Arundhati Roy : అరుంధతీ రాయ్ ని అరెస్టు చేస్తారా ?

అంటే 13 సంవత్సరాలు తర్వాత ఉన్నట్టుండి ప్రభుత్వం ఉలిక్కిపడిందా? మరి ఇన్నాళ్లుగా ఈ కేసు విషయం ఏమైనట్టు? ఇలాంటి ప్రశ్న ఎవరికైనా కలగడం సహజమే.

  • Written By:
  • Publish Date - October 11, 2023 / 07:24 PM IST

డా. ప్రసాదమూర్తి

అరుంధతీ రాయ్ (Arundhati Roy) మీద 2010లో (Arundhati Roy in 2010 speech case) కేసు పెట్టారు. ఆమెను విచారించమని ఇప్పుడు 2023లో ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్ ఆదేశాలు జారీ చేశారు. అంటే 13 సంవత్సరాలు తర్వాత ఉన్నట్టుండి ప్రభుత్వం ఉలిక్కిపడిందా? మరి ఇన్నాళ్లుగా ఈ కేసు విషయం ఏమైనట్టు? ఇలాంటి ప్రశ్న ఎవరికైనా కలగడం సహజమే. దానికి సమాధానం కూడా మనకు తెలిసిందే. ఏలిన వారికి ఎప్పుడు అనుగ్రహం కలుగుతుందో.. ఎప్పుడు ఆగ్రహం కలుగుతుందో ఎవరికీ తెలియదు. అనుగ్రహం కలిగితే ఉన్న కేసులు పోతాయి. ఆగ్రహం కలిగితే మరుగున పడిన కేసులు తటాలను వెలుగు చూస్తాయి. అరుంధతీ రాయ్ విషయంలో ఇదే జరిగింది.

అసలు ఏం జరిగింది? అంతర్జాతీయ గుర్తింపు, ఖ్యాతి గడించిన ఒక భారతదేశ రచయిత్రి పైన దేశద్రోహం కేసు ఎలా మోపబడింది? ఆ కేసు పెట్టిన 13 సంవత్సరాలకు గాని ఆమె మీద ఇప్పటి వరకు ఎందుకు విచారణ జరగలేదు అనే విషయాలను ఒకసారి చూద్దాం. 2010 అక్టోబర్ 21వ తేదీన దేశ రాజధానిలో రాజకీయ ఖైదీల విడుదలకు సంబంధించిన ఒక కమిటీ, జాతీయ సదస్సును ఏర్పాటు చేసింది. ఆ సదస్సులో అరుంధతి రాయ్ ప్రసంగించారు. ఆమెతోపాటు మరికొందరు కూడా పాల్గొన్నారు. ఆమె తన తన ప్రసంగంలో భారతదేశం నుండి కాశ్మీర్ ను విడదీయాలని పేర్కొన్నట్టుగా ఆమె మీద దేశద్రోహు ఆరోపణ చేస్తూ అదే సంవత్సరం అక్టోబర్ 28వ తేదీన పిటిషన్ వేశారు. ఆ మర్నాడు అంటే అక్టోబర్ 29వ తేదీన ఢిల్లీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు కేసు నమోదు అయింది. ఆమెతోపాటు మరికొందరి మీద కూడా వివిధ రకాల ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీరు వీరిలో మన కవి వరవరరావు కూడా ఉన్నారు. ఇందులో దేశద్రోహం, జాతుల మధ్య, మతాల మధ్య, వివిధ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణానికి అనుకూలమైన వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణ మోపబడింది. ఇంత కాలానికి అంటే 13 సంవత్సరాల తర్వాత అక్టోబర్ 10, 2023న ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ వీకే సక్సేనా అరుంధతీ రాయ్ మీద, కాశ్మీర్ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ షేక్ షౌకత్ హుస్సేన్ మీద విచారణ సాగించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రఖ్యాత బుకర్ ప్రైజ్ విజేత అరుంధతీ రాయ్ మీద 13 సంవత్సరాల క్రితం పెట్టిన కేసు ఇప్పటిదాకా ఎందుకు బయటకు రాలేదనేది ఒక అనుమానం. ఇప్పుడే ఎందుకు వచ్చింది అని మరో అనుమానం. వీటికి ఎవరు చూపే కారణాలు వారికి ఉండవచ్చు. కానీ అరుంధతీ రాయ్ గత 25 సంవత్సరాలుగా ప్రఖ్యాత వార్త పత్రికల్లో వ్యాసాలు రాస్తూనే ఉన్నారు. అనేక విదేశీ సంస్థలకు స్వదేశీ సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నారు. ఆవిడ రాసే ప్రతి మాట.. పలికే ప్రతి పలుకు భారతదేశంలో గత పాతికేళ్ల కాలంలో జరిగిన రాజకీయ పరిణామాలకు అద్దం పడతాయి. ఇన్ని సంవత్సరాలుగా ఆమె భారత దేశంలో తలెత్తుతున్న నియంతృత్వ ఫాసిస్టు పోకడలపై నిర్విరామంగా తన నిరసన తెలియజేస్తూనే ఉన్నారు. కానీ ఎన్నడూ ఆమె మీద ఎలాంటి చర్యలూ ఎవరూ తీసుకోలేదు. 2010లో ఆమె ఢిల్లీ సదస్సులో మాట్లాడిన తర్వాత ఆమె ప్రసంగం పెద్ద సంచలనమే అయింది. ఆమె మీద చర్యలు తీసుకోవాలని, ఆమెను అరెస్టు చేసి జైల్లో పెట్టాలని మతవాద అతివాద రాజకీయ దుందుడుకు నినాదాలు వెల్లువెత్తాయి. ఆ సమయంలో అరుంధతి అనేక పత్రికలకు ఇంటర్వ్యూలు ఇవ్వడం వ్యాసాలు రాయడం చేసింది. అప్పట్లో ఆమె కాశ్మీర్ విషయంలో జవహర్లాల్ నెహ్రూ లాంటివారు ఏం చెప్పారో తాను అదే చెప్పానని, తనను ప్రాసిక్యూట్ చేయడం అంటే జవహర్లాల్ నెహ్రూని కూడా మరణానంతరం ప్రాసిక్యూట్ చేయాల్సి ఉంటుందని, ఆమె నెహ్రూ ప్రసంగాల నుంచి, ఇతర ప్రముఖుల వ్యాఖ్యల దాకా చాలా తన వ్యాసాలలో ఉటంకించింది. దీనితో అప్పట్లో ప్రభుత్వం ఆమెకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడానికి ముందుకు వెళ్లలేదు. కానీ ఇప్పుడే ఆమెపై ఎప్పుడో 13 ఏళ్ల నాటి కేసును ఎందుకు తిరగతోడినట్టు అనే అనుమానం అందరికీ కదులుతుంది. దీనికి కారణం ఒకటి కనిపిస్తుంది.

అరుంధతీ రాయ్ చార్లెస్ వెలోన్ ఫౌండేషన్ వారు బహూకరించిన 45వ యూరోపియన్ ఎస్సే ప్రైజ్ స్వీకరించడానికి వెళ్ళినప్పుడు సెప్టెంబర్ 12 న ఒక ప్రసంగం చేశారు. ఆ సుదీర్ఘ ప్రసంగంలో తాను గత పాతికేళ్లుగా రాస్తున్న వ్యాసాల కోసం ఈ పురస్కారాన్ని తనకు అందించారని చెప్పారు. భారతదేశం మొదట మెజారిటీ వాదంగా, ఆ తర్వాత పూర్తిస్థాయి ఫాసిజంగా ఎలా పతనమవుతూ వచ్చిందో తన వ్యాసాలు చెప్తాయని ఆమె అన్నారు. ఈ సందర్భంగా ఆమె సాగించిన సుదీర్ఘ ప్రసంగంలో, భారత దేశంలో ఇటీవల కాలంలో జరిగిన జరుగుతున్న పరిణామాలను, ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నియంతృత్వ పోకడలను ప్రస్తావించారు. గుజరాత్ అల్లర్ల మీద బిబిసి డాక్యుమెంటరీ చెప్పిన విషయాలను, కార్పొరేట్ దిగ్గజం గౌతమ్ అదాని, భారత ప్రధాని మోదీ మధ్య ఉన్న బంధాన్ని, అలాగే దేశంలో మైనారిటీల పైన సాగుతున్న అణచివేతను ఆమె తీవ్ర ధ్వనితో నిరసిస్తూ తన ఉపన్యాసాన్ని కొనసాగించారు. ఈ ప్రసంగం భారతీయ మీడియాలో పెద్ద సంచలనం అయిపోయింది. అసలే ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో తమకు వ్యతిరేకంగా ఏ ఒక్కరు చిన్న మాట మాట్లాడినా ప్రభుత్వం ఉలిక్కిపడుతోంది. న్యూస్ క్లిక్ లాంటి మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల మీద ఈ మధ్య సాగుతున్న ప్రభుత్వ దమననీతిని మనం చూస్తూనే ఉన్నాం. ఈ సందర్భంగా జర్నలిస్టులు సాగించిన నిరసన ప్రదర్శనలో పాల్గొని అరుంధతీ రాయ్ చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇక అరుంధతి రాయ్ కి కూడా చెక్ పెడదామని ప్రభుత్వం ఆలోచన చేసిందా? అంటే త్వరలో అరుంధతి అరెస్టు కాబోతుందా? మిగిలిన వారి మాట ఎలా ఉన్నా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అరుంధతీ రాయ్ పట్ల భారత ప్రభుత్వం తీసుకునే చర్యల పై ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి స్పందన వ్యక్తం అవుతుందనే విషయాలు ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారిపోయాయి. కేవలం విచారణతో సరిపెడతారా.. లేక అరుంధతీ రాయ్ గళాన్ని శాశ్వతంగా మూసేయడానికి ఆమెను నిర్బంధిస్తారా అనే విషయమే దేశవ్యాప్త సంచలన వార్తగా మారింది.

Read Also : Nara Lokesh : IRR కేసులో ముగిసిన నారా లోకేష్ సీఐడీ విచారణ.. నేరుగా ఢిల్లీకి బ‌య‌ల్దేరిన లోకేష్‌