కర్ణాటకలో ఐఏఎస్, ఐపీఎస్‌ల (IPS Vs IAS) మధ్య తీవ్ర పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇద్దరికే పరిమితమైన ఈ ఇష్యూ రాష్ట్రవ్యాప్తంగా చర్చకు రావడం చర్చనీయాంశమవుతోంది. అటు ఐఎఎస్, ఇటు ఐపీఎస్ తగ్గేదేలే అంటూ వ్యక్తిగత ఫొటోలను సైతం సోషల్ మీడియా (Social media)లో పోస్ట్ చేస్తూ తీవ్ర విమర్శల పాలయ్యారు. ఈ లేడీ ఆఫీసర్స్ పై ప్రభుత్వ అధికారులే కాకుండా, రాజకీయ నాయకులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కర్ణాటక హోంమంత్రి హెచ్చరించారు.
ప్రస్తుతం రాష్ట్ర హిందూ మత, ధర్మాదాయ శాఖ కమిషనర్‌గా ఉన్న ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి (Sindhuri), కర్ణాటక హస్తకళల అభివృద్ధి సంస్థ ఐజీపీ, ఎండీగా పనిచేసి రాష్ట్రపతి బంగారు పతకం అందుకున్న ఐపీఎస్ అధికారిణి డి. రూప మౌద్గిల్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. జరుగుతున్న పరిణామాలపై ప్రభుత్వం కళ్లు మూసుకోవడం లేదని మంత్రి అన్నారు. ‘‘అమర్యాదగా ప్రవర్తించడం పెద్ద నేరం. వ్యక్తిగత విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మీడియా ముందు ఆయన చేసిన చర్యలు కూడా తప్పే. ప్రజలు తనను దేవతగా భావించి పూజిస్తారని తెలిపారు. అధికారుల తీరు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. తమ ప్రవర్తనతో మంచి అధికారులను అగౌరవ పరుస్తున్నారన్నారు. మానవీయ భావాలు లేని వారు ఇలాంటి చర్యలకు పాల్పడవచ్చు. నేను ముఖ్యమంత్రి (CM) బసవరాజ్ బొమ్మై, డి.జి.తో మాట్లాడాను. నిబంధనల ప్రకారం చర్యలు ప్రారంభిస్తాం’’ అని ఘాటుగా రియాక్ట్ అయ్యారు.
ఐఏఎస్ సింధూరికి చెందిన కొన్ని ఫోటోలను ఐపీఎస్ రూప (IPS Vs IAS) తన ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. ముగ్గురు ఐఏఎస్ మేల్ ఆఫీసర్లకు సింధూరి తన ఫోటోలను పంపి సర్వీస్ రూల్స్‌ను బ్రేక్ చేసినట్లు రూప తన పోస్టులో ఆరోపించింది. సింధూరిపై అవినీతి ఆరోపణలు ఉన్నట్లు కూడా రూప తన పోస్టులో పేర్కొన్నది. దీనిపై కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మైకు, సీఎస్ వందితా శర్మకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నది. ఐపీఎస్ రూప ప్రవర్తనతో చిరాకుకు గురైన ఐఏఎస్ సిందూరి ఆదివారం ఓ ప్రకటన జారీ చేసింది. తనపై (Personal) వ్యక్తిగతంగా, తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు సింధూరి ఆరోపించింది. తన వాట్సాప్‌లోని స్క్రీన్‌షాట్లను తీసి, సోషల్ మీడియాలో ఉన్న ఫోటోలను తీసి.. తనను డీఫేమ్ చేసేందుకు రూప ప్రయత్నించినట్లు సింధూరి ఆరోపించారు. ఐపీఎస్ రూప మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు ఐఏఎస్ సింధూరి ఆరోపించారు. ఆమె వెంటనే కౌన్సిలింగ్, చికిత్స తీసుకోవాలన్న సూచన చేశారు.
ఇటీవల ఐఏఎస్ సింధూరి.. జనతాదళ్ ఎమ్మెల్యే సారా మహేశ్‌తో కలిసి ఓ రెస్టారెంట్‌లో కూర్చున్న ఫోటో వైరల్ అయ్యింది. నిజానికి ఆ ఇద్దరూ తరుచూ అవినీతి ఆరోపణలు చేసుకున్నారు. మైసూరులో కమిషనర్‌గా ఉన్న సమయంలో ఆ ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. ఈనేపథ్యంలో ఐపీఎస్ రూప ప్రశ్నలు సంధించింది. ఓ రాజకీయవేత్తతో ఐఏఎస్ సింధూరి ఎందుకు కలిసిందని, ఆ ఇద్దరి మధ్య ఏదో డీల్ కుదిరినట్లు రూప ఆరోపించింది. ఆ ఆరోపణలను సింధూరి కొట్టిపారేశారు. అయితే ధైర్యం, సమర్ధతకు పేరుగాంచిన ఇద్దరు అధికారులకూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో ఇద్దరు అధికారుల అభిమానుల మధ్య కూడా గొడవ తీవ్రస్థాయిలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో కర్ణాటక హోంమంత్రి రియాక్ట్ కావడం, ఈ ఇష్యూ (IPS Vs IAS) రాష్ట్ర ముఖ్యమంత్రికి వెళ్లే అవకాశాలున్నాయి.
Also Read: BJP Challenges AIMIM: ఒంటరి పోరుకు బీజేపీ సిద్ధం.. MIMకు ‘బండి’ ఛాలెంజ్!