World Gold Council report: బంగారు ప్రియులం మనమే..!

బంగారు (Gold) ఆభరణాలంటే మన దేశీయులకు ఎంత మక్కువో తెలియంది కాదు. పెళ్లి, గృహప్రవేశం, పండుగ.. ఇలా ఏ శుభకార్యమైనా మహిళలకు పసిడి ఆభరణాలు కొనుగోలు చేయడం మన సంప్రదాయం. దీంతో ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇండియాలో బంగారానికి ఫుల్‌ డిమాండ్ పెరిగింది.

Published By: HashtagU Telugu Desk
Gold

Gold

బంగారు (Gold) ఆభరణాలంటే మన దేశీయులకు ఎంత మక్కువో తెలియంది కాదు. పెళ్లి, గృహప్రవేశం, పండుగ.. ఇలా ఏ శుభకార్యమైనా మహిళలకు పసిడి ఆభరణాలు కొనుగోలు చేయడం మన సంప్రదాయం. దీంతో ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇండియాలో బంగారానికి ఫుల్‌ డిమాండ్ పెరిగింది. చైనా తరువాత అత్యధిక బంగారం కొనుగోలు చేసిన దేశంగా ఇండియా రికార్డులొకెక్కింది. 2021లో భారతీయులు 611 టన్నుల ఆభరణాలను కొనుగోలు చేశారు. ఈ విషయంలో చైనా -673 టన్నులతో తరవాత స్థానంలో ఉందని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ -డబ్ల్యూజీసీ నివేదిక వెల్లడించింది. మధ్యతరగతి ప్రజలు బంగారు ఆభరణాలపై మక్కువ చూపడమే ఇందుకు కారణం.

ఆభరణాలకు గిరాకీ-వ్యాపారం-మార్కెట్‌ ధోరణులపై ఆర్టికల్‌ ప్రచురించింది వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్ . దీని ప్రకారం పూర్తిగా బంగారంతో చేసిన సాదా ఆభరణాల విక్రయాలే 80-85% జరుగుతున్నాయి. అవి కూడా 22 క్యారెట్లవే. 18 క్యారెట్ల ఆభరణాల విక్రయాలు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. ఇండియాలోని మొత్తం ఆభరణాల వ్యాపారంలో పెళ్ళిళ్ల సీజన్‌లోనే దాదాపుగా 50శాతం అమ్మకాలు జరుగుతున్నాయని నివేదిక తెలిపింది. ఇక రోజువారీ ధరించే నగల వాటా 40-45 శాతంగా ఉంటోంది . ఫ్యాషన్‌ జువెలరీ ఆభరణాల వాటా 5-10 శాతంగా ఉంది.55-58% కొనుగోళ్లు గ్రామీణ ప్రాంతాల్లోనే జరుగుతున్నాయి. ఆదాయాలు కలిగిన వారిగా కూడా వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్ సర్వే నిర్వహించింది . 2-5 లక్షల వార్షికాదాయం కలిగిన వారిలో అత్యధికులు ఆభరణాలు కొంటుంటే, తదుపరి స్థానాల్లో 5-10 లక్షలు, 1-2 లక్షల వార్షికాదాయం కలిగిన కుటుంబాలుంటున్నాయి. ఇక దేశీయ వ్యాపారంలో 40% వాటాతో దక్షిణ భారతదేశం అగ్రస్థానంలో ఉంది.

Also Read: Congress: రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో మళ్ళీ రచ్చ

దేశీయంగా పెద్దలతో పోలిస్తే యువతకు బంగారంపై ఆసక్తి తగ్గుతోంది. ఆభరణాలను సామాజిక హోదాకు దర్పణంగా, ధర పెరుగుతున్నందున సంపద సృష్టికి ఉపయోగ పడేదిగా పాతతరం భావిస్తోంది. అయితే పెట్టుబడి అవకాశాలు గణనీయంగా పెరగడంతో, సంపద వృద్ధి చెందుతుందనే భావనతో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు యువత పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పెద్దపెద్ద బంగారు ఆభరణాల స్థానంలో చిన్నపాటి వజ్రాభరణాలు, ప్లాటినం ఆభరణాలపై యువత మక్కువ చూపుతోందని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్ తెలియచేసింది. అయితే ఆర్థిక వృద్ధి, పెరుగుతున్న పట్టణీకరణ, మధ్యతరగతి వర్గీయుల సంఖ్య పెరగడం పసిడికి కలిసొచ్చే అంశాలని డబ్ల్యూజీసీ పేర్కొంది.

  Last Updated: 21 Jan 2023, 01:02 PM IST