జాతీయ భ‌ద్ర‌త ముసుగులో ఫోన్ల ట్యాపింగ్..పెగాసిస్ స్ట్రైవేర్ పై విచార‌ణ..సుప్రీం సీరియ‌స్‌

  • Written By:
  • Publish Date - October 27, 2021 / 04:40 PM IST

ఇజ్రాయిల్ స్పైవేర్ పెగాసెస్ తో ఫోన్ ట్యాప్ చేస్తోన్న నిర్వాకంపై సుప్రీం కోర్టు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. నిజాల‌ను నిగ్గు తేల్చ‌డానికి ముగ్గురు సభ్యుల‌తో కూడిన స్వ‌తంత్ర్య క‌మిటీని వేసింది. వ్య‌క్తుల ప్రాథ‌మిక హ‌క్కును కాల‌రాసేలా జ‌రుగుతోన్న ట్యాపింగ్ వ్య‌వ‌హారంకు జాతీయ భ‌ద్ర‌త అనే వాదాన్ని వినిపించ‌డాన్ని త‌ప్పుబ‌ట్టింది. భ‌ద్ర‌త నెపంతో రాష్ట్ర ప్ర‌భుత్వాలు ట్యాపింగ్ కు పాల్ప‌డ‌కూడ‌ద‌ని తేల్చి చెప్పింది. జాతీయ భ‌ద్ర‌త అంటూ పౌరుల‌కు ర‌క్ష‌ణ లేకుండా చేస్తూ మూగ‌ప్రేక్ష‌కుడి మాదిరిగా సుప్రీంకోర్టును మార్చే ప్ర‌య‌త్నం చేయొద్ద‌ని కేంద్ర‌, రాష్ట్రాల‌కు హిత‌వు ప‌లికింది.
అధికారంలో ఉన్న పార్టీలు ప్ర‌త్య‌ర్థుల ఫోన్ల‌ను ట్యాప్ చేయ‌డం స‌ర్వ‌సాధార‌ణంగా మారింది. ప‌లుమార్లు ఇదే అంశంపై దేశ వ్యాప్తంగా దుమారం రేగింది. ఇజ్రాయెల్ స్పైవేర్ పెగాసెస్ ను ఉప‌యోగించి ఈజీగా ప్ర‌త్య‌ర్థుల ఫోన్ల‌ను ట్యాప్ చేస్తున్నారు. ఆ విష‌యాన్ని ఇటీవ‌ల ఒక ప‌రిశోధ‌న సంస్థ బ‌య‌ట‌పెట్టింది. పౌరుల గోప్య‌త‌కు భంగం క‌లిగేలా ప్ర‌భుత్వాలు చేస్తోన్న ఫోన్ ట్యాపింగ్ మీద సామాజిక కార్య‌క‌ర్త‌లు, జ‌ర్న‌లిస్ట్ లు పిల్ పై సుప్రీం విచార‌ణ చేసింది.

జాతీయ భద్రతపై కేంద్రం చేసిన అభ్యర్థ‌న‌ల‌ను ధర్మాసనం తిరస్కరించింది. ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా మరియు వెటరన్ జర్నలిస్టులు ఎన్ రామ్ మరియు శశి కుమార్ దాఖలు చేసిన పిటిషన్లతో సహా అన్నింటిపైన విచారణ చేప‌ట్టిన సుప్రీం ఆ మేర‌కు నిర్ణ‌యం తీసుకుంది. జాతీయభ‌ద్ర‌త‌లోకి సుప్రీం రాకూడ‌ద‌ని తెలుసు. కానీ, పౌరుల ప్రాథ‌మిక హ‌క్కుల ర‌క్ష‌ణ విష‌యంలో న్యాయ‌స్థానాలు సీరియ‌స్ గా ఉంటాయ‌నే విష‌యం తెలుసుకోవాల‌ని కేంద్రానికి సుప్రీం హిత‌బోధ చేసింది. ఫోన్ల ట్యాపింగ్‌, స్పైవేర్ ఉప‌యోగిస్తున్న తీరుపైన జస్టిస్ రవీంద్రన్ “సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్స్, నెట్‌వర్క్‌లు మరియు హార్డ్‌వేర్” ప్యానెల్ పనితీరును పర్యవేక్షిస్తారు. ఈ క‌మిటీలో నవీన్ కుమార్ చౌదరి, ప్రభాహరన్ పి మరియు అశ్విన్ అనిల్ గుమాస్తే స‌భ్యులుగా ఉంటార‌ని సుప్రీం తెలిపింది. మాజీ IPS అధికారి అలోక్ జోషి మరియు సందీప్ ఒబెరాయ్ — చైర్మన్, సబ్ కమిటీ (ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్టాండర్డైజేషన్/ఇంటర్నేషనల్ ఎలక్ట్రో-టెక్నికల్ కమీషన్/జాయింట్ టెక్నికల్ కమిటీ) — కమిటీ విధివిధానాల‌ను పర్యవేక్షించడానికి జస్టిస్ రవీంద్రన్‌కు సహాయం చేస్తారని సుప్రీం కోర్టు స్ప‌ష్టం చేసింది.

“రాజకీయ వాక్చాతుర్యాన్ని అనుమతించకుండా, రాజ్యాంగ ఆకాంక్షలు మరియు చట్టబద్ధమైన పాలనను సమర్థించడమే ఈ క‌మిటీ వేసే ప్రయత్నమ‌ని ధర్మాసనం స్ప‌ష్టం చేసింది. రాజకీయ పొదల్లోకి రాకూడదని న్యాయ‌స్థానం ఎల్లప్పుడూ స్పృహతో ఉందని తెలిపింది. “నాగరిక ప్రజాస్వామ్య సమాజంలో గోప్యతపై ప్ర‌తి పౌరునికి అవ‌స‌రం. గోప్యత అనేది జర్నలిస్టులు లేదా సామాజిక కార్యకర్తలకు సంబంధించిన ఏకైక ఆందోళన కాదని అందుకే త్రిస‌భ్య క‌మిటీని వేసి, అస‌లు నిజాల‌ను బ‌య‌ట‌కు తీసే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని సుప్రీం వెల్ల‌డించింది.
చట్టబద్ధమైన ప్రజాస్వామ్య దేశంలో, రాజ్యాంగం ప్రకారం చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన విధానాన్ని అనుసరించడం ప్ర‌తి ఒక్క‌రి విధి. త‌ద్వారా తగినంత భద్రత కోరుకుంటున్న పౌర స‌మాజంలో విచక్షణారహిత గూఢచర్యం త‌గ‌దని సుప్రీం అభిప్రాయ‌ప‌డింది. పెగాసస్ స్పైవేర్‌ను కేంద్రం ఉపయోగించాలా లేదా అనే అంశంపై ఒక క్లారిటీకి రావ‌డానికి సుప్రీం క‌మిటీని వేసింద‌ని ప్ర‌క‌టించింది.