Site icon HashtagU Telugu

Google Vs India Apps : ఆ యాప్స్ డిలీట్.. గూగుల్ ప్లేస్టోర్‌‌కు కేంద్రం వార్నింగ్.. ఎందుకు ?

Google Vs India Apps

Google Vs India Apps

Google Vs India Apps : టెక్  దిగ్గజం గూగుల్.. సర్వీసు ఫీజు చెల్లించని యాప్​లను ప్లేస్టోర్​ నుంచి తొలగించే  ప్రక్రియను ప్రారంభించింది. తమ ప్లాట్​ఫామ్​ ద్వారా ప్రయోజనాలు పొందుతున్నప్పటికీ, భారత్​కు చెందిన కొన్ని కంపెనీలు సర్వీస్​ ఫీజు చెల్లించడం లేదని గూగుల్ ఆరోపించింది.  గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించిన యాప్స్ జాబితాలో షాదీ, మాట్రిమోనీ, భారత్​ మాట్రిమోనీ, ఆల్ట్​ (ఆల్ట్​ బాలాజీ), కుకు ఎఫ్​ఎం, ​ క్వాక్​క్వాక్, ట్రూలీ మ్యాడ్లీ వంటివి ఉన్నాయి. ప్రస్తుతం ఈ యాప్స్ గూగుల్ ప్లే స్టోర్​లో కనిపించడం లేదు. దీనిపై భారత ప్రభుత్వం శనివారం ఉదయం ఘాటుగా స్పందించింది. ప్లేస్టోర్ నుంచి యాప్​లను తొలగిస్తే ఊరుకునేది లేదని కేంద్ర టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్​ గూగుల్‌కు వార్నింగ్ ఇచ్చారు. సర్వీస్ ఫీజు చెల్లింపు వివాదాన్ని పరిష్కరించుకునేందుకు వచ్చేవారం గూగుల్, టెక్ స్టార్టప్ కంపెనీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. భారతదేశంలోని ప్లేస్టోర్​ నుంచి గూగుల్ కంపెనీ కొన్ని యాప్​లను తొలగించడంపై అశ్వినీ వైష్ణవ్​ అసహనం వ్యక్తం చేశారు.

We’re now on WhatsApp. Click to Join

గూగుల్ కంపెనీ ప్లేస్టోర్​లోని యాప్​లపై ఇంతకుముందు 15 శాతం నుంచి 30 శాతం దాకా సర్వీసు ఛార్జీలను వసూలు చేసేది. అయితే ఛార్జీల వ్యవస్థను తొలగించాలని కాంపిటీషన్​ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆదేశాలు ఇచ్చింది. వీటిని పట్టించుకోని గూగుల్.. కేవలం ఫీజులను 11 శాతం నుంచి 26 శాతం మేరకు తగ్గించి చేతులు దులుపుకుంది. తాము ఫీజులను తగ్గించినప్పటికీ చాలా యాప్​లు సర్వీస్ ఫీజు చెల్లించడం లేదని గూగుల్ వాదిస్తోంది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి భారత  సుప్రీం కోర్టు నిరాకరించింది. దీంతో ప్లేస్టోర్​లో ఉన్న యాప్​లు అన్నీ కచ్చితంగా సర్వీస్ ఛార్జ్ చెల్లించాలని గూగుల్ స్పష్టం చేసింది. ఛార్జీలు చెల్లించని యాప్‌లను  తొలగించడం కూడా మొదలుపెట్టేసింది.

Also Read : Photomath App : ఫోటో తీస్తే చాలు ‘లెక్క’ సాల్వ్.. గూగుల్ ‘ఫోటోమ్యాథ్’ యాప్

తమ యాప్స్‌ను ప్లే స్టోర్ నుంచి గూగుల్ (Google Vs India Apps) తీసేసినందుకు  సుప్రీం కోర్టులో గూగుల్‌ ప్లే స్టోర్‌ను సవాల్ చేసేందుకు డిస్నీ+ హాట్‌స్టార్‌, ట్రూలీ మ్యాడ్లీ, క్వాక్‌క్వాక్‌, స్టేజ్‌, మాట్రిమోనీ.కామ్‌, షాదీ.కామ్‌, ఇన్ఫోఎడ్జ్‌, అనాకడమీ, ఆహా, కుటుంబ్‌, టెస్ట్‌బుక్‌ రెడీ అయ్యాయి.  ఇక భారత్‌కు సొంత ప్లే స్టోర్ అవసరమనే విషయాన్ని ఇలాంటి పరిస్థితులు గుర్తు చేస్తున్నాయి. మేడిన్ ఇండియా ప్లే స్టోర్‌ను అందుబాటులోకి తేవాల్సిన అవసరముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Also Read : ISRO Vigyani : విద్యార్థులకు ‘ఇస్రో విజ్ఞాని’గా మారే ఛాన్స్.. అప్లై చేయండి