Ranil Wickremesinghe : రణిల్ “రాజపక్షం” కాదు.. ప్రజా పక్షం వహిస్తేనే లంకా దహనానికి ఫుల్ స్టాప్!

గొటబాయ రాజపక్స సింగపూర్ కు పరారయ్యారు. శ్రీలంకకు కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమ సింఘే ఎన్నికయ్యారు. ఇంతటితో శ్రీలంక సంక్షోభానికి శుభం కార్డు పడ్డట్టేనా ? అంటే "కాదు" అని బల్లగుద్ది చెప్పొచ్చు.

  • Written By:
  • Publish Date - July 22, 2022 / 10:54 AM IST

గొటబాయ రాజపక్స సింగపూర్ కు పరారయ్యారు. శ్రీలంకకు కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమ సింఘే ఎన్నికయ్యారు. ఇంతటితో శ్రీలంక సంక్షోభానికి శుభం కార్డు పడ్డట్టేనా ? అంటే “కాదు” అని బల్లగుద్ది చెప్పొచ్చు. కొత్త అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన రణిల్ విక్రమ సింఘే దార్శనికత, సమయ స్పూర్తితో వ్యవహరించి ఆర్ధిక సంక్షోభ నివారణ చర్యలు చేపట్టడం తక్షణ అవసరం. ఒకవేళ ఆ దిశగా రణిల్ అడుగులు వేయకుంటే.. లంక సంక్షోభం మరింత తీవ్రమయ్యే ముప్పు ఉంటుంది. అదే జరిగితే గొటబాయ రాజపక్సకు పట్టిన గతే రణిల్ కూడా పట్టే అవకాశాలు ఉంటాయి.

చాలా సవాళ్లు.. చేదు ప్రశ్నలు

కొత్త అధ్యక్షుడు రణిల్ ముందు ప్రస్తుతం చాలా సవాళ్లు ఉన్నాయి. ఒకవైపు ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించడంతోపాటు మరోవైపు శాంతి భద్రతలను పునరుద్ధరించాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. అయితే రణిల్ అధ్యక్ష పదవికి ఎన్నికైన తీరు వల్ల ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. సింగపూర్ కు పారిపోయిన గొటబాయ రాజపక్స కుటుంబానికి చెందిన ఎస్ఎల్‌పీపీ పార్టీ మద్దతు వల్లే రణిల్ అధ్యక్షుడు అయ్యారు. ఆ పార్టీ మద్దతు లేకుంటే రణిల్ కు అధ్యక్ష పదవి దక్కడం అసాధ్యం. ఎందుకంటే.. రణిల్ కు చెందిన యునైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్‌పీ)లో ఆయన ఒక్కరే ఎంపీ!! ఒక్క ఎంపీ సీటు కలిగిన రణిల్.. 225 సీట్లున్న శ్రీలంక పార్లమెంటులో 134 మంది ఎంపీల మద్దతు కూడగట్టడం పెద్ద మిరాకిల్. అయితే ఈ మిరాకిల్ ను తెరచాటు నుంచి చేయించింది ఎవరు ? రాజపక్స కు చెందిన రాజకీయ పార్టీ రణిల్ కే మద్దతు ఎందుకు ఇచ్చింది ? అనే చేదు ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది. ఈ సమాధానాల ఆధారంగానే రణిల్ రాజకీయ నిబద్ధత పై ఒక అంచనాకు రాగలుగుతాం.

రాజపక్ష కుటుంబంతో సన్నిహిత సంబంధాలపై..

రణిల్ విక్రమసింఘేకు రాజపక్ష కుటుంబంతో ఉన్న సన్నిహిత సంబంధాలపై ఇటీవల ఆందోళనల్లో పాల్గొన్న ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.తమ నిరసనలు కొనసాగుతాయని ఇప్పటికే పలు సంఘాలు స్పష్టం చేశాయి. “శ్రీలంకలో సంక్షోభ పరిస్థితులకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాను” అని విక్రమసింఘే ఇప్పటికే ప్రకటించారు. అయితే, ఈ సంక్షోభంలో ప్రధాన పాత్ర రాజపక్స కుటుంబానిదే. ఈ విషయంలో రణిల్ విక్రమసింఘే ఏమీ చేయట్లేదు .. ఏమీ చేయరు అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈనేపథ్యంలో మరో రెండేళ్ల పదవీ కాలాన్ని సాఫీగా పూర్తి చేయడం రణిల్ కు పెద్ద సవాలే అవుతుంది.ఆరుసార్లు విక్రమసింఘే ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, ఒక్కసారి కూడా పూర్తికాలం కొనసాగలేదు. చివరిసారిగా గత మే నెలలో ఆయన ప్రధాన మంత్రిగా ప్రమాణం చేశారు. నిరసనల నడుమ మహింద రాజపక్స ఈ పదవికి రాజీనామా చేయడంతో రాజపక్స కుటుంబం రణిల్‌కు ఆ పదవి అప్పగించింది. 1999, 2005 మధ్య రెండుసార్లు ఆయన అధ్యక్ష పదవికి పోటీచేసి ఓటమి పాలయ్యారు.2015లో రాజపక్ష కుటుంబం అధికారాన్ని కోల్పోయినప్పుడు ఈయన అండగా నిలిచారని చాలా మంది విశ్లేషకులు భావిస్తున్నారు.

విదేశీ రుణం, ఐఎంఎఫ్..

విదేశీ రుణం 51 బిలియన్‌ డాలర్లకుగాను జూన్‌లో చెల్లించాల్సిన 8.6 బిలియన్‌ డాలర్ల కిస్తీ చెల్లింపులో లంక సర్కార్‌ విఫలమైంది. ఐఎంఎఫ్‌, ఇతర సంస్థలు, దేశాలతో కొత్త రుణాల కోసం చేస్తున్న సంప్రదింపులు ఇంకా కొలిక్కి రాలేదు. ‘సార్థక ప్రజాస్వామిక పాలన’ను ప్రోత్సహించే పేరుతో అంతర్జాతీయ అభివృద్ధి కోసం పనిచేసే అమెరికా సంస్థ (యుఎస్‌ఎయిడ్‌) నుంచి నిధులు పొందేందుకు లంక అంగీకరించింది. గతంలో ఈ సహాయాలను పొందేందుకు చెప్పిన అభ్యంతరాలను పక్కన పెట్టింది. గొటాబయ సర్కారు అమెరికాతో చేసుకున్న ఒప్పందం పారదర్శకంగా లేదు. మంత్రివర్గం ముందు ప్రతిపాదనలు ఉంచటం తప్ప బహిరంగ పరచలేదు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ దేశానికి అమెరికా సాయం చేసినా షరతులు, దానికి ఆర్థిక లబ్ధి లేకుండా ఒప్పందాలు చేసుకోలేదు. తక్షణం సంక్షోభం నుంచి బయట పడేందుకు ఎలాంటి ప్రమాదకర షరతులు అంగీకరించారో అన్న అనుమానాలు ఉన్నాయి. ఐఎంఎఫ్‌తో జూన్‌ 30 నాటికి పది రోజుల పాటు చర్చలు ముగిశాయి. ఒప్పందం ఇంకా ఖరారు కాలేదు. ఈ లోగా లంకలో కొత్త రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఇవేవీ తేలకుండానే గొటాబయ పరారీ, ఇతర పరిణామాలు సంభవించాయి. వీటిని చక్కదిద్దాల్సిన బాధ్యత రణిల్ పై ఉంది.