీజీ గా ఆరు సంవ‌త్స‌రాలు పని చేసాక ఆ పదవి నుంచి తప్పుకోవాలని అనుకున్నాడు. కానీ, ఇందిర ఎమర్జన్సీ ప్రకటించి ఉండడంతో ఆ కార‌ణంగా తప్పుకున్నాడ‌ని ఇందిర అపోహ పడుతార‌ని మరికొంత కాలం పొడిగించుకున్నారు. 1977 లో ఇందిర అధికారం కోల్పోయి ఉంది. కంచికామకోటి పీఠాధిపతి చంద్రశేఖర సరస్వతిని కలిసేడప్పుడు నమ్మకస్తునిగా భావించి ఇందిర నాయుడమ్మను వెంట తీసుకు వెళ్ళింది. నాయుడమ్మ మరణించినప్పుడు రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నారు. నాయుడుమరణ వార్త విన్న ఆయ‌న భార్య పవనాభాయి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. అది తెల్సుకున్న రాజీవ్ గాంధీ వెంట‌నే ఆమెను మెరుగైన చికిత్సకు ఆదేశాలు జారీ చేసాడు. ఆమె ఆరోగ్యం గురించి తరచూ వాకబు చేస్తూ ఉండే వార‌ట‌. అలా నెహ్రూ కుటుంబంతో మూడు తరాల స్నేహం ఏర్పడింది.

జలగం వెంగళ రావు , NTR వరకూ ప్రభుత్వ సలహా దారునిగా పని చేసారు. వీరికి వ్యక్తిగత సలహాలు కూడా ఇచ్చేవాడని అంటారు. NTR అమెరికా 1985 జూలై లో వెళ్ళినప్పుడు నాయుడమ్మ ఆయ‌న వెంట ఉన్నారు. ఇందిర , NTR గొడవలు తెల్సిన నాయుడమ్మ NTR తో అమెరికాలో అంతర్జాతీయ వేదికపై ప్రధానిని విమర్శించ వద్దని సలహా ఇచ్చాడని చెబుతారు. ఆ సలహాను పాటించిన ఎన్టీఆర్` నేను మా రాష్ట్రానికి Cm ను , ఆమె దేశానికి ప్రధాని` విధాన పర విభేదాలు ఉన్నా, జాతీయ ప్రయోజనాల విషయంలో మా మధ్య‌ అభిప్రాయ భేదాలు లేవని చెప్పడం జరిగిందట‌. అంత‌టి బ‌హుముఖ‌ప్ర‌జ్ఞాశాలి నాయుడ‌మ్మ‌. ఆయ‌న జీవితం నేటి త‌రానికి స్పూర్తిదాయకం.