Site icon HashtagU Telugu

Rahul Gandhi Vs PM Modi : ఇండియా బార్డర్ లో చైనా ఆక్రమణ.. లద్దాఖ్‌లో ఎవర్ని అడిగినా అదే చెబుతున్నారు : రాహుల్

Modi And Rahul

Modi And Rahul

Rahul Gandhi Vs PM Modi : దేశానికి చెందిన ఒక్క అంగుళం భూమిని కూడా చైనా తీసుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పిన మాటల్లో వాస్తవం లేదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. భారత భూభాగంలోకి చైనా ఆర్మీ ప్రవేశించిందన్న విషయాన్ని లేహ్‌లోని స్థానికులు తనతో చెప్పారని పేర్కొన్నారు. లద్దాఖ్‌లోని లేహ్‌లో పర్యటిస్తున్న రాహుల్.. బార్డర్ లోని పాంగాంగ్‌ సరస్సు ప్రాంతంలో మోటార్‌ సైకిల్‌ యాత్ర సందర్భంగా ఈ కామెంట్స్ చేశారు. గతంలో పశువుల మేతకు వినియోగించిన ప్రదేశానికి ఇప్పుడు వెళ్లలేకపోతున్నామని లేహ్‌ వాసులు తనతో చెప్పారని వివరించారు. ఒక్క అంగుళం కూడా మన భూమి కోల్పోలేదని ప్రధాని చెబుతున్న మాటలు వాస్తవం కాదని వారి మాటలతో స్పష్టంగా తెలుస్తోందన్నారు. లద్దాఖ్‌లో ఎవర్ని అడిగినా.. ఇదే విషయం చెబుతున్నారని రాహుల్‌ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన శివసేన (ఉద్ధవ్) నేత సంజయ్‌ రౌత్‌.. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందనడానికి ఇదే సరైన ఆధారమన్నారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి, రక్షణ మంత్రి అంగీకరించకపోతే దేశానికి అన్యాయం చేసినట్లేనన్నారు.

Also read : Narendra Modi: నరేంద్ర మోడీ ఒక్కరోజు హోటల్లో స్టే చేస్తే ఎంత చెల్లిస్తారో తెలుసా?

లేహ్ ప్రజలు ప్రజాప్రతినిధుల పాలన కోరుకుంటున్నారు..

మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ 79వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన రాహుల్‌.. ఆర్టికల్‌ 370 రద్దుపైనా (Rahul Gandhi Vs PM Modi) మాట్లాడారు. వీరికి కల్పించిన హోదాపై లేహ్‌ ప్రజలు సంతోషంగా లేరని.. దీనిపై స్థానికుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. వారు మరింత ప్రాతినిధ్యం కావాలని కోరుకుంటున్నారని.. నిరుద్యోగం కూడా ఆందోళకరమైన అంశమన్నారు. అధికారుల చేతుల్లో రాష్ట్రం నడవవద్దని.. ప్రజాప్రతినిధులతోనే పాలన సాగాలని ఇక్కడి ప్రజలు చెబుతున్నట్లు రాహుల్‌ వెల్లడించారు. భారత్‌ జోడో యాత్ర సమయంలోనే ఇక్కడ పర్యటించాలనుకున్నప్పటికీ అది సాధ్యపడలేదన్నారు. అందుకే ఈ ప్రాంతంలో ప్రస్తుతం పర్యటిస్తున్నానన్నారు. ఆగస్టు 25 వరకూ లేహ్‌లో పర్యటించనున్న రాహుల్‌ గాంధీ.. అక్కడ జరిగే ఓ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ను కూడా వీక్షిస్తారని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు తెలిపాయి. లద్దాఖ్‌ అటానమస్‌ హిల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ – కార్గిల్‌ ప్రాంతంలో కౌన్సిల్‌ ఎన్నికలు సెప్టెంబర్ 10న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పలువురితో రాహుల్‌ భేటీ కానున్నారు.

Also read : Congress Reshuffle : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోకి రఘువీరా రెడ్డి, సచిన్ పైలట్